రహదారుల అభివృద్ధికి అటవీశాఖ అడ్డంకులు | Forest department prevents to develop highways in Agency regions | Sakshi
Sakshi News home page

రహదారుల అభివృద్ధికి అటవీశాఖ అడ్డంకులు

Published Sat, Nov 23 2013 5:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM

Forest department prevents to develop highways in Agency regions

భద్రాచలం, న్యూస్‌లైన్  జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గల మారుమూల గ్రామాలకు చేపట్టిన రహదారుల నిర్మాణ పనులు ముందుకు సాగటం లేదు. నిధులు ఉన్నప్పటికీ అటవీశాఖ అడ్డంకుల కారణంగా పల్లె రహదారులు పూర్తి కాని పరిస్థితి ఏర్పడింది. రహదారుల నిర్మాణంతో అడవులు అంతరించిపోతాయని కొన్ని చోట్ల ఈ పనులకు అటవీశాఖ కొర్రీలు పెట్టింది. ఇందుకు సంబంధించి ‘న్యూస్‌లైన్’ సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం దశల వారీగా జిల్లాకు సుమారుగా 6 వందల  కోట్లకు పైగానే నిధులు మంజూరు చేసింది. వీటిని ఆయా శాఖలకు కేటాయించి పనులు చేపట్టేలా ప్రతిపాదనలు చేశారు. వీటిలో ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా 10 పనులకు గాను  రూ.286.83 కోట్లు,  పీఆర్ విభాగానికి మొత్తం 91 పనులకు గాను రూ.91.62 కోట్లు కేటాయించారు. అదే విధంగా గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ పథకాల కింద వచ్చిన నిధులతో పనులు ప్రారంభించారు. అయితే ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఎక్కువగా పీఆర్, ఆర్‌అండ్‌బీ  విభాగాలకే నిధుల కేటాయింపులు చేశారు. పీఆర్ విభాగం ద్వారా చేపట్టే పనులన్నీ దాదాపు మారుమూల గ్రామాలకు వెళ్లే రహదారులను మెరుగుపరిచేందుకు ప్రతిపాదనలు చేశారు. కానీ అటవీశాఖ అభ్యంతరాలతో ఆ లక్ష్యం నెరవేరని పరిస్థితి ఏర్పడింది.

ఏజెన్సీ అభివృద్ధికి ఎన్నో సంవత్సరాల తరువాత  ఇంత పెద్ద మొత్తంలో  నిధులు మంజూరుకాగా వాటితో పనులు చేయనీయకండా అటవీశాఖ అడ్డగోలు నిబంధనలు విధించటంపై ఈ ప్రాంత గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంపదను స్మగ్లర్లు దోచుకుపోతున్నా పట్టించుకోని ఆ శాఖ అధికారులు ప్రజలకు ఉపయోగపడే పనులను అడ్డుకోవడం ఏమిటని మండిపడుతున్నారు. ప్రధానంగా మారుమూల మండలాలైన వాజేడు, చర్ల, చింతూ రు, గుండాల వంటి మండలాల్లోనే ఎక్కువగా పనులకు అటవీశాఖ అభ్యంతరాలు తెలిపింది.
 
 ముందుకుసాగని పనులు : భద్రాచలం డివిజన్‌లోని చింతూరు మండలంలో గల గూడూరు నుంచి కొత్తపల్లి, వాజేడు మండలంలోని జడ్పీ రోడ్డు నుంచి బొమ్మనపల్లి, అలాగే  చర్ల మండలంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి తిప్పాపురం వరకు పెద్దమిడిసిలేరు నుంచి కుర్నపల్లి గ్రామాలకు చేపట్టిన పనులు  అర్ధాంతరంగా ఆగిపోయాయి. అదే విధంగా కొత్తగూడెం డివిజన్ పరిధిలోని గుండాల మండలంలో గల  బర్లగూడెం నుంచి రాయిపాడు, కాచనపల్లి నుంచి అనంతోగు, గుండాల నుంచి శెట్టిపెల్లి, ఆళ్లపల్లి నుంచి పెద్దవెంకటాపురం గిరిజన గ్రామాల మధ్య చేపట్టిన రహదారి నిర్మాణ పనులు కూడా ఈ కారణంగానే ముందుకు సాగని పరిస్థితి ఉంది. ఇదే మండలంలోని గుండాల నుంచి సాయనపల్లి వరకూ పనులు పూర్తి అయినప్పటికీ మధ్యలో ఉన్న  బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి.

ఈ పనులన్నీ పంచాయతీరాజ్ విభాగం పర్యవేక్షణలో చేపడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి పథకం కింద 2010లోనే ఈ పనులకు నిధులు మంజూరైనప్పటికీ  పూర్తి కాకపోవడం గమనార్హం. అదే విధంగా ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా చేపట్టే భద్రాచలం-రాజమండ్రి రహదారిలో గల 9 కిలోమీటర్ మేర రహదారి, అలాగే బూర్గంపాడు-అశ్వారావుపేట మధ్య చేపట్టే రహదారుల నిర్మాణాలకు అటవీశాఖ అభ్యంతరాలు తెలిపింది.
 
 అనుమతుల కోసం ఎదురు చూపులు :
 రహదారుల నిర్మాణం కారణంగా అటవీ భూములు పోతున్నాయని అటవీశాఖ అభ్యంతరం చెబుతోంది. ఈ మొత్తం పనులను  ఆయా ప్రాంతాల్లో చేపట్టేందుకు  40.40 కి.మీ మేర భూమి అవసరం ఉంటుందని అటవీశాఖ అధికారులు లెక్క తేల్చారు. ఇందుకు  ప్రత్యామ్నాయంగా భూమిని అటవీశాఖకు రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో  ప్రభుత్వం వారికి అప్పగించాల్సి ఉంటుంది. ఇక్కడి అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అనుమతుల కోసం నివేదికలు పంపించారు. కొన్ని పనులకు తాత్కాలిక అనుమతులు రావటంతో  ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో అనుమతులు వస్తేనే పనులను పూర్తి చేసే అవకాశం ఉటుంది. వీటి కోసం ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులు ఎదురుచూడాల్సి వస్తోంది. పనులు ప్రారంభించి మూడేళ్లు కావస్తుండంతో  చర్ల, వాజేడు, గుండాల వంటి మండలాల్లో కొత్తగా  టెండర్‌లను పిలుస్తున్నారు. ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో.. తమ గ్రామాలకు రహదారి సౌకర్యం ఎన్నటికి కలుగుతుందోనని గిరిజనులు ఎదురు చూస్తున్నారు.
 
 పనులు వేగవంతం చేశాం : వెంకటి, ఆర్‌అండ్‌బీ ఈఈ, భద్రాచలం
 అటవీశాఖ అభ్యంతరాల ద్వారా నిలిచిపోయిన పనులకు తాత్కాలిక అనుమతులు వచ్చాయి. దీంతో ప్రస్తుతం పనులను వేగవంతం చేశాము. జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అనుమతుల కోసం ఇప్పటికే నివేదిక పంపించాం. ఏ ఒక్క పనీ కూడా నిలిచిపోకుండా పూర్తి చేసేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement