మతి మరుపు సమస్య పెనుసవాల్‌గా మారింది. స్కూల్ పిల్లల వద్ద నుంచి ఉద్యోగులు. యువతలో రోజురోజుకూ ఈ సమస్య తీవ్ర తరమవుతున్నట్లు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మతిమరుపు సమస్యకు తీవ్రమైన వత్తిళ్లు, పరీక్షల భయం, ఆందోళనలు కారణంగా చెపుతున్నారు. దీనిపై కథనం...
లబ్బీపేట (విజయవాడ తూర్పు): స్కూల్‌కి టైమ్ అయిపోతుందనే హడావుడిలో మమ్మీ ఇచ్చిన లంచ్ బాక్స్ మరిచిపోయే పిల్లలు...ఆఫీస్‌కు లేట్ అవుతున్నామనే భయంతో బైక్‌కీస్ మరిచి గబగబా మెట్లు దిగిపోయే ఉద్యోగులు.. టీం లీడర్‌తో మీటింగ్ ఉంది.. ఫైల్ ప్రిపేర్ చేయాలంటూ హడావిడిలో ఇంటి వద్దనే డెస్క్‌కీస్ మరిచి పోయే మార్కెటింగ్ ఉద్యోగులు ఇలా.. వీళ్లే కాదండి బాబూ నగరంలో ఇప్పుడు ఇలా మతిమరుపుతో అవస్థలు పడుతున్న వారెందరో ఉన్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు ఆరవై ఏళ్లు దాటితే కానీ కనిపించని మతిమరుపు ఇప్పుడు 16 ఏళ్లకే వచ్చేస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తుందంటే నమ్మక తప్పదు. పరీక్షల భయం, పనివత్తిడి ఆందోళనలు మతిమరుపునకు ప్రధాన కారణాలు కాగా, పౌష్టికాహార లోపం, కొన్ని రకాల రోగాలు ఇందుకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెపుతున్నారు.
టీనేజ్‌లో బీజం
మతిమరుపు సమస్యకు టీనేజ్‌లో బీజం పడుతోంది. ఔను ఇది నిజం. ఇక 25–35 ఏళ్ల వయస్సు వారిలో అది తీవ్రస్థాయికి చేరుతోంది. వైద్య నిపుణులు చెపుతున్న మాట ఇదే. కొందరు తాము మతిమరుపుతో బాధపడుతున్నామని తెలియక ఏదో సమస్యతో వచ్చినప్పుడు వాళ్లు మతిమరుపుతో బాధపడుతున్నట్లు గుర్తించ గలుగుతున్నామని వైద్య నిపుణులు అంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత ఇలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు.
ఏకాగ్రతే ప్రధాన లోపం
ఒక విషయాన్ని సమగ్రంగా వినడంలో యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్న దానిని మనసులో ముద్రించుకోవడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులోస్తున్నాయి. విన్న విషయాన్ని మనసులో ముద్రించుకోక పోవడం వల్లే మతిమరుపు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుర్తుంచుకున్నట్లుగా ఉంటుంది.. కానీ గుర్తుకు రాదు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరొకరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినకపోవడంతో, తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి.
అంతు చూస్తున్న ఒత్తిడి
చేసే పనిలో టెన్షన్, యాంగ్జాయిటీ, సైకాలజికల్ అంశాలు మెమరీ పవర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో గుర్తుకు రాని విషయం కోసం యువత ఇప్పుడు జుట్టు పీక్కుంటోంది. ముఖ్యమైన అంశాలను గుర్తు పెట్టుకోవడంలో జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఉదయం లేవగానే ఏదో పని చేయాలని అనుకుంటారు. తీరా చెప్పే సమయం వచ్చేసరికి అది గుర్తుకు రాదు. అంతలా మైండ్ పట్టు తప్పుతోంది.
బీపీ, మధుమేహం ప్రభావం
డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపునకు దారితీసే అవకాశాలున్నాయి. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్లు అభివృద్ధిలో లోపాలు చోటు చేసుకుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఆనందంగా ఉండాల్సింది పోయి, మానసికంగా మందకొడిగా ఉండటం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ బి–12 కారణమని, దానిలో లోపం వల్ల మతిమరుపు పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహారం లేకపోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ అభివృద్ధి లోపిస్తుందని చెబుతున్నారు. రెడీమేడ్ ఫుడ్ జోలికెళ్లకూడదని, బీ12 నాన్‌వెజ్‌లో అధికంగా, పుష్కలంగా లభిస్తుంది. అదే విధంగా పచ్చని ఆకు కూరగాయలు తింటే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
యాంగ్జయిటీతో ముప్పు
మెమరీ పవర్ తగ్గిపోవడానికి మానసిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం యాంగ్జాయిటీ. ఏ పనిచేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటం వలన స్ట్రెస్ పెరిగిపోతుంది. అది మనసుపై ప్రభావం చూపుతోంది. దాంతో విన్న విషయం గుర్తుకు రాకపోవడం జరుగుతోంది. ఉద్యోగంలో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్ధిక అంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. పిల్లల్లో హోం వర్క్, పరీక్షల మార్కులపై వత్తిడి, పనిష్‌మెంట్లు, వారిలో వత్తిడి పెంచి అదికాస్తా మతిమరుపునకు కారణం అవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు.
మెదడుకు పదును పెట్టండి
మతిమరుపునకు ప్రధాన కారణం ఒత్తిడి. సకాలంలో సరైన జవాబు మన వద్ద లేక పోవడమే దీనికి కారణం. ప్రతి చిన్న విషయానికి వస్తువులపై ఆధారపడటం.. అంటే లెక్కలు చేయాలంటే కాలిక్యులేటర్ వాడటం, ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌తో గడపడం వంటివి. వీటి వలన ప్రతి విషయాన్ని మరిచిపోవడం జరుగుతుంది. మతి మరుపునకు ఇదీ ఒక కారణం. ఒత్తిడిని జయిం చేందుకు ప్రతి ఒక్కరూ బ్రెయిన్‌కు ఎక్సర్‌సైజ్ చేయించాలి. అంటే స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. అప్పుడు మతిమరుపు తగ్గే అవకాశాలుంటాయి. అలాగే పౌష్టికాహారం తీసుకోవడం కూడా చాలా అవస రం. తల్లిదండ్రులు పిల్లలపై మార్కులు కోసం వత్తిడి తేకూడదు. ఇది వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. –డాక్టర్ ఆర్‌కే అయోధ్య,మానసిక వైద్య నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment