మెడ్‌టెక్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అరెస్టు
రాజ్ ప్రవర్తన నచ్చక గత ఏప్రిల్‌లో కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. కేరళకు చెందిన జుడిష్ రాజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. సైబర్ నేరం, సెక్షన్ 420 కింద అతడిని శనివారమే హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన జుడిష్ రాజ్‌తోపాటు మరికొందరు మెడ్‌టెక్ జోన్‌లో జరిగిన అవినీతిపై మాట్లాడగానే ఆయనను అరెస్టు చేయడం, మరికొందరిని అదుపులోకి తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది.
అవినీతి వెనుక కొందరు ఏపీ మంత్రులతోపాటు ఓ కేంద్ర మంత్రి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. వీరి పేర్లన్నీ జుడిష్ రాజ్‌కు తెలుసు. ఈ పేర్లను బయట పెడతాడనే భయంతో అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్టు తెలుస్తోంది. కాగా, మెడ్‌టెక్ పార్క్‌లో అక్రమాలపై ఆధారాలతో సీఎస్‌తో పాటు విజిలెన్స్ అధికారి అనూరాధకు ఫిర్యాదులు వెళ్లాయి. సీఎస్ ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించినట్టు తెలిసింది.