అనంతపురం అగ్రికల్చర్ : నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపించక పోవడంతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వర్షాకాలంలో కూడా ఆశించిన స్థాయిలో వానలు పడకపోవడం పరిస్థితిని మరింత జఠిలం చేస్తోంది. జిల్లాలో 73 ప్రాంతాల్లో బోరుబావులతో అనుసంధానించిన ఫిజోమీటర్ల నుంచి భూగర్భ జల శాఖ అధికారులు సేకరించిన గణాంకాలను బట్టి చూస్తే తాజా సగటు నీటిమట్టం 19.22 మీటర్లుగా నమోదైంది.
బోరు బావుల్లో నీరు అడుగంటడంతో వరి సాగు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఉద్యాన తోటలు, పశుగ్రాసం పెంపకం, పాడి పరిశ్రమ అభివ ృద్ధికి అవరోధంగా తయారైంది. సాగు, తాగునీటికీ తిప్పలు తప్పడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉంది. అనంతపురం, ధర్మవరం, కదిరి రెవెన్యూ డివిజన్లలో పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉన్నా కళ్యాణదుర్గం, పెనుకొండ డివిజన్లలో మాత్రం ఇబ్బందిగా ఉంది. జిల్లాలో వార్షిక (ప్రతి ఏటా జూన్ 1నుంచి మరుసటి ఏడాది మే నెలాఖరు వరకు) సాధారణ వర్షపాతం 552.3 మిల్లీ మీటర్లు కాగా, మే నెలాఖరుకు 538 మి.మీ నమోదైంది. అందులో గత సెప్టెంబర్ నెలలో మాత్రమే ఏకంగా 239 మి.మీ నమోదు కావడం విశేషం. మిగతా నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం జూన్ సాధారణ వర్షపాతం 63.9 మి.మీ కాగా 50.4 మి.మీ వర్షం మాత్రమే పడింది. సాధారణం కన్నా తక్కువ వర్షం పడడంతో దాని ప్రభావం భూగర్భ జలాలపై పడింది. దీంతో 44 మండలాల్లో పాతాళగంగ అడుగంటిపోతుండగా, 19 మండలాల్లో మాత్రం కొంత మెరుగ్గా కనిపిస్తోంది.
కిష్టిపాడులో మరీ ఘోరం...
పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో ఉన్న ఫిజోమీటర్‌కు భూగర్భ జలాలు అందని పరిస్థితి నెలకొంది. అక్కడ దాదాపు 50 మీటర్ల లోతులో నీరు ఉన్నట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. పుట్లూరులో 45.50 మీటర్ల అడుగున ఉన్నాయి. గుమ్మఘట్ట మండలం తాళ్లకెరెలో 33.92 మీటర్లు, సోమందేపల్లిలో 31.54, సోమందేపల్లి మండలం చాలకూరులో 30.76, పరిగిలో 29.43, అమడగూరులో 29.83, రాయదుర్గం మండలం బాగినాయకనహల్లిలో 29.15, కంబదూరు మండలం నూతిమడుగులో 29.10, పుట్లూరు మండలం మడ్డిపల్లిలో 28.80, బ్రహ్మసముద్రంలో 28.11, కణేకల్లు క్రాస్‌లో 26.56, మడకశిర మండలం కల్లుమర్రిలో 28.30, యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో 26.07, గుడిబండ మండలం మందలపల్లిలో 26.81, లేపాక్షిలో 25.74, డీ హిరేహాల్ మండలం ఓబులాపురంలో 24.24, యాడికి మండలం నిట్టూరులో 24.60, రొద్దం మండలం తురకలాపట్నంలో 23.28, బత్తలపల్లి మండలం కట్టకిందపల్లిలో 23.11, తనకల్లు మండలం చీకటిమానేపల్లిలో 22.98, కనగానపల్లిలో 22.70, బెళుగుప్ప మండలం గంగవరంలో 21.19, హిందూపురం మండలం మలుగూరులో 20.35, చిలమత్తూరులో 19.55 మీటర్లు ... ఇలా 44 మండలాల పరిధిలో భూగర్భ జలాల పరిస్థితి దారుణంగా ఉంది.
బోరుమంటున్న రైతన్న
Published Mon, Jul 14 2014 2:32 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement