
పంచాయతీల్లోనూ భూగర్భ డ్రైనేజీ
తొలుత ప్రయోగాత్మకంగా ఐరాల పంచాయతీలో..
మరో పది పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ
తర్వాత జిల్లా వ్యాప్తంగా నిర్మాణం
వెస్ట్ గోదావరి వెలివెన్ను ఆదర్శం
{పణాళికలు సిద్ధం చేసిన అధికారులు
చిత్తూరు : జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు జిల్లా పంచాయతీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మూమూలుగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో మాత్రమే భూగర్భ డ్రైనేజీ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొస్తుంది. అయితే చిత్తూ రు జిల్లాలో ప్రయోగాత్మకంగా చిన్నచిన్న పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం పశ్చిమ గోదావరి జిల్లా వెలివెన్ను గ్రామ పంచాయతీలో ఫైలట్ ప్రాజెక్టుగా నిర్మించిన భూగర్భ డ్రైనేజీని జిల్లా అధికారుల బృందం పరిశీలించి వచ్చింది. ఆ స్పూర్తితో రాష్ట్రంలో ఎక్కడా లేని రీతిలో గ్రామ పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలవాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలుత పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల పంచాయతీలో వినాయకపురం, అంచనవారిపల్లి, నయనాంపల్లి గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీలను నిర్మించారు. వినాయకపురంలో రూ.5 లక్షలతో నిర్మించగా, అంచనవారిపల్లి, నయనాంపల్లిలో రూ.4 లక్షలతో పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లోని అన్ని వీధుల్లో భూగర్భంలోనే పైప్‌లైన్ ఏర్పాటు చేశారు. వాటిని బయటకు వెళ్లే నీటితో అనుసంధానం చేశారు. ఊరి చివరన సంపు నిర్మించి మురుగు నీటిని అందులోకి వదిలేలా ఏర్పాటు చేశారు. ఇందుకోసం 13వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించారు. మొత్తం పనులను రెండు నెలల్లో పూర్తి చేశారు.
ఇదే స్ఫూర్తితో జిల్లాలో పది గ్రామ పంచాయతీల్లో పూర్తి స్థాయిలో భూగర్భ డ్రైనేజీని నిర్మించేందుకు పంచాయతీ అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకోసం కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో పాటు ఉపాధి హామీ నిధులను సైతం వెచ్చించనున్నారు. జిల్లాలో ఆదర్శవంతంగా గ్రామ పంచాయతీల్లో భూగర్భ డ్రైనేజీ పూర్తి చేసి రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకరరావు సాక్షికి తెలిపారు. తొలుత పది పంచాయతీలలో డ్రైనేజీ పూర్తి స్థాయిలో నిర్మించి, తర్వాత జిల్లాలోని అన్ని పంచాయతీల్లో వీటి నిర్మాణం చేపడతామని చెప్పారు.