అధికారుల.. వెనుకంజ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధి కోసం బీఆర్‌జీఎఫ్‌ను 2006లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీని కింద అభివృద్ధి చేసేందుకు ఎంతో వెనుకబడి ఉందన్న దృష్టితో విజయనగరం జిల్లాను మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంపిక చేశారు. ఈక్రమంలో సామాజిక పరమైన అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం ఏటా నిధులు విడుదల చేస్తోంది. 2014-15కు సంబంధించి జిల్లాకు రూ.22.94కోట్లు కేటాయింపులు జరిగాయి.
ఆ మేరకు ప్రతిపాదిత పనులతో ప్రణాళిక తయారు చేసి ఈనెల 26వ తేదీలోగా అందజేయాలని గతనెల 12వ తేదీన జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. రోడ్లు, సామాజిక, పాఠశాలల, అంగన్‌వాడీ భవనాలు తదితర నిర్మాణాల్ని ఈ ప్రణాళికలో పొందుపర్చాల్సి ఉంది. అలా గే గత ఏడాది చేపట్టి అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను తాజా ప్రణాళికలో చేర్చాలని స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
అయితే, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ప్రణాళిక తయారయ్యే పరిస్థితి మా త్రం కన్పించడం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రణాళిక తయారీపై జిల్లా పరిషత్ అధికారులు కనీసం దృష్టి పెట్టలేదు. కొత్తగా వచ్చిన పాలకవర్గం ద్వారా పనులు ప్రతిపాదించేలా చేస్తే వారికి గౌరవం ఇచ్చినట్టు అవుతుందనే అధికారుల ఆలోచనే ప్రణాళిక తయారీలో వెనుకబాటుకు కారణంగా తెలుస్తోంది.
వాస్తవానికైతే షెడ్యూల్ జారీ చేసిన మే 12వ తేదీ నుంచి ప్రణాళిక తయారీకి చర్యలు తీసుకోవాలి. షెడ్యూల్ విడుదలైన నాటి నుం చి ఏడు రోజుల వరకు గ్రామసభలు పెట్టి పనులను గుర్తించాలి. కొత్తగా చేపట్టే పనుల తో పాటు అసంపూర్తిగా ఉన్న పనులను అందులో ప్రతిపాదించాలి. 8,9వ రోజులోగా గ్రామస్థాయిలో అనుమతి పొందాలి. ఆ జాబి తాలను 10 నుంచి 12వ రోజులోగా మండలాలకు పంపించాలి. 13,14వ రోజులోగా మండల స్థాయిలో సమావేశం నిర్వహించి, గ్రామస్థాయి ప్రతిపాదనలను చర్చించాక అనుమతి తెలపాలి. 15నుంచి 17వ రోజు లోగా జిల్లా పరిషత్‌కు పంపించాలి. 18 నుంచి 21 రోజులోగా మండల ప్రణాళికలను పరిశీలించాలి.
22నుంచి 24వ రోజులోగా జిల్లా పరిషత్‌లో తుది నిర్ణయం తీసుకోవాలి. అలాగే జిల్లా పరిషత్ ప్రత్యేకంగా ఒక ప్రణాళిక తయారు చేయాలి. 25 నుంచి 27వ రోజులోగా మండల ప్రణాళికను, జిల్లా పరిషత్ ప్రణాళికను జిల్లా ప్రణాళిక కమిటీ(డీపీసీ)కి పంపించా లి. 28నుంచి 31వ రోజులోగా డీపీసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. దాన్ని 32వ రోజున ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ అంతా జరగాలంటే షెడ్యూల్ విడుదలైన మే 12వ తేదీ నుంచి ప్రణాళిక తయారీ ప్రారంభం కావాలి. కానీ ఇంతవరకు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
స్పష్టత కరువు
కొత్త పాలకవర్గం కొలువు దీరెదెప్పుడో? ప్రణాళిక తయారీకి చర్యలు తీసుకునేదెప్పుడో? అంతా స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం నిర్దేశించిన ఈనెల 26వ తేదీలోగా బీఆర్‌జీఎఫ్ ప్రణాళిక సమర్పించే అవకాశం కనిపించడం లేదు. అదే జరిగితే షెడ్యూల్ గడువు ముగిసిన తర్వాత ఏమవుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్‌కే సర్కార్ కట్టుబడితే జిల్లాకు కేటాయిం చిన రూ.22.94కోట్లకు గ్రహణం పట్టినట్లే. ఈ నేపథ్యంలో సర్కార్ చొరవ తీసుకుని ప్రత్యేక అనుమతి ఇస్తే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.