శంఖవరంలో విషాదం | Former TDP MLA Parvatha Sri Satyanarayana Murthy passes away | Sakshi
Sakshi News home page

శంఖవరంలో విషాదం

Published Mon, Mar 14 2016 4:50 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

శంఖవరంలో విషాదం - Sakshi

శంఖవరంలో విషాదం

* చిట్టిబాబు హఠాన్మరణంతో కలత చెందిన స్వగ్రామం
* కన్నీరుమున్నీరుగా విలపించిన అభిమానులు
* శ్రద్ధాంజలి ఘటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

శంఖవరం : అజాతశత్రువుగా, సహృదయునిగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత సత్యనారాయణమూర్తి (చిట్టిబాబు) కన్నుమూతతో స్వగ్రామం శంఖవరం శోకసంద్రంగా మారింది. కాకినాడలో నివసిస్తున్న చిట్టిబాబుకు ఆదివారం ఉదయం  తీవ్రమైన గుండెపోటు రాగా అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్సనందిస్తుండగానే ఆయన కన్నుమూశారు. ఈ విషాదవార్త టీడీపీ శ్రేణుల్నీ, ఆయన అభిమానుల్నీ కలచివేసింది.
 
ఎలాంటి భేషజాలూ లేకుండా వ్యవహరించే చిట్టిబాబుకు ప్రత్తిపాడు నియోజకవర్గంలోనే గాక జిల్లాలో కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలోని రాజకీయ కుటుంబాల్లో ఒకటిగా పరిగణించే పర్వత కుటుంబంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన నాలుగో నేత చిట్టిబాబు. ప్రత్తిపాడు నియోజక వర్గపు తొలి ఎమ్మెల్యేగా పర్వత గుర్రాజు ఎన్నికై ఆ కుటుంబానికి వన్నెతెచ్చారు. తరువాత టీడీపీ తరఫున 1994లో ఆ కుటుంబం నుంచి పర్వత సుబ్బారావు, 1999లో ఆయన భార్య బాపనమ్మ ఎమ్మెల్యేలుగా గెలిచారు.

2009లో జరిగిన ఎన్నికల్లో చిట్టిబాబు అదే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో చిట్టిబాబు గెలిస్తే మంత్రి పదవి ఖాయమని అంతా భావించారు. ఓటమి చెందినా జిల్లా టీడీపీ పగ్గాలు ఆయనకు అప్పగించారు. పార్టీ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో గెలవలేకపోయానని మథనపడ్డా జిల్లా సారథిగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.
 
చిట్టిబాబు భౌతికకాయాన్ని కాకినాడ నుంచి మధ్యాహ్నం 12 గంటలకు శంఖవరంలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చినప్పుడు కుటుంబసభ్యులే కాక పలువురు కార్యకర్తలు, అభిమానులు కన్నీరుమున్నీరుగా రోదించారు. కుటుంబ సభ్యులైన మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ, చిట్టిబాబు భార్య అన్నపూర్ణ, తల్లి సీతారత్నం, తమ్ముడు రాజబాబు, కుమారై కనకదుర్గ, కుమారుడు రాజేష్, మరదలు జానకి వెక్కెక్కి విలపించారు.

ఎందరో అభిమానులు ఆయన పార్ధివ దేహంపై పడి బావురుమన్నారు. పార్టీ ప్రముఖులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో శంఖవరం చేరుకుని చిట్టిబాబుకు శ్రద్ధాంజలి ఘటించారు. సంతాపసూచకంగా శంఖవరంలో దుకాణాలు, హోటళ్లు మూసివేశారు. సాయంత్రం చిట్టిబాబు అంత్యక్రియలు జరిగాయి.
 
టీడీపీ మంచి నేతను కోల్పోయింది : చంద్రబాబు
చిట్టిబాబు మృతితో తమ పార్టీ మంచితనానికి మారుపేరైన నాయకుణ్ణి  కోల్పోంుుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. హెలికాప్టర్‌లో అన్నవరం చేరుకుని అక్కడి నుంచి శంఖవరం వచ్చిన చంద్రబాబు.. చిట్టిబాబు భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరితో కలుపుగోలుగా ఉండే చిట్టిబాబు స్వభావం చూసే జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెప్పామన్నారు. మాజీ ఎమ్మెల్యే బాపనమ్మను, కుటుంబసభ్యులను ఓదార్చారు.

ఆయన వెంట ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మున్సిపల్ మంత్రి పి.నారాయణ, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, కాకినాడ ఎంపీ తోట నరసింహం, జెడ్‌పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పులపర్తి నారాయణమూర్తి, ఎ.ఆనందరావు, దాట్ల సుబ్బరాజు, వే గుళ్ల జోగేశ్వరరావు, ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ, తోట త్రిమూర్తులు, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎన్.వీర్రెడ్డి తదితరులున్నారు. చిట్టిబాబు భౌతికకాయాన్ని కాకినాడ నుంచి శంఖవరం తరలించినప్పుడు వెంట ఎంపీ తోట, మాజీ మంత్రి కొప్పన మోహనరావు ఉన్నారు.
 
ఆస్పత్రి వద్ద ప్రముఖుల నివాళి
కాకినాడ సిటీ : చిట్టిబాబు మరణవార్త తెలియగానే ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని, జెడ్పీ చైర్మన్ నామన, ఎంపీ తోట నరసింహం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, దాట్ల బుచ్చిరాజు, టీడీపీ నగరఅధ్యక్షుడు నున్న దొరబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వై.మాలకొండయ్య తదితరులు అపోలో ఆసుపత్రికి చేరుకుని నివాళులర్పించారు. చిట్టిబాబు మృతి తమ పార్టీకి తీరనిలోటని చినరాజప్ప అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement