
ఏడాదికే బదిలీ
సాక్షి, అనంతపురం : జిల్లాలో పాలనను గాడిలో పెట్టడంతో పాటు స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన కలెక్టర్ డీ ఎస్ లోకేష్‌కుమార్‌కు అధికార పార్టీ నేతలు బదిలీని కానుకగా ఇచ్చారు. తాము చెప్పినట్లు వినకపోతే ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుందని పరోక్షంగా సంకేతాలు పంపారు. లోకేష్‌కుమార్ జిల్లాకు వచ్చిన ఏడాదికే బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది.
ఆయన్ను సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డెరైక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో విశాఖపట్నం కలెక్టర్‌గా ఉన్న సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను నియమించింది. లోకేష్ కుమార్ 2013 జూన్ 13న జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ 13 నెలల్లోనే జిల్లా పాలనలో తనదైన ముద్ర వేశారు. మృధుస్వభావి అయిన ఆయన ఏ అధికారిని, ఉద్యోగిని నొప్పించిన దాఖలాలు లేవు. ప్రజలతో మమేకం కావడంలో భాగంగా ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాలకు విస్తరించారు.
స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో ఫలానా పార్టీకీ అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలకు తావులేకుండా యంత్రాంగాన్ని ముందుకు నడిపించారు. ఇది జిల్లాలోని టీడీపీ నాయకులకు అగ్రహాన్ని తెప్పించింది. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోకి రావడంతో కలెక్టర్ బదిలీ కోసం సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా తనను ఎలాగైనా గెలిపించేలా చూడాలని ఉరవకొండ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ కలెక్టర్‌ను కోరినట్లు విమర్శలున్నాయి. అందుకు ఆయన ససేమిరా అనడంతో కేశవ్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోయినట్లు తెలిసింది.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లి తనకు పదవిని దూరం చేసిన లోకేష్‌కుమార్‌ను జిల్లా నుంచి బదిలీ చేయాలని మొర పెట్టుకున్నట్లు తెలిసింది. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత కూడా కలెక్టర్ బదిలీకి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. జిల్లాలోని తాత్కాలిక డీలర్లందర్నీ తొలగించి తాము చెప్పిన వారిని నియమించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే రోష్టర్ పాటించకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందనికలెక్టర్ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో అప్పటికే జారీ చేసిన నియామకపు నోటిఫికేషన్లను సైతం వాయిదా వేశారు. ఇది మంత్రుల ఆగ్రహానికి కారణమైంది. కలెక్టర్ చురుగ్గా వ్యవహరించరనే ఫిర్యాదుతో మూకుమ్మడిగా సీఎంపై ఒత్తిడి తెచ్చి బదిలీ చేయించినట్లు సమాచారం. కలెక్టర్ బాటలోనే జిల్లాపరిషత్ సీఈఓ విజయేందిర, ఎస్పీ సెంథిల్‌కుమార్, అడిషనల్ ఎస్పీ రాంప్రసాద్‌లపై కూడా బదిలీ వేటు పడనున్నట్లు తెలిసింది. ఆ తరువాత డీఎస్పీలు, ఆర్డీఓలు, సీఐలపైనా వరుసగా బదిలీల వేటు పడనుందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ మార్కుతో పోస్టింగ్‌లలోకి వచ్చిన వారందర్నీ తప్పించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కాగా హైదరాబాద్‌కు బదిలీ అయిన కలెక్టర్ లోకేష్‌కుమార్ గురువారం రిలీవ్ కానున్నారు. జాయింట్ కలెక్టర్ సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. కొత్త కలెక్టర్ విధుల్లో చేరేవరకు జేసీ ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా కొనసాగుతారు.
‘అనంత’లో పనిచేయడం
మంచి అనుభూతి
అనంతపురం జిల్లాలో ఏడాది పాటు పని చేయడం మంచి అనుభూతినిచ్చిందని కలెక్టర్ లోకేష్‌కుమార్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో జేసీ సత్యనారాయణ అధ్యక్షతన కలెక్టర్‌కు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్‌కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో ఏడాది పాటు పనిచేసినా, నిన్న వచ్చి.. వెంటనే వెళ్లిపోతున్నట్లు ఉందన్నారు. బదిలీపై జిల్లాకు వచ్చినప్పుడు కార్యాలయానికి రాగానే.. ఇక్కడ ఉన్న చెట్లు.. చేమలు తనను ఎంతగానో కట్టిపడేశాయన్నారు. ఆ అనుభూతుల్ని వెంటనే తన కుటుంబ సభ్యులతో పంచుకున్నానని చెప్పారు. విధుల్లో చే రినప్పటి నుంచి తాను రెండు రోజుల సెలవు పెట్టిన దాఖలాలు అసలు లేవన్నారు.
ఎందుకంటే.. ప్రజాసేవకు ఎక్కడ దూరమవుతానోనన్న బాధ తనను వెంటాడేదన్నారు. తాను ఎక్కడ పనిచేసినా నెగిటివ్ అంశాలను ఎక్కువగా గుర్తు పెట్టుకునేవాడినని, అలాంటిది ఇక్కడ ఎలాంటి నెగిటివ్ అంశాలూ మదిలో లేకుండా వెళుతున్నానని చెప్పారు. జిల్లాలోని ఉద్యోగులందరి సహకారంతోనే అన్ని అంశాల్లో విజయం సాధించామన్నారు. స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో టీం వర్క్ చేయడం వల్లే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించగలిగామన్నారు.
గ్రీవెన్స్‌కు, ఇతర కార్యక్రమాల నిమిత్తం గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు మరచిపోలేనన్నారు. విధి నిర్వహణలో ఏ ఒక్కర్ని నొప్పించినా.. ఆ తరువాత తానే బాధపడతానని చెబుతూ ఉద్యోగుల పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. ఎక్కడ పనిచేసినా బదిలీ అయిన వెంటనే రిలీవ్ కావడం తనకు అలవాటన్నారు.
- కలెక్టర్ లోకేష్‌కుమార్