కమీషన్ల కోసమే రు‘బాబు’
- కోటరీ కాంట్రాక్టర్లకు మరిన్ని పనులు కట్టబెట్టేందుకు ‘ఈపీసీ’ లో మార్పు
- ఫైల్‌పై సంతకం చేసిన సీఎం..
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు కట్టబెట్టే విషయంలో ఆర్థిక శాఖ అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం లెక్కచేయడం లేదు. కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు మరిన్ని పనులు కట్టబెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిడ్ కెపాసిటీని ఏఎన్2–బీ నుంచి ఏఎన్3–బీకి పెంచుతూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే శక్తికి మించి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఏడాదిలో పూర్తి చేయాల్సిన పనులను ఐదేళ్లయినా పూర్తి చేయలేకపోతున్నారు. పనుల్లో తీవ్ర జాప్యం వల్ల వాటి అంచనా వ్యయం తడిసిమోపెడై ఖజానాపై అదనపు భారం పడుతోంది.
ఇవేవీ పట్టని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకు మరిన్ని పనులు కట్టబెట్టేందుకు వీలుగా టెండర్ నిబంధనల్లో ప్రధానమైన బిడ్ కెపాసిటీని పెంచే ప్రతిపాదనలను ఆమోదిస్తూ తానే సంతకం చేయడం గమనార్హం. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, భవనాల నిర్మాణం తదితర పనులకు ప్రభుత్వం 2003 నుంచి ఈపీసీ విధానంలో టెండర్లు నిర్వహిస్తోంది. అప్పట్లో మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు బిడ్ కెపాసిటీని ఏఎన్2–బిగా నిర్ణయించారు.
దీనిప్రకారం... గత ఐదేళ్లలో ఒక ఏడాది గరిష్ఠంగా చేపట్టిన పనుల విలువ(ఏ), ఆ పనులు పూర్తి చేయడానికి విధించిన గడువు(ఎన్)లను రెండుతో హెచ్చించి.. ఇంకా పూర్తి చేయాల్సిన పనులు(బీ) తీసివేయగా వచ్చే సొమ్ము మేరకు మాత్రమే కొత్తగా పనులు దక్కించుకునే అర్హత కాంట్రాక్టర్లకు ఉంటుంది. తమకు మరిన్ని పనులు దక్కేలా చూడాలని సీఎంపై కోటరీ కాంట్రాక్టర్లు ఒత్తిడి తెస్తున్నారు. దాంతో బిడ్ కెపాసిటీని ఏఎన్2–బీ నుంచి ఏఎన్3–బీకి మార్చాలని నిర్ణయించారు. ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపినా.. ముఖ్యమంత్రి ఓకే చేశారు.