అది మీకు.. ఇది మాకు! | For us it is like it ..! | Sakshi
Sakshi News home page

అది మీకు.. ఇది మాకు!

Published Thu, Jul 30 2015 2:03 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM

అది మీకు.. ఇది మాకు!

అది మీకు.. ఇది మాకు!

సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని ఖజానా కార్యాలయాల అధికారులు, సిబ్బందికి బొత్తిగా భయమే లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బలహీనతను ఆసరా చేసుకొని లక్షలాది రూపాయాల లంచాన్ని ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. పీఆర్సీ అరియర్స్ బిల్లుల మంజూరులో ఉద్యోగులను నిట్టనిలువుగా దోపిడీ చేస్తున్నారు. ఏసీబీ వరుస దాడుల నేపథ్యంలో కూడా బహిరంగంగా మామూళ్లకు తెగబడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
 
 నూతన పీఆర్సీ అమలులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన అరియర్స్ బిల్లుల కోసం వస్తున్న ఉద్యోగులతో జిల్లాలోని ఉప ఖజానా కార్యాలయాలు పది రోజులుగా కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఉద్యోగికి వారి మూల వేతనాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.40 వేల దాకా అరియర్స్ డబ్బులు రానున్నాయి. ఈ మేరకు వివిధ శాఖల డ్రాయింగ్ ఆఫీసర్లు తమ సిబ్బంది బిల్లులను ఖజానా కార్యాలయాలకు సమర్పించారు.
 
  అయితే చేయి తడిపితేనే బిల్లుపై చేయి పెడతామంటూ ఖజానా అధికారులు తెగేసి చెబుతున్నట్లు సమాచారం. మామూళ్లు ఇవ్వకపోతే తాము పెట్టిన బిల్లులపై ఏవైనా కొర్రీలు వేస్తారేమోనని భయపడుతున్న ఉద్యోగులు అడిగిన మొత్తం ఇచ్చి వస్తున్నారు. జిల్లాలో సుమారు 20 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రూ.50 లక్షల పైనే మామూళ్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఇంతపెద్ద మొత్తంలో బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తుంటే అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు.
 
 సర్కారు ఆలస్యం వల్లే...
 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పీఆర్సీని అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేసిన ఆలస్యమే ఖజానా అధికారులకు కలిసి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పీఆర్సీ ఆర్థిక ప్రయోజనాలు 2015 ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు నగదు రూపంలో అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే. ఇందుకు సంబంధించిన జీఓను విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు ఈ నెల 8వ తేదిన ఆర్థిక శాఖ జీఓ నంబర్ 85 విడుదల చేసింది. దీంతో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన అరియర్స్ బిల్లుల మంజూరుకు మార్గం సుగమం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం మాదిరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడ ఏప్రిల్ నెలలోనే పీఆర్సీ జీఓలను ఇచ్చింటే ఉద్యోగులకు ఆనాడే కొత్త వేతనం చేతికి అంది ఉండేది. అరియర్స్ బాధ ఉండేది కాదు. ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి వేల రూపాయల అరియర్స్ వస్తుండడంతో ఖజానా అధికారులు చేయి చాచడానికి ఆస్కారం ఏర్పడింది. పెద్ద మొత్తంలో అరియర్స్ వస్తున్నపుడు ఆ బిల్లు చేసిన మాకు అందులో ఒకటి.. రెండు శాతం ఇస్తే ఏమవుతుందంటూ ఖజానా ఉద్యోగులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని పలువురు వాపోతున్నారు.
 
 సంఘాల నేతలే దళారులు..        
 ఖజానా అధికారులకు ఇవ్వాల్సిన మామూళ్ల విషయంలో ఉద్యోగులను ఒప్పించే బాధ్యతను ఆయా ఉద్యోగ సంఘాల నేతలే భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు ఈ తంతులో అత్యంత ఉత్సాహంగా పాలు పంచుకున్నట్లు ఆ శాఖలో గుసగుసలు విన్పిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగులకు అరియర్ డబ్బులను పుణ్యానికేమి ఇవ్వడం లేదు. న్యాయపరంగా వారికి రావాల్సిన జీతభత్యాల వ్యతాసాలే  చెల్లిస్తున్నారు. ఇలాంటి బిల్లుల మంజూరులో ఖజానా అధికారులు ఏవైనా ఇబ్బందులు ృసష్టిస్తే పోరాటబాటలో పయనించాల్సిన ఉద్యోగ సంఘాలు దళారుల అవతారమెత్తి మామూళ్లు వసూళ్లు చేయడం సిగ్గు చేటని పలువురు విమర్శిస్తున్నారు.
 
 ఉపాధ్యాయుల అరియర్స్ బిల్లుల చెల్లింపులో ఖాజీపేట, చాపాడు మండలాల ఎంఈఓలు ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. ఉపాధ్యాయ సంఘాలతో నిమిత్తం లేకుండా ఎమ్మార్సీ భవనంలో కూర్చొని ఉపాధ్యాయుల అరియర్స్ బిల్లులన్నీ ఓపిగ్గా తయారు చేసినట్లు సమాచారం. అనంతరం ట్రెజరీ అధికారులపై ఒత్తిడి పెట్టి మరీ బిల్లులు మంజూరు చేయించారని సమాచారం. ఆ రెండు మండలాలల్లో ఏఒక్క ఉపాధ్యాయుడు ఒక్క రూపాయి కూడా మామూలు ఇవ్వలేదని తెలిసింది. ఇదే రీతిలో మిగతా మండలాల్లోని ఎంఈఓలు వ్యవహరించి ఉంటే మామూళ్ల బెడద తప్పేదని పలువురు పేర్కొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement