కుక్క ప్రాణం కాపాడాలని డ్రైవర్ ఆటోను కుడివైపునకు తిప్పాడు.
ఆదోని/ టౌన్/ అర్బన్ : వచ్చే నెలలో పెళ్లి కొడుకు కావాల్సిన యువకుడు, తన పిల్లలను ఎలాగైనా ఉన్నత చదువులు చదివించాలని తపించిన తల్లి, జ్వరంతో బాధపడుతున్న మనవడిని చూసొద్దామని వెళ్తున్న అవ్వ, ఇంటికి సరుకులు తెచ్చుకుందామని బయలుదేరిన మహిళ.. ఇలా నలుగురు గురువారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కుక్క ప్రాణం కాపాడాలని డ్రైవర్ ఆటోను కుడివైపునకు తిప్పాడు.
ఇంతలో ఊహించని మృత్యువు బస్సు రూపంలో ఆటోను ఢీ కొంది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే నలుగురి ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఓ గర్భిణి కూడా ఉంది. ఆటో డ్రైవరు, క్షతగాత్రులు, పోలీసులు అందించిన సమాచారం మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గోనబావి నుంచి ఉదయం 11 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన ఆటో(నం.ఏపీ 21ఎక్ 1516)లో 11 మంది ప్రయాణీకులు ఆదోనికి వస్తున్నారు. ఆదోని-ఆస్పరి రోడ్డులో గోనబావి క్రాస్ రోడ్డు సమీపంలో కొన్ని కుక్కలు కొట్లాడుకుంటూ ఒక కుక్క రోడ్డు మీదకు వచ్చింది.
దీంతో కుక్కను తప్పించేందుకు డ్రైవరు ఆటోను రోడ్డు మధ్యకు తిప్పాడు. ఎదురుగా వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు(నం.కెఏ 36 ఎఫ్ 995)ను గమనించలేదు. అకస్మాత్తుగా ఆటో రోడ్డుకు అడ్డంగా రావడంతో దిక్కుతోచని డ్రైవర్ బస్సును ఓ పక్కకు తిప్పేలోగా ఆటోను బలంగా ఢీకొంది. ఆటో నుజ్జునుజ్జు అయింది. ఆటోలోని గోనబావి గ్రామానికి చెందిన మాల దాసరి మహాదేవమ్మ(65), వడ్డే సరస్వతి(32), సీ బెళగల్‌కు చెందిన ఈరన్న(21), ఆదోనిలోని ఇందిరానగర్‌కు చెందిన ఉప్పరి సరోజమ్మ(40) సంఘటన స్థలంలోనే మృతి చెందారు.
మాలదాసరి మహాదేవమ్మ, వడ్డ్డే సరస్వతి సంత కోసం ఆదోనికి వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో గోనబావికి చెందిన ఆటో డ్రైవరు రమ్‌జాన్, మాల దాసరి క్రిష్ణ, రంగముని, నరసప్ప, సాదాపురానికి చెందిన ఐదు నెలల గర్భవతి నాగవేణి, భర్త వీరేష్, కూతురు నందిని ఉన్నారు. ఇందులో మాల దాసరి క్రిష్ణ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.