బీవీపాళెం(తడ), న్యూస్‌లైన్: రాష్ట్ర సరిహద్దులోని భీములవారిపాళెం ఉమ్మడి తనిఖీ కేంద్రంలో అక్రమాలను సమూలంగా నిరోధించేందుకు ఏసీబీ అధికారులు నడుం బిగించారు. ఈ క్రమంలో నెలరోజుల్లో ముచ్చటగా మూడోసారి చెక్‌పోస్ట్‌పై ఆకస్మిక దాడి నిర్వహించారు. వివిధ విభాగాల్లో అక్రమంగా ఉన్న రూ.46,180 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వరుస దాడుల నేపథ్యంలో చెక్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది హడలిపోతున్నారు. ఏసీబీ డీఎస్పీ జె.భాస్కర్‌రావు ఆధ్వర్యంలో 22 మంది సభ్యుల బృందం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా భీములవారిపాళెం చెక్‌పోస్టులోకి ప్రవేశించింది.
ఆ సమయంలో రవాణాశాఖ కౌంటర్ బయట స్టాంపింగ్ వేసే చోట బ్యాగు కింద రూ.1,200, సమీపంలోని బైక్ ట్యాంక్ కవర్‌లో రూ.1,300, వాణిజ్యపన్నుల శాఖ ఇన్‌కమింగ్ కార్యాలయం వద్ద రూ.2,400, అవుట్ గోయింగ్ వద్ద రూ.2,880 స్వాధీనం చేసుకున్నారు. ఆయా కౌంటర్ల వద్ద కాసేపు ఏసీబీ అధికారులు నిలుచోగా డ్రైవర్లు వచ్చి భారీగా నగదు ఇచ్చి వెళ్లారు. ఇలా రవాణా శాఖ కౌంటర్ వద్ద రూ. 18,100, అవుట్ గోయింగ్ వద్ద రూ. 7,500, ఇన్ కమింగ్ వద్ద రూ.12,800 వసూలయ్యాయి.
పరిస్థితి మెరుగుపడుతోంది
చెక్‌పోస్టులో పరిస్థితి క్రమేణా మెరుగుపడుతోందని డీఎస్పీ భాస్కర్‌రావు అన్నారు. గత దాడులతో పోలిస్తే అక్రమంగా వసూలు చేసిన నగదు తక్కువ మొత్తంలో ఉందన్నారు. అక్టోబర్ 10న నిర్వహించిన దాడిలో రూ.1.16 లక్షలు, డిసెంబర్ 21న రూ.1.10 లక్షలు, 29న రూ.60 వేలుతో పాటు ప్రతిసారీ ప్రైవేటు వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ చిక్కారని వివరించారు.
ఈ సారి మాత్రం ప్రైవేటు వ్యక్తులెవరూ తారసపడలేదన్నారు. అయితే దాడుల సందర్భంలో విధుల్లో ఉన్న సిబ్బందితో పాటు పరిపానాధికారి, ఎంవీఐలను బాధ్యులు చేసి కేసు నమోదు చేస్తామన్నారు. దాడుల్లో ఇన్‌స్పెక్టర్లు కె.వెంకటేశ్వర్లు, టీబీ శ్రీనివాసరావు, కృపానందం, ఎస్సై వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనివాస్, సుబ్బారావుతో కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
భిన్నమైన వాతావరణం
దాడులకు వచ్చిన ప్రతిసారి ఏసీబీ అధికారులు మూడు కౌంటర్ల వద్ద నిలబడి డ్రైవర్లు ఇచ్చివెళ్లే నగదును సిబ్బందిలా వసూలు చేసేవారు. ఇలా వసూలైన మొత్తాన్ని చివరలో అక్రమ సంపాదన కింద లెక్కిస్తారు. వరుస దాడుల నేపథ్యంలో పది రోజులుగా చెక్‌పోస్టులో అమలుచేస్తున్న సంస్కరణల్లో భాగంగా అధికంగా డబ్బులు ఇవ్వొద్దంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. బలవంతపు వసూళ్లకు బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తనిఖీలకు వచ్చిన ఏసీబీ అధికారులకు భిన్నమైన వాతావరణం కనిపించింది.
డబ్బులు ఎక్కడా..అని డ్రైవర్లను ఏసీబీ సిబ్బంది ప్రశ్నించగా కొందరు మారు మాట్లాడకుండా ఇచ్చేశారు. కొందరు మాత్రం మొన్న వద్దన్నారుగా అంటూ అనుమానంగా చూస్తూ ఇచ్చారు. మరికొందరు మాత్రం ఎందుకివ్వాలంటూ ప్రశ్నించారు. పత్రాలన్నీ సరిగా ఉన్నాయి కదా..డబ్బు ఎందుకిస్తున్నావంటూ తునికి చెందిన డీసీఎం వ్యాన్ డ్రైవర్ వర్మను ఓ ఏసీబీ అధికారి ప్రశ్నించారు. ఏదో ఫార్మాలిటీగా ఇస్తున్నామంటూ ఆయన సమాధానమివ్వడం గమనార్హం.
ముచ్చటగా మూడోసారి
Published Sun, Jan 19 2014 5:03 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement