ఇక ‘నో’ జాబ్స్‌! | state government has declared that there are no appointments in 2019-20 | Sakshi
Sakshi News home page

ఇక ‘నో’ జాబ్స్‌!

Published Wed, Oct 10 2018 3:30 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

state government has declared that there are no appointments in 2019-20 - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది నుంచి ఇక ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేనట్లేనని తేలిపోతోంది! తదుపరి ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి వేతనాల ప్రస్తావన తేవద్దని తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఆంతర్యాన్ని వెల్లడిస్తోంది. 2019–20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల కోసం మార్గదర్శకాలతో ఆర్థికశాఖ ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఎటువంటి వేతనాలను ప్రతిపాదించరాదని ఆర్థికశాఖ ఇందులో స్పష్టం చేసింది. ప్రతి శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలతో నెంబర్‌ స్టేట్‌మెంట్‌ మాత్రమే సమర్పించాలని పేర్కొంది. అయితే అందులో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యనుగానీ వాటికి వేతనాల అంచనాలనుగానీ ప్రతిపాదించరాదని సూచించింది. కేవలం ఆయా శాఖల్లో అనుమతించిన కేడర్‌ సంఖ్య మేరకు పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలతోపాటు వారి వేతనాల అంచనాలను మాత్రం  ప్రతిపాదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

భర్తీ చేస్తే ఉద్దేశం ప్రభుత్వానికి లేకనే..
పర్మినెంట్, తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను ప్రతి శాఖ పంపించాలని తాజా ఉత్తర్వుల్లో ఆర్థిక శాఖ ఆదేశించింది. ఎక్కడైనా అనుమతించిన కేడర్‌ సంఖ్య కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తుంటే ఆ వివరాలను పొందుపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ఉద్దేశం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పినట్లేనని ఉన్నతాధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. బాబు వస్తే జాబు వస్తుందంటూ గత ఎన్నికలకు ముందు ప్రచారం చేసుకుని అధికారం చేపట్టిన టీడీపీ సర్కారు నాలుగున్నరేళ్లయినా కొత్త కొలువులు ఒక్కటి కూడా ఇవ్వకపోగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయరాదని నిర్ణయించడం నిరుద్యోగులకు పిడుగుపాటులా మారనుంది. 

నిరుద్యోగుల కలలు కల్లలే 
రాష్ట్ర విభజన తేదీ నాటికి అన్ని రంగాలు, స్థాయిల్లో కలిపి ఏపీలో మొత్తం 1.42 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఆర్థికశాఖే ప్రకటించింది. ఆ తరువాత నుంచి పదవీ విరమణ చేసిన వారితో కలిపితే ఖాళీ పోస్టుల సంఖ్య 2 లక్షలకుపైనే ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఖాళీ పోస్టుల వివరాలు, వాటికి వేతనాల అంచనాలను ప్రతిపాదించవద్దని తాజాగా స్పష్టం చేయడంతో వచ్చే ఏడాది సర్కారీ కొలువులు ఎండమావే అని తేలిపోయింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ శిక్షణ కోసం రూ.లక్షల్లో వెచ్చిస్తున్న నిరుద్యోగుల ఆశలు మరోసారి అడియాశలయ్యాయి. 

టీచర్‌ పోస్టులపైనా మభ్యపెడుతున్న సర్కారు
ఉపాధ్యాయ పోస్టులతోపాటు కొన్ని ఇతర పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో కూడా నిరుద్యోగులను మభ్యపెట్టడానికే తప్ప వాస్తవంగా ఖాళీల భర్తీకి కాదని ఆర్థికశాఖ జారీ చేసిన తాజా జీవో ద్వారా స్పష్టమవుతోంది. లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం 18,000 పోస్టుల భర్తీకి అనుమతిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం ఓ జీవో విడుదలైంది. అయితే ఇప్పుడు ఇదే ఆర్థికశాఖ ఖాళీ పోస్టులకు వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో  వేతనాలను ప్రతిపాదించరాదని ప్రభుత్వ విభాగాలను ఆదేశించడం గమనార్హం. 

ఆదా చేస్తే ఆస్తుల కల్పనకిస్తాం
క్యాపిటల్, రెవెన్యూ వ్యయం పద్దుల కింద బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించాలని వివిధ శాఖలకు ఆర్థికశాఖ సూచించింది. ఏ రంగాల వ్యయాన్ని వీటి కింద ప్రతిపాదించాలో కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. రెవెన్యూ వ్యయంలో వీలైనంత మేర ఆదా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ వ్యయంలో ఆదా చూపితే ఆ మొత్తాన్ని ఆస్తుల కల్పన కోసం అదే శాఖకు ఇస్తామని తెలిపింది.

ప్రయోజనం లేని పథకాల రద్దు..
సంక్షేమ పథకాల కింద ఆర్థిక సాయం పొందుతున్న లబ్ధిదారుల అర్హతలను సంబంధిత శాఖలు సమీక్షించాలని, వివిధ పథకాల కింద సాంకేతిక సాయం అందిస్తున్న రంగాలను కూడా సమీక్షించాలని ఉత్తర్వుల్లో ఆర్థికశాఖ పేర్కొంది. ఎలాంటి ప్రయోజనం లేని పథకాలు, కార్యక్రమాలను రద్దు చేయాలని సూచించింది. ఏదైనా పథకాన్ని కొనసాగించాలని ప్రతిపాదిస్తే దాని ముఖ్య ఉద్దేశం, కొనసాగించేందుకు బలమైన కారణాలను ఆయా శాఖలు స్పష్టం చేయాలని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పథకాన్ని కొనసాగించడం వల్ల ఒనగూరే ప్రయోజనాలను స్పష్టం చేయాలని స్పష్టం చేసింది. అలాగే ఏదైనా స్కీము కింద పోస్టులుంటే వాటిని కొనసాగించాల్సిన అవసరాన్ని కూడా వివరించాలని ఆర్థికశాఖ ఆదేశించింది. కొనసాగుతున్న పథకాల కింద సిబ్బంది రెవెన్యూ వ్యయాన్ని తగ్గించాలని, ఎటువంటి ప్రయోజనం లేకపోతే  మిగులు సిబ్బందిని ఆర్థికశాఖకు సరెండర్‌ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏదైనా కొత్త పథకాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేపడితే ఆ తేదీతో పాటు అంచనా వ్యయాన్ని సవివరంగా బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొనాలని తెలిపింది. ఒకవేళ ఆ పథకం సవరించిన అంచనాలు పెరిగితే అందుకు అనుమతించింది ఎవరో కూడా పూర్తి వివరాలను బడ్జెట్‌ ప్రతిపాదనల్లో స్పష్టంగా సమర్పించాలని సూచించింది. 

గత బడ్జెట్‌ను మించి ప్రతిపాదించొద్దు..
కొత్త రేట్ల ప్రకారం విద్యుత్, టెలిఫోన్, పెట్రోల్, అద్దె చార్జీలను ప్రతిపాదించాలని ఉత్తర్వుల్లో ఆర్థికశాఖ సూచించింది. ఏ శాఖైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మించి భారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలు చేయరాదని, ఒకవేళ చేస్తే అందుకు తగిన కారణాలను వివరించాలని స్పష్టం చేసింది. బడ్జెట్‌ ప్రతిపాదనలను వచ్చే నెల 26వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ఆర్థికశాఖకు సమర్పించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

సర్కారు లెక్కల ప్రకారమే నిరుద్యోగుల సంఖ్య 65 లక్షలకుపైనే...
– రాష్ట్ర ప్రభుత్వం గతంలో కమలనాధన్‌ కమిటీకి అందించిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో మొత్తం మంజూరైన పోస్టులు 6,97,621 కాగా అందులో 1,42,825 ఖాళీలున్నాయి. 
– చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచారు. ఆ గడువు పూర్తై  ఇప్పటివరకు 60 వేల మందికి పైగా ఉద్యోగులు రిటైరయ్యారు. వారిని కూడా కలిపితే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య రెండు లక్షలకు పైగా చేరింది. 
– ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం తప్పుడు గణాంకాలు చెబుతోంది. గత ఏడాది ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 4.83 లక్షలని, అందులో ఖాళీలు కేవలం 77,737 మాత్రమేనని పేర్కొని నిరుద్యోగులకు షాకిచ్చారు.
–కమల్‌నాధన్‌ కమిటీకి ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం మంజూరైన పోస్టులు 6.97 లక్షలు కాగా టీడీపీ అధికారంలోకి వచ్చాక మంజూరైన పోస్టుల సంఖ్యను 4.83 లక్షలకు కుదించి తప్పుడు గణాంకాలకు తెరతీసింది.
–రాష్ట్రంలో ఏటా నిరుద్యోగుల సంఖ్య లక్ష్లల్లో పెరుగుతున్నా ప్రభుత్వం ఉద్యోగాలను చూపించడం లేదు. గత కొన్నేళ్లుగా నియమకాలు లేకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. ఏటా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక, వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేస్తున్న వారి సంఖ్య ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 6 లక్షలకు పైగా ఉంటోంది. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య 65 లక్షలకు పైగా ఉందని ఇటీవల  సర్కారు నిర్వహించిన సర్వేలోనే తేలింది. 
– గత ఎన్నికల ముందు చంద్రబాబు పలు హామీలు గుప్పిస్తూ ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తామని చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చాక రెగ్యులర్‌ చేయడం మాట అటుంచి వారిని తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు, డ్వాక్రా యానిమేటర్లను తొలగించారు. గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్‌ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వేలాది మందికి ఉద్వాసన పలికారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనే దాదాపు 20 వేల మందిని తొలగించారు. ఆదర్శ రైతులపై వేటు వేశారు. వేల సంఖ్యలో ఆరోగ్యమిత్రలు, గోపాలమిత్రలను తొలగించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement