పూనం మాలకొండయ్య
సాక్షి, విజయవాడ : విశాఖ మెడ్‌టెక్ జోన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖండించినట్లు మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. మెడ్‌టెక్ జోన్‌లో ప్రస్తుతం వైద్య పరికరాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెడ్‌టెక్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. పరికరాలను కూడా పరీక్ష చేసే 13 లాబ్స్ ఏర్పాటు చేశామని, కోవిడ్ కిట్లు, వెంటిలేటర్లు ఈనెల 10వ తేదీ నుంచి మార్కెట్లోకి వస్తాయన్నారు. దేశంలోనే వైద్య పరికరాల ఉత్పత్తిలో అత్యంత కీలకంగా మెడ్ టెక్ జోన్ మారబోతోందన్నారు. ప్రభుత్వ సహకారంతో మెడ్‌టెక్ జోన్ ఎండీ జితేందర్ శర్మ దీనిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు.(విద్యుత్ దీపాల బంద్; కేంద్రం వివరణ)
కరోనా వల్ల వివిధ దేశాలు కరోనా కిట్లు, వెంటిలేటర్లు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నాయని, ఈ తరుణంలో మన రాష్ట్రంలో మెడ్‌టెక్ జోన్‌లో ఇవి తయారు అవుతుండటం చాలా కీలకమైన అంశమని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో సరాసరి 3వేల వెంటిలేటర్లు తయారు చేయనున్నారని.. మే నెల నుంచి 6 వేల కిట్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని వెల్లడించారు. దీంతో పాటు ఏప్రిల్ నెలలో 10 వేలు, మే నుంచి 25 వేల వరకు టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మెడ్‌టెక్ జోన్‌కు ఎలాంటి నిధులు అందలేదన్నారు.
కాగా ఉత్పత్తులు మార్కెట్లోకి రాక మునుపే వాటిని పరీక్ష చేసి విడుదల చేయాల్సిన అవసరం ఉందని, వాటి కోసం లాబ్స్ అవసరం అవుతాయని తెలిపారు. ల్యాబ్స్ ఏర్పాటు చేసే విషయమై గతంలో కొందరు వ్యతిరేకంగా పనిచేశారని, సీఈఓ జితేంద్ర శర్మ విషయంలో ఇదే జరిగిందన్నారు. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకొని విచారణ జరిపిస్తున్నామని పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. కాగా మెడ్‌టెక్ జోన్‌లో సీటీ స్కానర్, శానిటైజర్ ఉత్పత్తులు తయారు అవుతుంటాయి. ('బాబు.. నీ బోడి సలహాలు అవసరం లేదు')
పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ వైద్య పరికరాల తయారీలో కీలకపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం వైద్య పరికరాల పార్కు అభివృద్ధి కోసం కట్టుబడి ఉందన్నారు. కాగా మెడ్‌టెక్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రభుత్వాన్ని నిధులు అడిగినట్లు తెలిపారు. కోవిడ్ కిట్లు, వెంటిలేటర్ల తయారీకి ఆదేశాలు జారీ చేశామని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ 15 నాటికి సరఫరా చేయాల్సిందిగా మెడ్ టెక్ పార్కు లో కొన్ని కంపెనీలను కోరాం. అక్కడ ఉత్పత్తి ని గాని, అభివృద్ధి ని గాని తగ్గించ లేదు.రెండో దశ లో 270 ఎకరాల ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఏపీఐఐసికి అప్పగించామన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి కూడా రుణం తీయకుని అభివృద్ధి చేపట్టామని తెలిపారు. సీఎం ఆదేశాలు మేరకు రెండో దశ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయని రజత్ భార్గవ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment