
కామవరపుకోట: పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం వీరిశెట్టి గూడెంలోని ఒక ఇంట్లో గురువారం తెల్లవారు జామున జరిగిన అగ్ని ప్రమాదంలో నిద్రలోనే నలుగురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో తల్లీ ఇద్దరు కూతుర్లు, మరో బాలుడు మృతి చెందగా ఇంకో మహిళ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇది ప్రమాదమా.. పథకం ప్రకారం భర్త అఘాయిత్యమా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతులు గ్రామానికి చెందిన కేతా లక్ష్మి(35), కుమార్తెలు కాశీ అన్నపూర్ణేశ్వరి (11), లావణ్య(4), పితాని రంగమ్మ కుమారుడు పితాని మణికంఠ (12)లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో లక్ష్మి వదిన పితాని రంగమ్మ గాయపడింది. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు, కుటుంబ సభ్యులు భిన్న కథనాలు వినిపిస్తున్నారు. పథకం ప్రకారమే ఇంటికి నిప్పంటించి నిద్రిస్తున్న వారిని హతమార్చారని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
లక్ష్మికి అయిదేళ్ల క్రితం ద్వారకాతిరుమల మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన కేతా నాగేశ్వరరావుతో ద్వితీయ వివాహం జరిగింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో నాలుగు నెలల నుంచి విడిగా ఉంటున్నారు. లక్ష్మి వీరిశెట్టిగూడెంలోని పుట్టింట్లో ఉంటుండగా, నాగేశ్వరరావు రామన్నగూడెంలో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో లక్ష్మి బుధవారం డ్వాక్రా గ్రూపునకు సంబంధించిన పనిమీద రామన్నగూడెం వెళ్లగా అక్కడ నాగేశ్వరరావు లక్ష్మితో ఘర్షణ పడినట్లు బంధువులు తెలిపారు. రాత్రికే ఇలా జరగడంతో వారు అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment