నాలుగు ఉద్యోగాలకు ఒకే పరీక్ష | Same exam for four jobs | Sakshi
Sakshi News home page

నాలుగు ఉద్యోగాలకు ఒకే పరీక్ష

Published Tue, Jul 30 2019 3:43 AM | Last Updated on Tue, Jul 30 2019 11:23 AM

Same exam for four jobs - Sakshi

సాక్షి, అమరావతి: ఒకే రాత పరీక్షతో దాదాపు నాలుగు ఉద్యోగాలకు అర్హత పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించే 19 రకాల ప్రభుత్వ ఉద్యోగాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఒక్కో కేటగిరీలో పేర్కొన్న ఉద్యోగాలన్నింటినీ ఒకే రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. కేటగిరీ–1, కేటగిరీ–2 ఉద్యోగాలకు సెప్టెంబర్‌ 1న ఉదయం వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. కేటగిరీ–3లోని ఉద్యోగాల భర్తీకి అదేరోజు సాయంత్రం రాతపరీక్ష నిర్వహిస్తారు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలన్నింటికీ కేటగిరీల వారీగా ఒకే రకమైన రాత పరీక్ష ఉంటుంది. కేటగిరీ–3లో మాత్రం ఒక్కొక్క రకమైన ఉద్యోగానికి ఒక్కొక్క రకమైన రాత పరీక్ష ఉంటుంది. ఒక్కొక్క ఉద్యోగానికి పేపరు–1, పేపరు–2 విధానంలో రాతపరీక్ష నిర్వహించినప్పటికీ రెండింటినీ ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒకేపూట నిర్వహిస్తారు. అంటే కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి అర్హత ఉంటే కేటగిరీ–3లోని పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకుని, రాత పరీక్షకు హాజరు కావొచ్చు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలు అన్నింటికీ ఒకే అభ్యర్థి ఏకకాలంలో పోటీపడే అవకాశం ఉండదు. అదే సమయంలో కేటగిరీ–3లోని 11 రకాల ఉద్యోగాలకు ఒకే అభ్యర్థి రెండు మూడింటికి ఒకే సమయంలో పోటీపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలన్నింటికీ అభ్యర్థి ఒకే రాత పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యతను దరఖాస్తు ఫారంలో స్పష్టంగా పేర్కొనాలని సూచిస్తున్నారు. 

సందేహాల నివృత్తికి హెల్ప్‌ డెస్క్‌
ఒకే విడత 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ కావడంతో దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నోటిఫికేషన్, దరఖాస్తు, రాతపరీక్ష వంటి అంశాలపై తలెత్తే సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేసినట్టు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055 నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 

కేటగిరీ–1 ఉద్యోగాలు 
1.పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌–5) 
2.మహిళా పోలీసు మరియు మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్‌ (లేదా) వార్డు మహిళా ప్రొటెక్షన్‌ సెక్రటరీ
3.వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌
4.వార్డు అడ్మిన్‌స్ట్రేటివ్‌ సెక్రటరీ 

కేటగిరీ–2 ఉద్యోగాలు 
గ్రూప్‌–ఎ 
1.ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌–2) 
2.వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీ (గ్రేడ్‌–2)

గ్రూపు–బి
1.విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (గ్రేడ్‌–2)
2.విలేజ్‌ సర్వేయర్‌ (గ్రేడ్‌–3) 

కేటగిరీ–3 కొలువులు 
1.విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌(గ్రేడ్‌–2) 
2.విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌
3.విలేజీ ఫిషరీస్‌ అసిస్టెంట్‌
4.డిజిటల్‌ అసిస్టెంట్‌(పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–6)
5.వార్డు శానిటేషన్‌ సెక్రటరీ(గ్రేడ్‌–2) 
6.వార్డు ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌ సెక్రటరీ(గ్రేడ్‌–2) 
7.పశు సంవర్థక శాఖ సహాయకుడు
8.ఏఎన్‌ఎం లేదా వార్డు హెల్త్‌ సెక్రటరీ(గ్రేడ్‌–3)
9.వార్డు ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ సెక్రటరీ
10.వార్డు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ
11.విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ 
(మహిళా పోలీసు, ఏఎన్‌ఎం ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులు)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement