అనంతపురం అర్బన్: ఓటరు నమోదుకు ఇక నాలుగు రోజులే గడువు ఉంది. ఈనెల 15 లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అందువల్ల ఇప్పటికీ ఓటు నమోదు చేసుకోని వారు వెంటనే నమోదు చేయించుకోవాలి. అలాగే ఓటర్లంతా జనవరి 11న విడుదల చేసిన తుది ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకోవాలి. జిల్లాలోని 3,879 పోలింగ్ కేంద్రాల్లోనూ అక్కడి బీఎల్‌ఓల వద్ద, తహసీల్దారు కార్యాలయాల్లోనూ ఓటరు జాబితాలు అందుబాటులో ఉంచారు. జాబితాలో పేరులేని వారు వెంటనే ఫారం–6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి.
ఆందోళనకు గురిచేసిన ఫారం–7
ఓటు తొలగింపునకు నిర్దేశించిన ఫారం–7 అధికంగా దాఖలు కావడంతో ఓటర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటరు జాబితా సవరణ ఉంటుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ క్రమంలో అధికార పార్టీ నాయకులు ఫారం–7ను తమకు అనుకూలంగా మార్చుకుని ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు సిద్ధపడ్డారు. ఈ వ్యవహారం వెలుగు చూపడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఈనెల 15 వరకు ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. ఓటరు తొలగింపునకు అధికసంఖ్యలో ఫారం–7 రావడం కూడా ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఫారం–7 దరఖాస్తులను పరిశీలించి నివేదికనుతమకు పంపాలని అధికారులను ఆదేశించింది. ఫారం–7 అడ్డుపెట్టుకుని నిజమైన ఓటరును తొలగిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున ఇక ఓట్ల తొలగింపు ఉండదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.
జాబితాలో పేరుందో లేదో చూసుకోవాలి
ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రజలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఓటు లేదని గుర్తిస్తే వెంటనే నమోదు చేసుకోవాలి. ఎందుకంటే 2014 ఎన్నికల సమయంలో జిల్లాలో 29,87,264 మంది ఉన్నారు. గత ఏడాది సెప్టెంబరు 1న ప్రకటించిన ఓటర్ల జాబితలో ఏకంగా 1,01,772 ఓట్లు గల్లంతయ్యాయి. ఈ క్రమంలో అదే ఏడాది అక్టోబరు 31 వరకు ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది జనవరి 11 ఓటర్ల తుదిజాబితాను ప్రకటించారు. ఆ ప్రకారం జిల్లాలో 30,58,909 మంది ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ చాలా మంది అర్హులు ఓటరుగా నమోదు కాలేదు. ముఖ్యంగా 18–19 ఏళ్ల మధ్య వయసున్న వారు జిల్లాలో 1,64,816 మంది ఉండగా, ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో కేవలం 38,335 మంది నమోదు చేసుకున్నారు. ఇప్పటికీ అధిక శాతం యువత తమ ఓటు నమోదు చేసుకోలేదు. నమోదుకు నాలుగు రోజులు మాత్రమే గడువు ఉన్నందున ఇప్పటికీ ఓటరుగా నమోదు కాని వారు ఓటును నమోదు చేసుకోవాలి.
ఓటరుగా నమోదు చేసుకోండి
ఓటరుగా నమోదుకు ఈనెల 15 వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికీ ఓటరుగా నమోదు కాని వారు ఓటరుగా నమోదు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓటరు జాబితాలను బీఎల్‌ఓలు, తహసీల్దారు కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాము. అదే విధంగా ఆన్‌లైన్‌లోనూ చూసుకోవచ్చు. ఓటు లేకపోతే వెంటనే ఫారం–6 ద్వారా మాన్యువల్‌గా బీఎల్‌ఓలు, తహసీల్దారు కార్యాలయంలో, లేదా మీసేవలో ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలి. – ఎస్.డిల్లీరావు, జాయింట్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment