state government jobs
-
గ్రూపు 4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నస్పూర్: గ్రూపు 4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. సోమవారం ఆయన నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.రాహుల్, ట్రెయినీ కలెక్టర్ పి.గౌతమి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు వేణు, శ్యామలాదేవి, జిల్లా పంచాయితీ అధికారి వెంకటేశ్వర్రావులతో కలిసి గ్రూప్ 4 పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడతూ జిల్లాలో 94 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 27,801 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు నస్పూర్: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్, ఆబ్కారీ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి చిన్నయ్య పాల్గొన్నారు. సికెల్ సెల్ నియంత్రణకు.. జిల్లాలో సికెల్ సెల్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుబ్బరాయుడుతో కలిసి సికెల్ సెల్ నిర్వహణ పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని కాసిపేట, మందమర్రి, దండేపల్లి, తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిఽధిలో 18,436 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రతీ ఆరోగ్య కేంద్రం పరిధిలో మూడు బృందాలు ఏర్పాటు చేసి సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా ఆరోగ్య శాఖ ఉపవైద్యాధికారి డాక్టర్ ఫయాజ్, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నాలుగు ఉద్యోగాలకు ఒకే పరీక్ష
సాక్షి, అమరావతి: ఒకే రాత పరీక్షతో దాదాపు నాలుగు ఉద్యోగాలకు అర్హత పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించే 19 రకాల ప్రభుత్వ ఉద్యోగాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఒక్కో కేటగిరీలో పేర్కొన్న ఉద్యోగాలన్నింటినీ ఒకే రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. కేటగిరీ–1, కేటగిరీ–2 ఉద్యోగాలకు సెప్టెంబర్ 1న ఉదయం వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. కేటగిరీ–3లోని ఉద్యోగాల భర్తీకి అదేరోజు సాయంత్రం రాతపరీక్ష నిర్వహిస్తారు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలన్నింటికీ కేటగిరీల వారీగా ఒకే రకమైన రాత పరీక్ష ఉంటుంది. కేటగిరీ–3లో మాత్రం ఒక్కొక్క రకమైన ఉద్యోగానికి ఒక్కొక్క రకమైన రాత పరీక్ష ఉంటుంది. ఒక్కొక్క ఉద్యోగానికి పేపరు–1, పేపరు–2 విధానంలో రాతపరీక్ష నిర్వహించినప్పటికీ రెండింటినీ ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒకేపూట నిర్వహిస్తారు. అంటే కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి అర్హత ఉంటే కేటగిరీ–3లోని పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకుని, రాత పరీక్షకు హాజరు కావొచ్చు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలు అన్నింటికీ ఒకే అభ్యర్థి ఏకకాలంలో పోటీపడే అవకాశం ఉండదు. అదే సమయంలో కేటగిరీ–3లోని 11 రకాల ఉద్యోగాలకు ఒకే అభ్యర్థి రెండు మూడింటికి ఒకే సమయంలో పోటీపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలన్నింటికీ అభ్యర్థి ఒకే రాత పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యతను దరఖాస్తు ఫారంలో స్పష్టంగా పేర్కొనాలని సూచిస్తున్నారు. సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ ఒకే విడత 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ కావడంతో దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నోటిఫికేషన్, దరఖాస్తు, రాతపరీక్ష వంటి అంశాలపై తలెత్తే సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055 నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కేటగిరీ–1 ఉద్యోగాలు 1.పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్–5) 2.మహిళా పోలీసు మరియు మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్ (లేదా) వార్డు మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీ 3.వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 4.వార్డు అడ్మిన్స్ట్రేటివ్ సెక్రటరీ కేటగిరీ–2 ఉద్యోగాలు గ్రూప్–ఎ 1.ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్–2) 2.వార్డు ఎమినిటీస్ సెక్రటరీ (గ్రేడ్–2) గ్రూపు–బి 1.విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్–2) 2.విలేజ్ సర్వేయర్ (గ్రేడ్–3) కేటగిరీ–3 కొలువులు 1.విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(గ్రేడ్–2) 2.విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 3.విలేజీ ఫిషరీస్ అసిస్టెంట్ 4.డిజిటల్ అసిస్టెంట్(పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6) 5.వార్డు శానిటేషన్ సెక్రటరీ(గ్రేడ్–2) 6.వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ(గ్రేడ్–2) 7.పశు సంవర్థక శాఖ సహాయకుడు 8.ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ(గ్రేడ్–3) 9.వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 10.వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 11.విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ (మహిళా పోలీసు, ఏఎన్ఎం ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులు) -
ఏ పరీక్ష రాయాలి దేవుడా?
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కోసం నిరుద్యోగులు ఏళ్లతరబడి చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటారు. కోచింగ్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొడుతూ పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ఉద్యోగం వచ్చేవరకూ ఒకదానివెంట మరొకటి పోటీ పరీక్షలు రాయడానికి సిద్ధమవుతుంటారు. అటువంటి సమయంలో రెండుమూడు ఉద్యోగ నియామక పరీక్షలు ఒకే రోజు జరిగితే వారి ఆందోళన వర్ణణాతీతం. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలకు పూనుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్, డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. మూడింటిలో ఏదో ఒకటి సాధించకపోమా అన్న ఆశతో ఉన్న అభ్యర్థుల ఆశలను ఆడియాసలు చేస్తూ అభ్యర్థులకు హాల్టికెట్లు అందాయి. ఒకే రోజు(జనవరి 6న) మూడు పరీక్షలు ఉన్నట్టు తేలడంతో ఏ పరీక్ష రాయాలిరా దేవుడా...అంటూ తలలు పట్టుకుంటున్నారు. మూడు పరీక్షలు ఒకే రోజే.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ నియామకాలకు వచ్చే ఏడాది జనవరి 6న దేశ వ్యాప్తంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు పరీక్షలు నిర్వహిస్తోంది. ఒకటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్, మరొకటి డీఎస్సీ పీఈటీ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్ష. ఇలా ఒకే రోజు మూడు నియామక పరీక్షలు ఉండటంతో అభ్యర్థులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహిస్తున్న రోజు రాష్ట్ర ప్రభుత్వాలు మరే పరీక్షను నిర్వహించకూడదు. కానీ టీడీపీ ప్రభుత్వం అదేరోజు ఏకంగా రెండు పరీక్షలు నిర్వహిస్తోంది. ఎన్నికల హడావిడే కారణం.. ఎన్నికలు సమీపిస్తుండటం, నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై రోజు రోజుకీ వ్యతిరేకత పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఆగమేఘాల మీద తక్కువ పోస్టులతో కూడిన నోటిఫికేషన్లను ఒకటి అరా ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఎదో విధంగా నియామక పరీక్షలు జనవరి నెలలో నిర్వహించి మమ అనిపించేయాలన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక లేకుండా ఎడాపెడా తేదీలను ప్రకటించి అభ్యర్థులను సందిగ్ధంలోకి నెడుతోంది. అసలే నియామకాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇలా ఒకే రోజు అన్ని పరీక్షలు నిర్వహించడం ఏమిటని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒకే రోజు ఏపీ, తెలంగాణలో పరీక్షలు.. జనవరి 6న నాకు హైదరాబాద్లో ఆర్పీఎఫ్ ఎగ్జామ్, అదే రోజు విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఉన్నాయి. ఒకే రోజు ఏపీ, తెలంగాణలో ఎలా పరీక్ష రాయాలో అర్థం కావటం లేదు. ప్రభుత్వం కనీస అవగాహన లేకుండా పరీక్ష తేదీలను ప్రకటించడం తప్పు. రాష్ట్ర ప్రభుత్వం కానిస్టేబుల్ పరీక్షను వాయిదా వేయాలి. – చిప్పల వెంకటేశ్వరరావు, అభ్యర్థి, జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా రెండు వారాలు వాయిదా వేయాలి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కానిస్టేబుల్ పరీక్షను రెండు వారాల పాట వాయిదా వేయాలి, అదే విధంగా జనవరి 6న డీఎస్సీ పీఈటీ దేహదారుఢ్య పరీక్షకు ఒక్క రోజు మినహాయింపు ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్నికల కోణంలో కాకుండా నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. – సమయం హేమంత్ కుమార్, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు -
అది మీకు.. ఇది మాకు!
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని ఖజానా కార్యాలయాల అధికారులు, సిబ్బందికి బొత్తిగా భయమే లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బలహీనతను ఆసరా చేసుకొని లక్షలాది రూపాయాల లంచాన్ని ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. పీఆర్సీ అరియర్స్ బిల్లుల మంజూరులో ఉద్యోగులను నిట్టనిలువుగా దోపిడీ చేస్తున్నారు. ఏసీబీ వరుస దాడుల నేపథ్యంలో కూడా బహిరంగంగా మామూళ్లకు తెగబడటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నూతన పీఆర్సీ అమలులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన అరియర్స్ బిల్లుల కోసం వస్తున్న ఉద్యోగులతో జిల్లాలోని ఉప ఖజానా కార్యాలయాలు పది రోజులుగా కిటకిటలాడుతున్నాయి. ఒక్కో ఉద్యోగికి వారి మూల వేతనాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.40 వేల దాకా అరియర్స్ డబ్బులు రానున్నాయి. ఈ మేరకు వివిధ శాఖల డ్రాయింగ్ ఆఫీసర్లు తమ సిబ్బంది బిల్లులను ఖజానా కార్యాలయాలకు సమర్పించారు. అయితే చేయి తడిపితేనే బిల్లుపై చేయి పెడతామంటూ ఖజానా అధికారులు తెగేసి చెబుతున్నట్లు సమాచారం. మామూళ్లు ఇవ్వకపోతే తాము పెట్టిన బిల్లులపై ఏవైనా కొర్రీలు వేస్తారేమోనని భయపడుతున్న ఉద్యోగులు అడిగిన మొత్తం ఇచ్చి వస్తున్నారు. జిల్లాలో సుమారు 20 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.200 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా రూ.50 లక్షల పైనే మామూళ్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఇంతపెద్ద మొత్తంలో బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తుంటే అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. సర్కారు ఆలస్యం వల్లే... రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పీఆర్సీని అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేసిన ఆలస్యమే ఖజానా అధికారులకు కలిసి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పీఆర్సీ ఆర్థిక ప్రయోజనాలు 2015 ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు నగదు రూపంలో అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే. ఇందుకు సంబంధించిన జీఓను విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు ఈ నెల 8వ తేదిన ఆర్థిక శాఖ జీఓ నంబర్ 85 విడుదల చేసింది. దీంతో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన అరియర్స్ బిల్లుల మంజూరుకు మార్గం సుగమం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం మాదిరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడ ఏప్రిల్ నెలలోనే పీఆర్సీ జీఓలను ఇచ్చింటే ఉద్యోగులకు ఆనాడే కొత్త వేతనం చేతికి అంది ఉండేది. అరియర్స్ బాధ ఉండేది కాదు. ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి వేల రూపాయల అరియర్స్ వస్తుండడంతో ఖజానా అధికారులు చేయి చాచడానికి ఆస్కారం ఏర్పడింది. పెద్ద మొత్తంలో అరియర్స్ వస్తున్నపుడు ఆ బిల్లు చేసిన మాకు అందులో ఒకటి.. రెండు శాతం ఇస్తే ఏమవుతుందంటూ ఖజానా ఉద్యోగులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారని పలువురు వాపోతున్నారు. సంఘాల నేతలే దళారులు.. ఖజానా అధికారులకు ఇవ్వాల్సిన మామూళ్ల విషయంలో ఉద్యోగులను ఒప్పించే బాధ్యతను ఆయా ఉద్యోగ సంఘాల నేతలే భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు ఈ తంతులో అత్యంత ఉత్సాహంగా పాలు పంచుకున్నట్లు ఆ శాఖలో గుసగుసలు విన్పిస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగులకు అరియర్ డబ్బులను పుణ్యానికేమి ఇవ్వడం లేదు. న్యాయపరంగా వారికి రావాల్సిన జీతభత్యాల వ్యతాసాలే చెల్లిస్తున్నారు. ఇలాంటి బిల్లుల మంజూరులో ఖజానా అధికారులు ఏవైనా ఇబ్బందులు ృసష్టిస్తే పోరాటబాటలో పయనించాల్సిన ఉద్యోగ సంఘాలు దళారుల అవతారమెత్తి మామూళ్లు వసూళ్లు చేయడం సిగ్గు చేటని పలువురు విమర్శిస్తున్నారు. ఉపాధ్యాయుల అరియర్స్ బిల్లుల చెల్లింపులో ఖాజీపేట, చాపాడు మండలాల ఎంఈఓలు ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. ఉపాధ్యాయ సంఘాలతో నిమిత్తం లేకుండా ఎమ్మార్సీ భవనంలో కూర్చొని ఉపాధ్యాయుల అరియర్స్ బిల్లులన్నీ ఓపిగ్గా తయారు చేసినట్లు సమాచారం. అనంతరం ట్రెజరీ అధికారులపై ఒత్తిడి పెట్టి మరీ బిల్లులు మంజూరు చేయించారని సమాచారం. ఆ రెండు మండలాలల్లో ఏఒక్క ఉపాధ్యాయుడు ఒక్క రూపాయి కూడా మామూలు ఇవ్వలేదని తెలిసింది. ఇదే రీతిలో మిగతా మండలాల్లోని ఎంఈఓలు వ్యవహరించి ఉంటే మామూళ్ల బెడద తప్పేదని పలువురు పేర్కొంటున్నారు.