జడ్చర్ల, న్యూస్‌లైన్: ఆరుగాలం కష్టించి శ్రమటోడ్చి పం టలు పండించిన రైతులకు చివరికి గిట్టుబా టు ధరలు దక్కకపోవడంతో ఆందోళనకు గు రవుతున్నారు. రైతులకు ఏటా ప్రభుత్వం ప్ర కటిస్తున్న కనీస మద్దతుధరలు.. సాగువ్యయానికి మధ్య భారీవ్యత్యాసం ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధరలు కూడా లభించకపోవడంతో అన్నదాతలు దిక్కుతోచ ని స్థితిని ఎదుర్కొంటున్నారు.
కాగా, ప్రభుత్వం ఈ ఏడాది పెంచిన మద్దతుధరలు ఆశాజనకంగా లేవు. మొక్కుబడిగా ధరలు పెంచడంతో రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితు లు కనిపించడం లేదు. గతేడాదితో పోల్చితే పత్తికి కేవలం క్వింటాలుకు రూ.100 మాత్రమే పెంచింది. అదేవిధంగా మొక్కజొన్నకు క్వింటాలుకు కేవలం రూ.135, వరి ధాన్యానికి రూ.65 మాత్రమే పెంచింది. స్థానిక బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో ఇప్పటివరకు మొక్కజొన్న సుమారు 50వేల క్వింటాళ్ల విక్రయాలు జరిగాయి. రైతులు శనివారం ఒకేరోజు 20వేల క్వింటాళ్లు విక్రయించారు. నాణ్యతను బట్టి కనిష్ట ధర రూ.1311 పలకగా, గరిష్టంగా రూ.1440 పలికింది. అయితే మొక్కజొన్నకు సంబంధించి రూ.1800 నుంచి రూ.రెండువేల మధ్య ధర పలికితే కొంతమేర లాభదాయకంగా ఉంటుందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడి మార్కెట్‌లో సుమారు ఐదువేల క్వింటాళ్ల వరిధాన్యం విక్రయాలు జరిగాయి. ధర కనిష్టంగా రూ.1300.. గరిష్టంగా రూ.1500 పలికింది. అయితే ధర రూ.రెండువేల పలికితే గిట్టుబాటు అవుతుందని రైతులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు రెండువేల క్వింటాళ్ల వేరుశనగ విక్రయాలు జరిగాయి. కనిష్టధర రూ.నాలుగువేలు, గరిష్ట ధర రూ.4200 పలికింది. అయితే రూ.ఐదువేల నుంచి రూ.4500 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆముదం పంటకు ప్రస్తుతం క్వింటాలుకు గరిష్టధర రూ.మూడువేలు పలకగా, రూ.నాలుగు వేలు చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుంది.
గతేడాది విక్రయాలు
గతేడాది బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో 3.60లక్షల క్వింటాళ్ల పత్తి విక్రయాలకు సంబంధించి రూ.8కోట్ల వ్యాపారం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్నకు సంబంధించి 3.3లక్షల క్వింటాళ్ల విక్రయాలకు సంబంధించి రూ.2.50 కోట్ల వ్యాపారం జరిగింది. అలాగే 2.50 లక్షల క్వింటాళ్ల వరిధాన్యం విక్రయాలు జరిగాయి. ఇంత పెద్దమొత్తంలో రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయిస్తున్నా ఆశించిన ధరలు లభించకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ వైపు సరైన దిగుబడి రాకపోవడం..మరోవైపు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో అన్నదాత పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
అచ్చంపేట మార్కెట్‌లో..
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం మొక్కజొన్న విక్రయాలు జోరుగా సాగాయి. మార్కెట్‌యార్డుకు మొత్తం 4300 క్వింటాళ్ల మొక్కజొన్న ధాన్యం రాగా కనిష్టంగా రూ.1050, గరిష్టంగా రూ. 1450, సగటున రూ.1390 మద్దతు ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. రైతులు ఎండబెట్టిన ధాన్యాన్ని తీసుకువస్తే మద్దతు ధర లభిస్తుందని సూచించారు.
సాగు వ్యయం పెరిగింది
గతేడాదితో పోల్చితే సాగువ్యయం గణనీ యంగా పెరిగింది. సాగుకు తగ్గట్లుగా ప్రభుత్వం గిట్టుబాటు ధరలను పెంచాలి. అసలే నిత్యావసర ధరలు అందనంత ఎత్తుకు ఎగబాకుతున్నాయి. వాటికి అనుగుణంగా తమ దిగుబడులకు కూడా మంచి ధరలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
- రాములు నాయక్,
రైతు, దోనూరు తండా,
మిడ్జిల్ మండలం
ధరలను పరిశీలించాలి
ప్రభుత్వం రైతులకు చెల్లిస్తున్న ధరలను మరోసారి పరిశీలించాలి. పత్తికి కనీసంగా రూ.6వేలు, వరికి రూ.2వేలు, మొక్కజొన్నకు రూ.1800గా నిర్ణయించాలి. అసలే సాగువ్యయం పెరిగింది. దీనికితోడు నిత్యావసర ధరలతో పాటు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్‌చార్జీల భారంతో రైతులు కుదేలవుతున్నారు. ధరలు గిట్టుబాటు కాకపోతే ఆందోళనలు తప్పవు.
- కరకల కృష్ణారెడ్డి,
భారతీయ కిసాన్‌సంఘ్ జిల్లా అధ్యక్షులు
‘గిట్టుబాటు’ వట్టిమాటే !
Published Mon, Sep 30 2013 4:28 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement