Med Tech
-
ఇంట్లోనే కరోనా టెస్టులు
న్యూఢిల్లీ: కరోనా వచ్చిందో లేదో ఇంట్లోనే ఉండి నిర్ధారించుకునే సరికొత్త టెస్టింగ్ కిట్ ను ఐఐటీ ఢిల్లీ, జాతీయ రసాయన లాబొరేటరీ (ఎన్సీఎల్)లు కలసి తయారు చేస్తున్నాయి. తక్కువ సమయంలోనే ఈ కిట్ ఫలితాలను వెల్లడిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీనికి మైక్రోసాఫ్ట్ ఇండియా వంటి దిగ్గజ సంస్థ ఆర్థిక చేయూతను అందిస్తోంది. వీరు ఎలీసా (ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసాయ్) ఆధారంగా కోవిడ్ ను నిర్ధారించే ప్రక్రియతో తయారుకానుంది. ప్రస్తుతం నిర్ధారణకు అయ్యే ఖర్చులకంటే తక్కువ ఖర్చులోనే ఇది పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుతం ఈ కిట్లను ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉన్న మెడ్ టెక్ జోన్ లో తయారు చేస్తున్నామని, ఓ నెలరోజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
'వైద్య పరికరాల ఉత్పత్తిలో మెడ్‌టెక్ కీలకం'
సాక్షి, విజయవాడ : విశాఖ మెడ్‌టెక్ జోన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖండించినట్లు మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. మెడ్‌టెక్ జోన్లో ప్రస్తుతం వైద్య పరికరాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెడ్‌టెక్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పరికరాలను కూడా పరీక్ష చేసే 13 లాబ్స్ ఏర్పాటు చేశామని, కోవిడ్ కిట్లు, వెంటిలేటర్లు ఈనెల 10వ తేదీ నుంచి మార్కెట్లోకి వస్తాయన్నారు. దేశంలోనే వైద్య పరికరాల ఉత్పత్తిలో అత్యంత కీలకంగా మెడ్ టెక్ జోన్ మారబోతోందన్నారు. ప్రభుత్వ సహకారంతో మెడ్‌టెక్ జోన్ ఎండీ జితేందర్ శర్మ దీనిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు.(విద్యుత్ దీపాల బంద్; కేంద్రం వివరణ) కరోనా వల్ల వివిధ దేశాలు కరోనా కిట్లు, వెంటిలేటర్లు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నాయని, ఈ తరుణంలో మన రాష్ట్రంలో మెడ్‌టెక్ జోన్లో ఇవి తయారు అవుతుండటం చాలా కీలకమైన అంశమని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో సరాసరి 3వేల వెంటిలేటర్లు తయారు చేయనున్నారని.. మే నెల నుంచి 6 వేల కిట్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో పాటు ఏప్రిల్ నెలలో 10 వేలు, మే నుంచి 25 వేల వరకు టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మెడ్‌టెక్ జోన్‌కు ఎలాంటి నిధులు అందలేదన్నారు. కాగా ఉత్పత్తులు మార్కెట్లోకి రాక మునుపే వాటిని పరీక్ష చేసి విడుదల చేయాల్సిన అవసరం ఉందని, వాటి కోసం లాబ్స్ అవసరం అవుతాయని తెలిపారు. ల్యాబ్స్ ఏర్పాటు చేసే విషయమై గతంలో కొందరు వ్యతిరేకంగా పనిచేశారని, సీఈఓ జితేంద్ర శర్మ విషయంలో ఇదే జరిగిందన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని విచారణ జరిపిస్తున్నామని పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. కాగా మెడ్‌టెక్ జోన్లో సీటీ స్కానర్, శానిటైజర్ ఉత్పత్తులు తయారు అవుతుంటాయి. ('బాబు.. నీ బోడి సలహాలు అవసరం లేదు') పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ వైద్య పరికరాల తయారీలో కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం వైద్య పరికరాల పార్కు అభివృద్ధి కోసం కట్టుబడి ఉందన్నారు. కాగా మెడ్‌టెక్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రభుత్వాన్ని నిధులు అడిగినట్లు తెలిపారు. కోవిడ్ కిట్లు, వెంటిలేటర్ల తయారీకి ఆదేశాలు జారీ చేశామని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ 15 నాటికి సరఫరా చేయాల్సిందిగా మెడ్ టెక్ పార్కు లో కొన్ని కంపెనీలను కోరాం. అక్కడ ఉత్పత్తి ని గాని, అభివృద్ధి ని గాని తగ్గించ లేదు.రెండో దశ లో 270 ఎకరాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఏపీఐఐసికి అప్పగించామన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి కూడా రుణం తీయకుని అభివృద్ధి చేపట్టామని తెలిపారు. సీఎం ఆదేశాలు మేరకు రెండో దశ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయని రజత్ భార్గవ స్పష్టం చేశారు. -
మెడ్‌టెక్ జోన్ టెండర్లు రద్దు
సాక్షి, అమరావతి : ఎట్టకేలకు మెడ్‌టెక్ జోన్ టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అమాంతం అంచనాలు పెంచి కోట్లకు కోట్లు కొట్టేద్దామనుకున్న ఓ ప్రైవేట్ కన్సల్టెంట్‌తో పాటు దాని వెనుక ఉన్న పెద్దల వ్యూహానికి గండి పడింది. విశాఖలో 200 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ స్కీము వెనుక రూ.వంద కోట్లు్ల ముడుపులుగా చేతులు మారనున్నాయని కొద్ది రోజుల క్రితం ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. అవి నిజం కావని అధికారులతో చెప్పించిన ప్రభుత్వ పెద్దలు.. మీడియాకు సమాచారమిచ్చిన వారిని కూడా బెదిరించి, వారితో అనుకూలంగా లేఖలు రాయించుకున్న విషయం తెలిసిందే. ఈ పనులను రూ.709.81 కోట్ల అంచనాతో చేపట్టవచ్చని కేపీఎంజీ సంస్థ నివేదిక ఇచ్చింది. ఈ అంచనాలను తోసిరాజని మెడ్‌టెక్ పార్క్ సీఈఓ రూ.2,432 కోట్లకు అంచనాలు పెంచి ల్యాంకో సంస్థకు పనులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐకి ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు వెనక్కు తగ్గుతూ టెండర్లు రద్దు చేశారు. మళ్లీ తాజాగా రూ.400 కోట్లతో టెండర్లు పిలిచారు. ఈ నెల 3వ తేదీన ఈ మేరకు ఆన్లైన్లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈనెల 25న సాంకేతిక, ఆర్థిక బిడ్లు ప్రారంభిస్తారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని, మరో 3 నెలలు గడువు పెంచుతామన్నారు. టెండర్లు దక్కించుకున్న ల్యాంకో సకాలంలో పనులు ప్రారంభించలేదని, అందుకే మళ్లీ టెండర్లకు వెళుతున్నట్టు మెడ్‌టెక్ జోన్ సీఈఓ జితేంద్రశర్మ ధ్రువీకరించారు. -
మెడ్‌టెక్ మాజీ వైస్ ప్రెసిడెంట్ అరెస్టు
సంస్థను మోసగించాడని జుడిష్ రాజ్‌పై సీఈవో ఫిర్యాదు మధురవాడ(భీమిలి)/సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ పార్కు (మెడ్‌టెక్)కు చెందిన అధికారిక సమాచారాన్ని ఇతరులకు చేరవేసి సైబర్ నేరానికి పాల్పడ్డాడన్న అభియోగంపై ఆ సంస్థ మాజీ వైస్ ప్రెసిడెంట్ జుడిష్ రాజ్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మెడ్‌టెక్ సంస్థలో పనిచేసిన జుడిష్ రాజ్ కీలక సమాచారాన్ని అనధికారికంగా తప్పుడు మొయిళ్ల ద్వారా ఇతరులకు, ఇతర రాష్ట్రాలకు చేరవేశాడు. సంస్థను మోసం చేసి నష్టం కలిగించాడు. ఈ మేరకు మెడ్‌టెక్ పార్క్ సీఈవో జితేంద్రశర్మ పేరిట ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు అందింది. రాజ్ ప్రవర్తన నచ్చక గత ఏప్రిల్‌లో కంపెనీ అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. కేరళకు చెందిన జుడిష్ రాజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. సైబర్ నేరం, సెక్షన్ 420 కింద అతడిని శనివారమే హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన జుడిష్ రాజ్‌తోపాటు మరికొందరు మెడ్‌టెక్ జోన్లో జరిగిన అవినీతిపై మాట్లాడగానే ఆయనను అరెస్టు చేయడం, మరికొందరిని అదుపులోకి తీసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అవినీతి వెనుక కొందరు ఏపీ మంత్రులతోపాటు ఓ కేంద్ర మంత్రి హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. వీరి పేర్లన్నీ జుడిష్ రాజ్‌కు తెలుసు. ఈ పేర్లను బయట పెడతాడనే భయంతో అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్టు తెలుస్తోంది. కాగా, మెడ్‌టెక్ పార్క్‌లో అక్రమాలపై ఆధారాలతో సీఎస్‌తో పాటు విజిలెన్స్ అధికారి అనూరాధకు ఫిర్యాదులు వెళ్లాయి. సీఎస్ ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించినట్టు తెలిసింది.