నాయుడుపేట: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాగు నీటి కోసం రైతుల మధ్య వాగ్వివాదం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇటీవల అధికారులు తెలుగు గంగ కాలువకు 20 టీఎంసీల నీటిని వదిలారు. స్వర్ణముఖి నదికి చేరుకునే ఈ నీరు నదికి రెండు వైపులా ఉన్న కోట, వాకాడు, చిట్టమూరు, నాయుడుపేట మండలాల వారి తాగు, సాగు అవసరాలను తీరుస్తుంది. అయితే, కాస్త ఎగువన ఉన్న నాయుడుపేట రైతుల భూములకు ఈ నీరు అందదు. దీంతో వారు స్వర్ణముఖి నదికి అడ్డుగా కట్ట నిర్మించారు. దీనిని రెండు రోజుల క్రితం దిగువ మండలాల రైతులు వచ్చి తెంపేశారు. నాయుడుపేట మండల రైతులు జేసీబీలను తెచ్చి నిన్న మళ్లీ కట్ట నిర్మించారు.
కాగా, ఆదివారం దిగువ మండలాలకు చెందిన దాదాపు 200 మంది రైతులు అక్కడికి వచ్చి, అడ్డుకట్టను తెంపేందుకు యత్నించగా నాయుడుపేట రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ విషయం తెలిసిన ఇరు వర్గాల రైతులు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకోవటం ప్రారంభించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.