సాక్షి, అమరావతి : ఎట్టకేలకు మెడ్‌టెక్ జోన్ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అమాంతం అంచనాలు పెంచి కోట్లకు కోట్లు కొట్టేద్దామనుకున్న ఓ ప్రైవేట్ కన్సల్టెంట్‌తో పాటు దాని వెనుక ఉన్న పెద్దల వ్యూహానికి గండి పడింది. విశాఖలో 200 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ స్కీము వెనుక రూ.వంద కోట్లు్ల ముడుపులుగా చేతులు మారనున్నాయని కొద్ది రోజుల క్రితం ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి.
అవి నిజం కావని అధికారులతో చెప్పించిన ప్రభుత్వ పెద్దలు.. మీడియాకు సమాచారమిచ్చిన వారిని కూడా బెదిరించి, వారితో అనుకూలంగా లేఖలు రాయించుకున్న విషయం తెలిసిందే. ఈ పనులను రూ.709.81 కోట్ల అంచనాతో చేపట్టవచ్చని కేపీఎంజీ సంస్థ నివేదిక ఇచ్చింది. ఈ అంచనాలను తోసిరాజని మెడ్‌టెక్ పార్క్ సీఈఓ రూ.2,432 కోట్లకు అంచనాలు పెంచి ల్యాంకో సంస్థకు పనులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐకి ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు వెనక్కు తగ్గుతూ టెండర్లు రద్దు చేశారు.
మళ్లీ తాజాగా రూ.400 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ నెల 3వ తేదీన ఈ మేరకు ఆన్‌లైన్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈనెల 25న సాంకేతిక, ఆర్థిక బిడ్‌లు ప్రారంభిస్తారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని, మరో 3 నెలలు గడువు పెంచుతామన్నారు. టెండర్లు దక్కించుకున్న ల్యాంకో సకాలంలో పనులు ప్రారంభించలేదని, అందుకే మళ్లీ టెండర్లకు వెళుతున్నట్టు మెడ్‌టెక్ జోన్ సీఈఓ జితేంద్రశర్మ ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment