మానాలలోని అమరవీరుల స్థూపం
సాక్షి, ఆర్మూర్(నిజామాబాద్): జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత గ్రామాల ముఖచిత్రం మారిపోయింది. 2004 ఎన్నికలకు పూర్వం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత మారుమూల గ్రామాల్లో యువత ఎన్నికల్లో క్రియాశీలంగా పాల్గొనాలంటే తీవ్ర ఒత్తిడికి గుర య్యే వారు. ఎన్నికలను బహిష్క రించాలని మావోయిస్టులు పిలుపునివ్వడం.. మరోవైపు, కచ్చితంగా ఎన్నికల్లో పాల్గొనాలంటూ పోలీసు లు, అధికారులు ఒత్తిడి తేవడంతో ఆయా గ్రామాల ప్రజలు నలిగి పో యే వారు. ఫలితంగా గ్రామీణ యువతతో పాటు భూస్వాములు, రాజకీయ నాయకులు గ్రామాలను ఖాళీ చేసి వెల్లిపోయే వారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ఎన్నిక ల విధులు నిర్వహించడానికి సై తం ప్రభుత్వ ఉద్యోగులు భయాం దోళనకు గురయ్యేవారు. కానీ, 2018 ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తి భిన్నంగా మారిపోయాయి.
మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో రోడ్డు రవాణా వ్యవస్థ సరిగా లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి అం తంత మాత్రంగానే ఉండేది. ఈ క్రమంలో మావోయిస్టులతో పాటు వారి సానుభూతిపరులు సైతం గ్రామాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉండే వారు. కమ్మర్‌పల్లి మండల కేంద్రం నుంచి ఇనాయత్‌నగర్‌కు వెళ్లే దారిలో మావోయిస్టులు రోడ్డుపై అమర్చిన బాంబులు పేలి ముగ్గురు కానిస్టేబుళ్లు గాయాల పాలయ్యారు. 1996 నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ రోజే సిరికొండ మండలం రావుట్ల సమీపంలో మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఎస్సై విక్టర్.. మావోయిస్టులు పేల్చిన బాంబు కారణంగా మృత్యువాత పడ్డారు. మావోయిస్టుల దాడులకు భయపడి కమ్మర్‌పల్లి మండలం మానాల లాంటి మారుమూల గ్రామాల్లో ఎన్నికల విధులు నిర్వహించడానికి సైతం ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేసే వారు.
ఈ క్రమంలో 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక మావోయిస్టులతో జరిపిన చర్చల తర్వాత జిల్లాలో మావోల ప్రభావం తుడిచి పెట్టుకుపోయింది. దీంతో మారుమూల గ్రామమైన మానాలలో ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ బహిరంగ సభ సైతం ఏర్పాటు చేసి అధికారులతో పాటు ఈ ప్రాంత ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. క్రమంగా మావోయిస్టుల ప్రభావం తగ్గడం, రోడ్డు, రవాణా వ్యవస్థతో పాటు సెల్‌ఫోన్ల రాక కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు చైతన్యవంతులై మావోయిస్టుల భయం నుంచి క్రమంగా బయటికి వచ్చారు.
2009, 2014 ఎన్నికల్లో క్రియాశీలంగా పాల్గొని రాజకీయ పార్టీల తరపున ప్రచారాలు సైతం నిర్వహించారు. తాజాగా 2018 సార్వత్రిక ఎన్నికల్లో సైతం ఆయా రాజకీయ పార్టీల నుంచి పోటీలో నిలిచిన అభ్యర్థులు మారుమూల గ్రామాల్లోకి సైతం వెళ్లి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. నాటి మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో ప్రజలు అభ్యర్థుల ఎన్నికల ప్రచారాన్ని స్వాగతించడంతో పాటు వారు సైతం క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment