సర్కారు కొలువులు సున్నా! | APPSC is unable to move forward by no clarity | Sakshi
Sakshi News home page

సర్కారు కొలువులు సున్నా!

Published Sun, Oct 29 2017 3:11 AM | Last Updated on Sun, Oct 29 2017 7:41 AM

APPSC is unable to move forward by no clarity

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తతంగం ఒక అడుగు ముందుకెళ్తే నాలుగడుగులు వెనక్కన్న చందంగా మారింది. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా వారి ఆశ నెరవేరడం లేదు. పాత నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ పూర్తి కాక, కొత్త నోటిఫికేషన్లు రాక భవిష్యత్తు ఎలా ఉంటుందోనని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చదివిన చదువుకు తగిన ఉద్యోగం సంగతి దేవుడెరుగు.. ఏదో ఒక ఉద్యోగమొస్తే చాలని తృప్తి పడటానికీ మార్గం కనిపించడం లేదని వాపోతున్నారు. ఏటా ఉద్యోగాల భర్తీకి సంబంధించి క్యాలెండర్‌ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రకటించినా ఈ ఏడాది ఇప్పటి వరకు కొత్త నోటిఫికేషన్ల ఊసే లేదు. ‘జూలైలోనే కొత్త నోటిఫికేషన్లు ఇస్తామంది.. ఏ రోజున ఏ పరీక్ష ఉంటుందో కూడా కమిషన్‌ ప్రకటించింది.. తీరా వాటిసంగతేంటో కూడా చెప్పకుండా ఉసూరుమనిపించింద’ని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం వల్లే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. లక్షల్లో ఖాళీలున్నా విడుదలైన నోటిఫికేషన్ల మేరకైనా ఉద్యోగాలు భర్తీ కాలేదు.

1.8 లక్షల పోస్టులు ఖాళీ
రాష్ట్ర విభజన నాటికి 1.42 లక్షల పోస్టులు ఖాళీలుండగా తర్వాత రిటైరైన వారిని కూడా కలుపుకుంటే ఆ సంఖ్య దాదాపు 1.80 లక్షలకు పైగా అవుతోంది. వీటన్నింటినీ భర్తీ చేయాల్సిన ప్రభుత్వం పోస్టుల సంఖ్యను భారీగా కుదించింది. కేవలం 20 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని అధికారికంగా ప్రకటించింది. వాటిలోనూ కేవలం 10 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా 4,275 పోస్టులకు నోటిఫికేషన్లు రాగా, తక్కినవి పోలీస్‌ రిక్రూట్‌మెంటు ద్వారా భర్తీ చేపట్టారు. గత ఏడాది ఏపీపీఎస్సీ ద్వారా 32 నోటిఫికేషన్లు విడుదలైనా అవేవీ ఇప్పటికీ పూర్తి కాలేదు. గ్రూప్‌–1, గ్రూప్‌–2, గ్రూప్‌–3 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్లు ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లున్నాయి. నిబంధనలు, ప్రక్రియలో లోపాలు, కమిషన్‌ తప్పుల తడక నిర్ణయాల ఫలితంగా నోటిఫికేషన్లు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌లో, ఉన్నత న్యాయస్థానంలో విచారణలు సాగుతున్నాయి. 

పోస్టుల్లో కోత.. అయినా భర్తీ కాక..
ఏపీపీఎస్సీ ఈ ఏడాది మే 7వ తేదీన గ్రూప్‌–1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులు 97 ఉన్నాయని తొలుత ప్రభుత్వం పేర్కొన్నా నోటిఫికేషన్‌లో మాత్రం 78 పోస్టులనే చూపించారు. ప్రభుత్వం నుంచి ఖాళీల సంఖ్య తగ్గించి పంపడంతో వాటినే నోటిఫికేషన్లో పెట్టారు. ప్రిలిమ్స్‌ పరీక్షకు 93,504 మంది దరఖాస్తు చేయగా 54,956 మంది రాశారు. వారి నుంచి మెయిన్స్‌ పరీక్షకు 3,900 మందిని ఎంపిక చేసి పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి చేసినా ఇంటర్వ్యూల ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ ప్రశ్నల్లో తప్పులున్నాయని కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. అయితే సకాలంలో దరఖాస్తు చేయలేదని కోర్టు కొట్టివేసింది. మెయిన్స్‌లో కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటి వరకు దానిపై తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ పోస్టుల కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్న అభ్యర్ధులు ఎప్పుడు ఇంటరŠూయ్వలు నిర్వహిస్తారా అని ఎదురు చూస్తున్నా ఫలితం కనిపించడం లేదు.

అంతులేని వివాదాలు
గ్రూప్‌–2 పోస్టుల భర్తీ కోసం 2016లో నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పోస్టుల భర్తీకి గతంలో మూడు పేపర్లలో ఒక్కటే పరీక్ష ఉండేది. ఇపుడు 982 పోస్టుల భర్తీకి స్క్రీనింగ్‌ పరీక్ష పెట్టి కమిషన్‌ కొత్త విధానానికి తెరలేపింఇ. ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం ఎంపికలు చేయకుండా మెరిట్‌లో ఉన్న వారినే మెయిన్స్‌కు ఎంపిక చేసే విధానం వల్ల రిజర్వుడ్‌ వర్గాలకు అన్యాయం జరుగుతోందని అభ్యంతరాలు వెల్లువెత్తినా కమిషన్‌ పట్టించుకోలేదు. ప్రిలిమ్స్‌లో 6.50 లక్షల మంది దరఖాస్తు చేస్తే, దాదాపు 4.5 లక్షల మంది పరీక్ష రాశారు. ఇందులో నుంచి ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 49,100 మందిని మెయిన్స్‌కు తీసుకున్నారు. కటాఫ్‌ మార్కులు ఒకేలా వచ్చినా కొంత మందిని తీసుకుని, మరి కొందరిని వదిలేశారు.74.49 కటాఫ్‌ మార్కు పెట్టారు.

కటాఫ్‌ మార్కులు సాధించిన వారందరినీ తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పులున్నా వాటిని పాటించలేదు. దీంతో దాదాపు 1500 మంది అవకాశం కోల్పోయారు. ప్రిలిమ్స్‌లో కొన్ని ప్రశ్నలు తప్పులు రాగా వాటిని స్కేలింగ్‌ చేసి కటాఫ్‌ పెట్టారు. ప్రిలిమ్స్‌ అనంతరం మెయిన్స్‌పై తీవ్ర వివాదం రేగింది. ప్రిలిమ్స్‌ ఫలితాలను ఆలస్యంగా ఇవ్వడం, మెయిన్స్‌కు సరిపడా సమయం లేకపోవడం, దాదాపు 20 సబ్జెక్టులు 40 రోజుల్లో ప్రిపేర్‌ అవ్వడం ఇబ్బందిగా మారడంతో పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ముందు మొండి కేసినా చివరకు అభ్యర్థుల ఒత్తిడితో పరీక్షలను జూలై 16, 17లో నిర్వహించారు. ప్రిలిమ్స్‌లో ఆరు తప్పులు దొర్లినా వాటిని సరిచేయలేదు.

ఫలితంగా వేల మంది అభ్యర్థులు నష్టపోయారు. మెయిన్స్‌ను ఆన్‌లైన్లో నిర్వహించగా దాదాపు 28 కేంద్రాల్లో మాల్‌ ప్రాక్టీస్‌ జరిగినట్లు ఆరోపణలు.. ఆందోళనలు వ్యక్తమయ్యాయి. విశాఖలోని గీతం కాలేజీ, చీరాల తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి తలెత్తింది. ఆందోళనలు చేసిన వారిలో కొంత మందిని డీబార్‌ చేశారు. ఈ పరీక్షలకు సంబంధించి దాదాపు 42 తప్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం మాల్‌ ప్రాక్టీస్‌కు సంబంధించి ట్రిబ్యునల్‌లో కేసులు నడుస్తున్నాయి. మాల్‌ ప్రాక్టీస్‌ జరిగిన కేంద్రాల ఫుటేజీల్లో కొన్నిటిని కమిషన్‌ కోర్టుకు సమర్పించింది. ఈ వివాదాల నేపథ్యంలో ఈ పోస్టుల భర్తీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. 

గ్రూప్‌–3కి అవుట్‌ సోర్సింగ్‌ ముసుగు
రాష్ట్రంలో గ్రూప్‌–3 కింద 1,055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఆగస్టులో స్క్రీనింగ్‌ పరీక్ష పెట్టారు. దీనికి 6 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రిలిమ్స్‌ రాసిన వారి నుంచి 1:50 చొప్పున మెయిన్స్‌కు తీసుకున్నారు. పిలిమ్స్, మెయిన్స్‌లో ప్రశ్నల్లో తప్పులు వచ్చాయి. ప్రిలిమ్స్‌ ‘కీ’లో తప్పులపై తప్పులు రావడంతో పలుమార్లు సరి చేయాల్సి వచ్చింది. మెయిన్స్‌ రివైజ్డ్‌ కీ ఇప్పటికీ పెట్టలేదు. ఈ నేపథ్యంలో వివాదాలను త్వరగా పరిష్కరించి పోస్టులను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం.. అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా పంచాయతీ కార్యదర్శుల పోస్టుల్లో నియామకాలు చేపట్టాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా, ఇతర పోçస్టుల భర్తీకి సంబంధించి కూడా అనేక విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. జియాలిజిస్టు పోస్టుల భర్తీలో ప్రశ్న పేపర్లు అమ్ముకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఏఈఈ పరీక్ష పత్రాల్లో కూడా ఇదే రకమైన విమర్శలు వచ్చాయి. 

2011 గ్రూప్‌–1 మెయిన్స్‌దీ తేలని కథే..
కోర్టు ఉత్తర్వులతో 2011 గ్రూప్‌–1 మెయిన్స్‌ మళ్లీ నిర్వహించారు. పేపర్‌–5 (150 మార్కులు)లో 42 మార్కులకు సంబంధించిన ప్రశ్నల్లో తçప్పులు వచ్చాయి. వాటిపై న్యాయస్థానాల్లో కేసులు పడ్డాయి. చివరకు తప్పుడు ప్రశ్నలు తీసేసి స్కేలింగ్‌ చేసి జాబితా పెట్టారు. స్కేలింగ్‌ చేయకుండా కూడా అంతకు ముందు ఒక జాబితా ఇచ్చారు. ముందు ఇచ్చిన జాబితాలోని 32 మంది పేర్లు మలి జాబితాలో కనిపించలేదు. దీంతో వారు న్యాయస్థానాలను ఆశ్రయించారు. స్కేలింగ్‌ చేయరాదని, 108 మార్కులతో జాబితా ప్రకటించడమో, లేదంటే మళ్లీ పరీక్ష నిర్వహించడమో చేయాలని కోర్టు ఆదేశించగా ప్రస్తుతం దీనిపై కమిషన్‌ పైకోర్టుకు అప్పీలుకు వెళ్తోంది. బీసీ వెల్ఫేర్, సోషల్‌ వెల్ఫేర్‌ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నల్లో తప్పులు ఉన్నాయని, సమాధానాలు అసంబద్ధంగా ఉన్నాయని 10 ప్రశ్నలు తీసేశారు. డబుల్‌ ఆన్సర్లు తీసేశారు. అదే గ్రూప్‌–2కు వచ్చేసరికి డబులు, త్రిబుల్‌ ఆన్సర్లను యధావిధిగా కొనసాగించారు. ఒకే కమిషన్‌ పరీక్షల్లో ఒకసారి ఒకలా, మరోసారి మరోలా వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. 

గ్రూప్‌–2 కేసులో ఆధారాలు సమర్పించాం 
గ్రూప్‌–2పై నడుస్తున్న కేసులో అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌కు సీసీ ఫుటేజీ, ఇతర ఆధారాలు సమర్పించాం. కొంత మంది ఫేక్‌ క్లిప్పింగ్‌లను సృష్టించి వాట్సాప్‌లలో ప్రచారం చేశారు. వాటితో కమిషన్‌కు సంబంధం లేదు. దాదాపు 17 తేడాలున్నట్లు గుర్తించి వాటినీ కోర్టుకు ఇచ్చాము. వీటిపై సైబర్‌ కేసులు పెట్టామన్నారు. న్యాయస్థానాల్లో ఉన్న ఇతర కేసుల కారణంగా గ్రూప్‌–1 మెయిన్స్, ఇంటర్వ్యూలపై ముందుకు వెళ్లలేకపోతున్నాం. 2011 గ్రూప్‌–1 మెయిన్స్‌పై అప్పీలు చేస్తున్నాం. గ్రూప్‌–3లోని పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. మొత్తం 32 నోటిఫికేషన్లలో 20 వరకు పూర్తి చేసి ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం ఆయా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చింది. తక్కినవి న్యాయ వివాదాల కారణంగా పెండింగ్‌లో ఉన్నాయి. 
– సాయి, ఏపీపీఎస్సీ కార్యదర్శి 

రాష్ట్ర విభజన నాటికి పోస్టుల ఖాళీలు 1.42 లక్షలు
రిటైరైన వారితో కలుపుకొని ఖాళీలు 1.80 లక్షలు
ప్రభుత్వం భర్తీ చేస్తామంటున్న పోస్టులు 20 వేలు
ఏపీపీఎస్సీ నోటిషికేషన్‌ ఇచ్చిన పోస్టులు 4,275
ఇప్పటి వరకు భర్తీ అయిన గ్రూప్స్‌ పోస్టులు 0

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement