సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఒకటి రెండు రోజులలో పార్లమెంటుకు రానుంది. ఈ నేపథ్యంలో రానున్న సాధారణ ఎన్నికలు కీలకం కానున్నాయి. 2014లో జరిగే ఈ ఎన్నికలు చాలా మంది టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ సారి అమీతుమీ తేల్చుకునేందుకు ఆ రెండు పార్టీల ఆశావహ నేతలు అతృతతో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందని లేదా పొత్తు పెట్టుకుంటుందని జరుగుతున్న ప్రచారం జరుగుతుండడం ఇరు పార్టీల నేతలను గందర గోళానికి గురి చేస్తోంది.
మారిన బలాబలాలు
2009 ఎన్నికలలో టీడీపీ ఐదు స్థానాల నుంచి, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, పీఆర్‌పీ ఒక్కోస్థానం నుంచి విజయం సాధించాయి. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడంతో అధికార పార్టీ బలం రెండుకు చేరింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన తరుణంలో ప్రజలు నుంచి ఒత్తిడి రావడంతో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంప గోవర్ధన్, ఇటీవల హన్మంత్ సింధే ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
దీంతో టీఆర్‌ఎస్ బలం నాలుగుకు చేరింది. ప్రస్తుతం జిల్లాలో టీఆర్‌ఎస్‌కు నలుగురు, కాంగ్రెస్, టీడీపీలకు ఇద్దరు చొప్పున, బీజేపీకి ఒక్కరు చొప్పున శాసనసభ్యులున్నారు. జిల్లా పరిధిలో రెండు లోక్‌సభ స్థానాలు న్నాయి. నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలుగా కాంగ్రెస్‌కు చెందిన మధుయాష్కీ గౌడ్, సురేశ్ షెట్కార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆశావహులలో ఆందోళన
కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమైనా, లేదా రెండు పార్టీలు పొత్తులకే పరిమితమైనా పలువురికి నిరాశే మిగలనుంది. దీంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. 2004లో కాంగ్రెస్ తో, 2009లో టీడీపీతో పొత్తులు పెట్టుకుని టీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. తర్వాత పార్టీని బలోపేతం చేసే క్రమంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చే నేతలకు ఆహ్వానం పలికింది. దీంతో జిల్లాలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల సంఖ్య నాలుగుకు చేరింది. విలీనమైనా, పొత్తు పెట్టుకున్నా 2014 ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఎవరికి దక్కుతుంది అనే అంశంపై రెండు పార్టీలలో చర్చ సాగుతోంది. ఈ అంశం పలువురు ఆశావహులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఎవరికి వారే
జిల్లాలో పార్టీ బలపడిందని, తమ పోరాట ఫలంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తోందని నమ్ముతున్న టీఆర్‌ఎస్ అన్ని స్థానాల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. తెలంగాణ తెస్తోంది తామేనని పేర్కొంటున్న అధికార పార్టీ సైతం అన్ని స్థానాల్లో బరిలో నిలవాలని చూస్తోంది.
ఇరు పార్టీల నుంచి పోటీ చేయడానికి అన్ని నియోజకవర్గాలలో ఆశావహులు సిద్ధంగా ఉన్నారు. పొత్తయినా, విలీనమైనా ఆయా పార్టీల నుంచి పోటీచేసే అవకాశం ఎవరికి దక్కుతుందనే చర్చ జరుగుతోంది. విలీనమైతే జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇస్తారు? ఒకవేళ పొత్తులతో ముందుకెళ్తే ‘సిట్టింగ్’లకు అవకాశం ఉంటుందా? లేదా? అన్న అంశాలూ చర్చనీయాంశాలయ్యాయి. ఏ పరిస్థితి ఎదురయినా తమకు టికెట్టు వచ్చేలా చూడాలని ఆ రెండు పార్టీల నేతలు, ఆశావహులు అధిష్టానాలపై అప్పుడే ఒత్తిళ్లు మొదలెట్టినట్లు సమాచారం.
ఏమవుతుందో!
Published Mon, Feb 10 2014 3:09 AM | Last Updated on Wed, Oct 3 2018 6:55 PM
Advertisement
Advertisement