Replacement of government jobs
-
గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లకు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో ప్రభుత్వ కొలువుల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్విస్ రూల్స్–1996కి అనుబంధంగా ఓ తాత్కాలిక నిబంధన(అడ్‌హక్ రూల్)ను అమల్లోకి తీసుకొచ్చారు. రెండేళ్లపాటు వయోపరిమితి పొడిగింపు అమల్లో ఉండనుంది. పోలీసు, ఎక్సైజ్, ఆబ్కారీ, అగ్నిమాపక, అటవీ, జైళ్ల శాఖ వంటి యూనిఫార్మ్ సర్విసు పోస్టులకు ఈ వయోపరిమితి పొడిగింపు వర్తించదు. వాస్తవానికి ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లు మాత్రమే. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ 2022 మార్చి 19న ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే నెల 18తో ఈ ఉత్తర్వుల అమలు గడువు ముగిసిపోనుంది. నిరుద్యోగుల నుంచి మళ్లీ వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని ఈసారి మరో 2 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో గరిష్ట వయోపరిమితి పెంపునకు ప్రాధాన్యత సంతరించుకుంది. -
38 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా జారీ చేస్తున్న నోటిఫికేషన్లలో భాగంగా మరో 38 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల్లో.. అసిస్టెంట్ పబ్లిక్ సర్వీస్ రిలేషన్ ఆఫీసర్ (ఏపీఆర్వో) (6), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (29), ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (1), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 (2) ఉన్నాయి. ఈ పోస్టులకు నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు తెలిపారు. మరిన్ని వివరాలకు ‘హెచ్‌టీటీపీఎస్://పీఎస్సీ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ చూడొచ్చన్నారు. -
ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరిలో క్యాలెండర్ విడుదల చేస్తామని, దానికి అనుగుణంగా అన్ని శాఖల్లో ప్రభుత్వం నియామక ప్రక్రియ చేపడుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. ఉపాధ్యాయ నియామకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఇచ్చారని తెలిపారు. డీఎస్సీ నియామకాలపై అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్కే అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. టీచర్ల పోస్టుల భర్తీకి ఖాళీలు గుర్తించి డీఎస్సీ నిర్వహణకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుందన్నారు. డీఎస్సీ–2018కి సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు కూడా ఉన్నాయని, అవి పరిష్కారమయ్యాక ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఈలోపు పాఠశాలల్లో విద్యాబోధనకు ఇబ్బందిలేకుండా ఉండేందుకు 7 వేల మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమిస్తామన్నారు. మూడు నెలలకు రూ. 12 కోట్ల వ్యయంతో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి సంబంధించిన ఫైలును సీఎం పరిశీలన కోసం పంపించామన్నారు. విద్యార్థులు– ఉపాధ్యాయుల నిష్పత్తిలో పోస్టులు భర్తీ చేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. తెలుగు భాష గురించి మాట్లాడుతున్న చంద్రబాబు 16 ఏళ్లుగా పెండింగులో ఉన్న భాషా పండిట్ల పదోన్నతులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే 12 వేల మంది భాషా పండితులకు పదోన్నతులు ఇచ్చారని చెప్పారు. మరోపక్క 12 వేల మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించామన్నారు. గ్రేడ్–2 హెచ్ఎంలకు కూడా పదోన్నతులు కల్పించినట్టు మంత్రి తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్–2 హెచ్ఎం పోస్టులు 15 వేలు ఉంటే వాటిని అప్‌గ్రేడ్ చేసి ఇప్పటికే 6,500 మందికి పదోన్నతులు ఇచ్చామని వివరించారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం గొప్ప నిర్ణయం: ఎమ్మెల్యే ఆర్కే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్‌కి ఎమ్మెల్యే ఆర్కే ధన్యవాదాలు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం గొప్ప నిర్ణయమన్నారు. -
నాలుగు ఉద్యోగాలకు ఒకే పరీక్ష
సాక్షి, అమరావతి: ఒకే రాత పరీక్షతో దాదాపు నాలుగు ఉద్యోగాలకు అర్హత పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించే 19 రకాల ప్రభుత్వ ఉద్యోగాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఒక్కో కేటగిరీలో పేర్కొన్న ఉద్యోగాలన్నింటినీ ఒకే రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. కేటగిరీ–1, కేటగిరీ–2 ఉద్యోగాలకు సెప్టెంబర్ 1న ఉదయం వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. కేటగిరీ–3లోని ఉద్యోగాల భర్తీకి అదేరోజు సాయంత్రం రాతపరీక్ష నిర్వహిస్తారు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలన్నింటికీ కేటగిరీల వారీగా ఒకే రకమైన రాత పరీక్ష ఉంటుంది. కేటగిరీ–3లో మాత్రం ఒక్కొక్క రకమైన ఉద్యోగానికి ఒక్కొక్క రకమైన రాత పరీక్ష ఉంటుంది. ఒక్కొక్క ఉద్యోగానికి పేపరు–1, పేపరు–2 విధానంలో రాతపరీక్ష నిర్వహించినప్పటికీ రెండింటినీ ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒకేపూట నిర్వహిస్తారు. అంటే కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి అర్హత ఉంటే కేటగిరీ–3లోని పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకుని, రాత పరీక్షకు హాజరు కావొచ్చు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలు అన్నింటికీ ఒకే అభ్యర్థి ఏకకాలంలో పోటీపడే అవకాశం ఉండదు. అదే సమయంలో కేటగిరీ–3లోని 11 రకాల ఉద్యోగాలకు ఒకే అభ్యర్థి రెండు మూడింటికి ఒకే సమయంలో పోటీపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలన్నింటికీ అభ్యర్థి ఒకే రాత పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యతను దరఖాస్తు ఫారంలో స్పష్టంగా పేర్కొనాలని సూచిస్తున్నారు. సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ ఒకే విడత 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ కావడంతో దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నోటిఫికేషన్, దరఖాస్తు, రాతపరీక్ష వంటి అంశాలపై తలెత్తే సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055 నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కేటగిరీ–1 ఉద్యోగాలు 1.పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్–5) 2.మహిళా పోలీసు మరియు మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్ (లేదా) వార్డు మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీ 3.వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 4.వార్డు అడ్మిన్‌స్ట్రేటివ్ సెక్రటరీ కేటగిరీ–2 ఉద్యోగాలు గ్రూప్–ఎ 1.ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్–2) 2.వార్డు ఎమినిటీస్ సెక్రటరీ (గ్రేడ్–2) గ్రూపు–బి 1.విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్–2) 2.విలేజ్ సర్వేయర్ (గ్రేడ్–3) కేటగిరీ–3 కొలువులు 1.విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(గ్రేడ్–2) 2.విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 3.విలేజీ ఫిషరీస్ అసిస్టెంట్ 4.డిజిటల్ అసిస్టెంట్(పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6) 5.వార్డు శానిటేషన్ సెక్రటరీ(గ్రేడ్–2) 6.వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ(గ్రేడ్–2) 7.పశు సంవర్థక శాఖ సహాయకుడు 8.ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ(గ్రేడ్–3) 9.వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 10.వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 11.విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ (మహిళా పోలీసు, ఏఎన్ఎం ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులు) -
చరిత్ర సృష్టించబోతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే విడత 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ఫైలు గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకుండానే ఒక చరిత్రను సృష్టించబోతోంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో పెట్టాల్సిన ఫైలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఆమోద ముద్ర వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 13,065 గ్రామ పంచాయతీలకు గాను ప్రభుత్వం 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చింది. వీటిలో పని చేసేందుకు 99,144 మందిని కొత్తగా నియమించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. వార్డు సచివాలయాల్లో పని చేసేందుకు 34,723 మంది ఉద్యోగులను నియమిస్తారు. గ్రామ సచివాలయాల్లో పది మంది ఉద్యోగుల నుంచి 12 మంది దాకా పని చేసేలా నిర్ణయించగా, వార్డు సచివాలయాల్లో పదేసి మంది చొప్పున ఉద్యోగులు పని చేస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే వారు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే. వారం తర్వాత నోటిఫికేషన్లు కొత్తగా 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత వీటి భర్తీకి కేవలం వారం పది రోజుల వ్యవధిలో శాఖల వారీగా నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్ సమయంలోనే ఏ ఉద్యోగానికి ఏ విద్యార్హత అన్న వివరాలను ఆ శాఖలు వెల్లడించనున్నాయి. నోటిఫికేషన్లలో శాఖల వారీగా వెలువరించిన ఉద్యోగాలను జిల్లాల వారీగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ప్రత్యేక కమిటీ (డీఎస్సీ)లు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీ చేస్తాయి. ఈ ఉద్యోగాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు రిజర్వేషన్ల మేరకు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది. వార్డు సచివాలయాల్లోకొత్తగా నియమించే ఉద్యోగులు – వారి విధులు -
ఇక ‘నో’ జాబ్స్!
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది నుంచి ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేనట్లేనని తేలిపోతోంది! తదుపరి ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి వేతనాల ప్రస్తావన తేవద్దని తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఆంతర్యాన్ని వెల్లడిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల కోసం మార్గదర్శకాలతో ఆర్థికశాఖ ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఎటువంటి వేతనాలను ప్రతిపాదించరాదని ఆర్థికశాఖ ఇందులో స్పష్టం చేసింది. ప్రతి శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలతో నెంబర్ స్టేట్మెంట్ మాత్రమే సమర్పించాలని పేర్కొంది. అయితే అందులో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యనుగానీ వాటికి వేతనాల అంచనాలనుగానీ ప్రతిపాదించరాదని సూచించింది. కేవలం ఆయా శాఖల్లో అనుమతించిన కేడర్ సంఖ్య మేరకు పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలతోపాటు వారి వేతనాల అంచనాలను మాత్రం ప్రతిపాదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భర్తీ చేస్తే ఉద్దేశం ప్రభుత్వానికి లేకనే.. పర్మినెంట్, తాత్కాలిక, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను ప్రతి శాఖ పంపించాలని తాజా ఉత్తర్వుల్లో ఆర్థిక శాఖ ఆదేశించింది. ఎక్కడైనా అనుమతించిన కేడర్ సంఖ్య కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తుంటే ఆ వివరాలను పొందుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పినట్లేనని ఉన్నతాధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. బాబు వస్తే జాబు వస్తుందంటూ గత ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకుని అధికారం చేపట్టిన టీడీపీ సర్కారు నాలుగున్నరేళ్లయినా కొత్త కొలువులు ఒక్కటి కూడా ఇవ్వకపోగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయరాదని నిర్ణయించడం నిరుద్యోగులకు పిడుగుపాటులా మారనుంది. నిరుద్యోగుల కలలు కల్లలే రాష్ట్ర విభజన తేదీ నాటికి అన్ని రంగాలు, స్థాయిల్లో కలిపి ఏపీలో మొత్తం 1.42 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఆర్థికశాఖే ప్రకటించింది. ఆ తరువాత నుంచి పదవీ విరమణ చేసిన వారితో కలిపితే ఖాళీ పోస్టుల సంఖ్య 2 లక్షలకుపైనే ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనల్లో ఖాళీ పోస్టుల వివరాలు, వాటికి వేతనాల అంచనాలను ప్రతిపాదించవద్దని తాజాగా స్పష్టం చేయడంతో వచ్చే ఏడాది సర్కారీ కొలువులు ఎండమావే అని తేలిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ శిక్షణ కోసం రూ.లక్షల్లో వెచ్చిస్తున్న నిరుద్యోగుల ఆశలు మరోసారి అడియాశలయ్యాయి. టీచర్ పోస్టులపైనా మభ్యపెడుతున్న సర్కారు ఉపాధ్యాయ పోస్టులతోపాటు కొన్ని ఇతర పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో కూడా నిరుద్యోగులను మభ్యపెట్టడానికే తప్ప వాస్తవంగా ఖాళీల భర్తీకి కాదని ఆర్థికశాఖ జారీ చేసిన తాజా జీవో ద్వారా స్పష్టమవుతోంది. లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 18,000 పోస్టుల భర్తీకి అనుమతిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ఓ జీవో విడుదలైంది. అయితే ఇప్పుడు ఇదే ఆర్థికశాఖ ఖాళీ పోస్టులకు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో వేతనాలను ప్రతిపాదించరాదని ప్రభుత్వ విభాగాలను ఆదేశించడం గమనార్హం. ఆదా చేస్తే ఆస్తుల కల్పనకిస్తాం క్యాపిటల్, రెవెన్యూ వ్యయం పద్దుల కింద బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలని వివిధ శాఖలకు ఆర్థికశాఖ సూచించింది. ఏ రంగాల వ్యయాన్ని వీటి కింద ప్రతిపాదించాలో కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. రెవెన్యూ వ్యయంలో వీలైనంత మేర ఆదా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ వ్యయంలో ఆదా చూపితే ఆ మొత్తాన్ని ఆస్తుల కల్పన కోసం అదే శాఖకు ఇస్తామని తెలిపింది. ప్రయోజనం లేని పథకాల రద్దు.. సంక్షేమ పథకాల కింద ఆర్థిక సాయం పొందుతున్న లబ్ధిదారుల అర్హతలను సంబంధిత శాఖలు సమీక్షించాలని, వివిధ పథకాల కింద సాంకేతిక సాయం అందిస్తున్న రంగాలను కూడా సమీక్షించాలని ఉత్తర్వుల్లో ఆర్థికశాఖ పేర్కొంది. ఎలాంటి ప్రయోజనం లేని పథకాలు, కార్యక్రమాలను రద్దు చేయాలని సూచించింది. ఏదైనా పథకాన్ని కొనసాగించాలని ప్రతిపాదిస్తే దాని ముఖ్య ఉద్దేశం, కొనసాగించేందుకు బలమైన కారణాలను ఆయా శాఖలు స్పష్టం చేయాలని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పథకాన్ని కొనసాగించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను స్పష్టం చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఏదైనా స్కీము కింద పోస్టులుంటే వాటిని కొనసాగించాల్సిన అవసరాన్ని కూడా వివరించాలని ఆర్థికశాఖ ఆదేశించింది. కొనసాగుతున్న పథకాల కింద సిబ్బంది రెవెన్యూ వ్యయాన్ని తగ్గించాలని, ఎటువంటి ప్రయోజనం లేకపోతే మిగులు సిబ్బందిని ఆర్థికశాఖకు సరెండర్ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏదైనా కొత్త పథకాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపడితే ఆ తేదీతో పాటు అంచనా వ్యయాన్ని సవివరంగా బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొనాలని తెలిపింది. ఒకవేళ ఆ పథకం సవరించిన అంచనాలు పెరిగితే అందుకు అనుమతించింది ఎవరో కూడా పూర్తి వివరాలను బడ్జెట్ ప్రతిపాదనల్లో స్పష్టంగా సమర్పించాలని సూచించింది. గత బడ్జెట్‌ను మించి ప్రతిపాదించొద్దు.. కొత్త రేట్ల ప్రకారం విద్యుత్, టెలిఫోన్, పెట్రోల్, అద్దె చార్జీలను ప్రతిపాదించాలని ఉత్తర్వుల్లో ఆర్థికశాఖ సూచించింది. ఏ శాఖైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మించి భారీగా బడ్జెట్ ప్రతిపాదనలు చేయరాదని, ఒకవేళ చేస్తే అందుకు తగిన కారణాలను వివరించాలని స్పష్టం చేసింది. బడ్జెట్ ప్రతిపాదనలను వచ్చే నెల 26వ తేదీలోగా ఆన్లైన్లో ఆర్థికశాఖకు సమర్పించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సర్కారు లెక్కల ప్రకారమే నిరుద్యోగుల సంఖ్య 65 లక్షలకుపైనే... – రాష్ట్ర ప్రభుత్వం గతంలో కమలనాధన్ కమిటీకి అందించిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో మొత్తం మంజూరైన పోస్టులు 6,97,621 కాగా అందులో 1,42,825 ఖాళీలున్నాయి. – చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచారు. ఆ గడువు పూర్తై ఇప్పటివరకు 60 వేల మందికి పైగా ఉద్యోగులు రిటైరయ్యారు. వారిని కూడా కలిపితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య రెండు లక్షలకు పైగా చేరింది. – ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చెబుతోంది. గత ఏడాది ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 4.83 లక్షలని, అందులో ఖాళీలు కేవలం 77,737 మాత్రమేనని పేర్కొని నిరుద్యోగులకు షాకిచ్చారు. –కమల్‌నాధన్ కమిటీకి ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం మంజూరైన పోస్టులు 6.97 లక్షలు కాగా టీడీపీ అధికారంలోకి వచ్చాక మంజూరైన పోస్టుల సంఖ్యను 4.83 లక్షలకు కుదించి తప్పుడు గణాంకాలకు తెరతీసింది. –రాష్ట్రంలో ఏటా నిరుద్యోగుల సంఖ్య లక్ష్లల్లో పెరుగుతున్నా ప్రభుత్వం ఉద్యోగాలను చూపించడం లేదు. గత కొన్నేళ్లుగా నియమకాలు లేకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఏటా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక, వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేస్తున్న వారి సంఖ్య ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 6 లక్షలకు పైగా ఉంటోంది. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 65 లక్షలకు పైగా ఉందని ఇటీవల సర్కారు నిర్వహించిన సర్వేలోనే తేలింది. – గత ఎన్నికల ముందు చంద్రబాబు పలు హామీలు గుప్పిస్తూ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చాక రెగ్యులర్ చేయడం మాట అటుంచి వారిని తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, డ్వాక్రా యానిమేటర్లను తొలగించారు. గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వేలాది మందికి ఉద్వాసన పలికారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనే దాదాపు 20 వేల మందిని తొలగించారు. ఆదర్శ రైతులపై వేటు వేశారు. వేల సంఖ్యలో ఆరోగ్యమిత్రలు, గోపాలమిత్రలను తొలగించారు. -
సర్కారు కొలువులు సున్నా!
-
సర్కారు కొలువులు సున్నా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తతంగం ఒక అడుగు ముందుకెళ్తే నాలుగడుగులు వెనక్కన్న చందంగా మారింది. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా వారి ఆశ నెరవేరడం లేదు. పాత నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ పూర్తి కాక, కొత్త నోటిఫికేషన్లు రాక భవిష్యత్తు ఎలా ఉంటుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చదివిన చదువుకు తగిన ఉద్యోగం సంగతి దేవుడెరుగు.. ఏదో ఒక ఉద్యోగమొస్తే చాలని తృప్తి పడటానికీ మార్గం కనిపించడం లేదని వాపోతున్నారు. ఏటా ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటించినా ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్త నోటిఫికేషన్ల ఊసే లేదు. ‘జూలైలోనే కొత్త నోటిఫికేషన్లు ఇస్తామంది.. ఏ రోజున ఏ పరీక్ష ఉంటుందో కూడా కమిషన్ ప్రకటించింది.. తీరా వాటిసంగతేంటో కూడా చెప్పకుండా ఉసూరుమనిపించింద’ని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం వల్లే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. లక్షల్లో ఖాళీలున్నా విడుదలైన నోటిఫికేషన్ల మేరకైనా ఉద్యోగాలు భర్తీ కాలేదు. 1.8 లక్షల పోస్టులు ఖాళీ రాష్ట్ర విభజన నాటికి 1.42 లక్షల పోస్టులు ఖాళీలుండగా తర్వాత రిటైరైన వారిని కూడా కలుపుకుంటే ఆ సంఖ్య దాదాపు 1.80 లక్షలకు పైగా అవుతోంది. వీటన్నింటినీ భర్తీ చేయాల్సిన ప్రభుత్వం పోస్టుల సంఖ్యను భారీగా కుదించింది. కేవలం 20 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని అధికారికంగా ప్రకటించింది. వాటిలోనూ కేవలం 10 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 4,275 పోస్టులకు నోటిఫికేషన్లు రాగా, తక్కినవి పోలీస్ రిక్రూట్మెంటు ద్వారా భర్తీ చేపట్టారు. గత ఏడాది ఏపీపీఎస్సీ ద్వారా 32 నోటిఫికేషన్లు విడుదలైనా అవేవీ ఇప్పటికీ పూర్తి కాలేదు. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్లు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. నిబంధనలు, ప్రక్రియలో లోపాలు, కమిషన్ తప్పుల తడక నిర్ణయాల ఫలితంగా నోటిఫికేషన్లు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో, ఉన్నత న్యాయస్థానంలో విచారణలు సాగుతున్నాయి. పోస్టుల్లో కోత.. అయినా భర్తీ కాక.. ఏపీపీఎస్సీ ఈ ఏడాది మే 7వ తేదీన గ్రూప్–1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు 97 ఉన్నాయని తొలుత ప్రభుత్వం పేర్కొన్నా నోటిఫికేషన్లో మాత్రం 78 పోస్టులనే చూపించారు. ప్రభుత్వం నుంచి ఖాళీల సంఖ్య తగ్గించి పంపడంతో వాటినే నోటిఫికేషన్లో పెట్టారు. ప్రిలిమ్స్ పరీక్షకు 93,504 మంది దరఖాస్తు చేయగా 54,956 మంది రాశారు. వారి నుంచి మెయిన్స్ పరీక్షకు 3,900 మందిని ఎంపిక చేసి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి చేసినా ఇంటర్వ్యూల ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నల్లో తప్పులున్నాయని కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. అయితే సకాలంలో దరఖాస్తు చేయలేదని కోర్టు కొట్టివేసింది. మెయిన్స్‌లో కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటి వరకు దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ పోస్టుల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్న అభ్యర్ధులు ఎప్పుడు ఇంటరŠూయ్వలు నిర్వహిస్తారా అని ఎదురు చూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అంతులేని వివాదాలు గ్రూప్–2 పోస్టుల భర్తీ కోసం 2016లో నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టుల భర్తీకి గతంలో మూడు పేపర్లలో ఒక్కటే పరీక్ష ఉండేది. ఇపుడు 982 పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ పరీక్ష పెట్టి కమిషన్ కొత్త విధానానికి తెరలేపింఇ. ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం ఎంపికలు చేయకుండా మెరిట్లో ఉన్న వారినే మెయిన్స్‌కు ఎంపిక చేసే విధానం వల్ల రిజర్వుడ్ వర్గాలకు అన్యాయం జరుగుతోందని అభ్యంతరాలు వెల్లువెత్తినా కమిషన్ పట్టించుకోలేదు. ప్రిలిమ్స్‌లో 6.50 లక్షల మంది దరఖాస్తు చేస్తే, దాదాపు 4.5 లక్షల మంది పరీక్ష రాశారు. ఇందులో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 49,100 మందిని మెయిన్స్‌కు తీసుకున్నారు. కటాఫ్ మార్కులు ఒకేలా వచ్చినా కొంత మందిని తీసుకుని, మరి కొందరిని వదిలేశారు.74.49 కటాఫ్ మార్కు పెట్టారు. కటాఫ్ మార్కులు సాధించిన వారందరినీ తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పులున్నా వాటిని పాటించలేదు. దీంతో దాదాపు 1500 మంది అవకాశం కోల్పోయారు. ప్రిలిమ్స్‌లో కొన్ని ప్రశ్నలు తప్పులు రాగా వాటిని స్కేలింగ్ చేసి కటాఫ్ పెట్టారు. ప్రిలిమ్స్ అనంతరం మెయిన్స్‌పై తీవ్ర వివాదం రేగింది. ప్రిలిమ్స్ ఫలితాలను ఆలస్యంగా ఇవ్వడం, మెయిన్స్‌కు సరిపడా సమయం లేకపోవడం, దాదాపు 20 సబ్జెక్టులు 40 రోజుల్లో ప్రిపేర్ అవ్వడం ఇబ్బందిగా మారడంతో పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ముందు మొండి కేసినా చివరకు అభ్యర్థుల ఒత్తిడితో పరీక్షలను జూలై 16, 17లో నిర్వహించారు. ప్రిలిమ్స్‌లో ఆరు తప్పులు దొర్లినా వాటిని సరిచేయలేదు. ఫలితంగా వేల మంది అభ్యర్థులు నష్టపోయారు. మెయిన్స్‌ను ఆన్లైన్లో నిర్వహించగా దాదాపు 28 కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు ఆరోపణలు.. ఆందోళనలు వ్యక్తమయ్యాయి. విశాఖలోని గీతం కాలేజీ, చీరాల తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి తలెత్తింది. ఆందోళనలు చేసిన వారిలో కొంత మందిని డీబార్ చేశారు. ఈ పరీక్షలకు సంబంధించి దాదాపు 42 తప్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం మాల్ ప్రాక్టీస్‌కు సంబంధించి ట్రిబ్యునల్‌లో కేసులు నడుస్తున్నాయి. మాల్ ప్రాక్టీస్ జరిగిన కేంద్రాల ఫుటేజీల్లో కొన్నిటిని కమిషన్ కోర్టుకు సమర్పించింది. ఈ వివాదాల నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. గ్రూప్–3కి అవుట్ సోర్సింగ్ ముసుగు రాష్ట్రంలో గ్రూప్–3 కింద 1,055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఆగస్టులో స్క్రీనింగ్ పరీక్ష పెట్టారు. దీనికి 6 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రిలిమ్స్ రాసిన వారి నుంచి 1:50 చొప్పున మెయిన్స్‌కు తీసుకున్నారు. పిలిమ్స్, మెయిన్స్‌లో ప్రశ్నల్లో తప్పులు వచ్చాయి. ప్రిలిమ్స్ ‘కీ’లో తప్పులపై తప్పులు రావడంతో పలుమార్లు సరి చేయాల్సి వచ్చింది. మెయిన్స్ రివైజ్డ్ కీ ఇప్పటికీ పెట్టలేదు. ఈ నేపథ్యంలో వివాదాలను త్వరగా పరిష్కరించి పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం.. అవుట్ సోర్సింగ్ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లో నియామకాలు చేపట్టాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా, ఇతర పోçస్టుల భర్తీకి సంబంధించి కూడా అనేక విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. జియాలిజిస్టు పోస్టుల భర్తీలో ప్రశ్న పేపర్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఏఈఈ పరీక్ష పత్రాల్లో కూడా ఇదే రకమైన విమర్శలు వచ్చాయి. 2011 గ్రూప్–1 మెయిన్స్దీ తేలని కథే.. కోర్టు ఉత్తర్వులతో 2011 గ్రూప్–1 మెయిన్స్ మళ్లీ నిర్వహించారు. పేపర్–5 (150 మార్కులు)లో 42 మార్కులకు సంబంధించిన ప్రశ్నల్లో తçప్పులు వచ్చాయి. వాటిపై న్యాయస్థానాల్లో కేసులు పడ్డాయి. చివరకు తప్పుడు ప్రశ్నలు తీసేసి స్కేలింగ్ చేసి జాబితా పెట్టారు. స్కేలింగ్ చేయకుండా కూడా అంతకు ముందు ఒక జాబితా ఇచ్చారు. ముందు ఇచ్చిన జాబితాలోని 32 మంది పేర్లు మలి జాబితాలో కనిపించలేదు. దీంతో వారు న్యాయస్థానాలను ఆశ్రయించారు. స్కేలింగ్ చేయరాదని, 108 మార్కులతో జాబితా ప్రకటించడమో, లేదంటే మళ్లీ పరీక్ష నిర్వహించడమో చేయాలని కోర్టు ఆదేశించగా ప్రస్తుతం దీనిపై కమిషన్ పైకోర్టుకు అప్పీలుకు వెళ్తోంది. బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నల్లో తప్పులు ఉన్నాయని, సమాధానాలు అసంబద్ధంగా ఉన్నాయని 10 ప్రశ్నలు తీసేశారు. డబుల్ ఆన్సర్లు తీసేశారు. అదే గ్రూప్–2కు వచ్చేసరికి డబులు, త్రిబుల్ ఆన్సర్లను యధావిధిగా కొనసాగించారు. ఒకే కమిషన్ పరీక్షల్లో ఒకసారి ఒకలా, మరోసారి మరోలా వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. గ్రూప్–2 కేసులో ఆధారాలు సమర్పించాం గ్రూప్–2పై నడుస్తున్న కేసులో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు సీసీ ఫుటేజీ, ఇతర ఆధారాలు సమర్పించాం. కొంత మంది ఫేక్ క్లిప్పింగ్‌లను సృష్టించి వాట్సాప్‌లలో ప్రచారం చేశారు. వాటితో కమిషన్‌కు సంబంధం లేదు. దాదాపు 17 తేడాలున్నట్లు గుర్తించి వాటినీ కోర్టుకు ఇచ్చాము. వీటిపై సైబర్ కేసులు పెట్టామన్నారు. న్యాయస్థానాల్లో ఉన్న ఇతర కేసుల కారణంగా గ్రూప్–1 మెయిన్స్, ఇంటర్వ్యూలపై ముందుకు వెళ్లలేకపోతున్నాం. 2011 గ్రూప్–1 మెయిన్స్‌పై అప్పీలు చేస్తున్నాం. గ్రూప్–3లోని పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. మొత్తం 32 నోటిఫికేషన్లలో 20 వరకు పూర్తి చేసి ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం ఆయా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చింది. తక్కినవి న్యాయ వివాదాల కారణంగా పెండింగ్‌లో ఉన్నాయి. – సాయి, ఏపీపీఎస్సీ కార్యదర్శి రాష్ట్ర విభజన నాటికి పోస్టుల ఖాళీలు 1.42 లక్షలు రిటైరైన వారితో కలుపుకొని ఖాళీలు 1.80 లక్షలు ప్రభుత్వం భర్తీ చేస్తామంటున్న పోస్టులు 20 వేలు ఏపీపీఎస్సీ నోటిషికేషన్ ఇచ్చిన పోస్టులు 4,275 ఇప్పటి వరకు భర్తీ అయిన గ్రూప్స్ పోస్టులు 0 -
ఉద్యోగాలివ్వలేం.. నిరుద్యోగులతో సీఎం
హైదరాబాద్: రాష్ట్రం లోటులో ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేమని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు లగుడు గోవిందరావు విలేకరులకు తెలిపారు. శనివారం సీఎం క్యాంపు కార్యాల యంలో చంద్రబాబును కలసి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వినతి పత్రం సమర్పించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము.. ప్రైవేట్ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం దారుణమన్నారు. ఖాళీల భర్తీ కోరు తూ కోర్టులో కేసు వేశామని, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామని చెప్పినా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. ఖాళీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆంధ్రా మేధావుల ఫోరం వ్యవస్ధాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఏపీ విద్యార్థి జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల విభజన సాకుతో నియామక ప్రక్రియను నిలుపుదల చేయడం తగదన్నారు.