నలుగురు సజీవ దహనం
కారణమేమైనా దారుణం జరిగిపోయింది. నిద్ర నుంచి ఆ కుటుంబం మృత్యుఒడికి చేరిపోయింది. పడుకున్నవారు పడుకున్నట్టే బూది కుప్పలుగా మారిపోయూరు. క్రిస్మస్ వేడుకలకు ముస్తాబవుతున్న ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యుత్ కాంతులతో అందరి ఇళ్ల వద్ద క్రిస్మస్ స్టార్‌లు దేదీప్యమానంగా వెలుగుతుంటే, ఆ ఇంటి నుంచి మాత్రం అగ్నికీలలు ఎగజిమ్మాయి. ఉపాధి నిమిత్తం అతను ఎంచుకున్న మార్గమే అతనితోపాటు కుటుంబానికి మృత్యుపాశమైంది. అల్లుడే కాలయముడిగా మారి పిల్లనిచ్చిన అత్త, మామ, ఇద్దరు బావమరుదులను అతి కిరాతకంగా హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో ఇప్పుడు మరణ మృదంగం మోగడంతో గ్రామస్తులు నిశ్చేష్టులయ్యారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ఆ గ్రామానికి ఉరుకులు, పరుగులపై చేరుకుంది. యావత్ గ్రామస్తులను ఈ విషాదకర సంఘటన కంటతడి పెట్టించింది.
భీమవరం అర్బన్/టౌన్:భీమవరం మండలం కొవ్వాడ అన్నవరం గ్రామంలోని ఎస్సీ పేటకు చెందిన మరపట్ల ప్రకాష్ (55) గల్ఫ్ ఏజెంట్‌గా జీవనం సాగిస్తున్నాడు. అయనకు భార్య మరపట్ల రాజమణి (50), కుమార్తె దివ్య, కుమారులు దేవరాజ్ (17), ప్వధ్వీరాజ్ అలియూస్ వంశీ (14) ఉన్నారు. కుమార్తె దివ్య.. అదే గ్రామానికి చెందిన గంటా రవి ప్రేమించుకోవడంతో కొన్నేళ్ల క్రితం పెద్దలే వివాహం జరిపించారు. వారికిద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ నరసాపురంలోని హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు.
దివ్యను కుటుంబ పోషణార్థం తండ్రి ప్రకాష్ ఇటీవల కువైట్ పంపించాడు. ఇది ఇష్టంలేని అల్లుడు గంటా రవి తరచూ అత్తింటి వారితో గొడవ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 1.30 సమయంలో ప్రకాష్ ఇంట్లో నుంచి పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు గమనించారు. బంగాళా పెంకుటిల్లు కావడంతో మంటల తాకిడికి పెంకులు పగిలి ఎగిరిపడ్డాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో తెల్లవారుజామున రెండు గంటల సమయంలో వారు అక్కడకు వచ్చి మంటలు ఆర్పివేశారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది తాళం పగులగొట్టి లోపలకు వెళ్లారు. అక్కడ పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. నిద్రిస్తున్న వారు పూర్తిగా దహనమై కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారమందించారు.
పోలీసుల రంగప్రవేశం
జిల్లా ఎస్పీ రఘురామ్‌రెడ్డి, ఏఎస్పీ చంద్రశేఖర్, డీఎస్పీ రఘువీరారెడ్డి, సీఐలు జయసూర్య, కెనడీ, రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీమ్‌లతో ఆ ప్రాంతంలో ఆధారాలు, నిందితుల గుర్తింపు కోసం జల్లెడ పట్టారు. ఇంటి లోపల, వెలుపల నిశితంగా పరిశీలించారు. అక్కడ దొరికిన ప్రాథమిక ఆధారాలను బట్టి అల్లుడు గంటా రవి తన అత్తమామలను, బావమరుదులను కడతేర్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి వరండాలోని ప్లాస్టిక్ టబ్‌లో సగం వరకు పెట్రోల్ ఉండటం, ఇంటి బయట తలుపుకు తాళం వేసి ఉండటంతో అనుమానం మరింత బలపడింది. అందరూ గాఢనిద్రలో ఉండగా బయట నుంచి లోపలకు పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ట్టుగా భావిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఇంత జరిగినా.. ఊరంతా అక్కడే ఉన్నా అల్లుడు రవి కనిపించకపోవడం అనుమానాలకు బలమిచ్చింది.
ఆందోళన చెందినట్టే జరిగింది
కాగా పోలీసుల దర్యాప్తులో మరపట్ల ప్రకాష్ కొవ్వాడ అన్నవరంలోని కుటుంబంతో పాటు భీమవరం పట్టణం లంకపేటలో ఉంటున్న తన బంధువు జీవమణితో సహజీవనం సాగిస్తున్నట్టు తెలిసింది. ఈ ఇరువురికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. శనివారం రాత్రి జీవమణి ఇంటి వద్ద ప్రకాష్ ఉన్నట్టు తెలుస్తోంది.ఇటీవల అల్లుడు గంటా రవి తరచూ గొడవ పడుతుండటంతో ఏదైనా ప్రాణహాని తలపెడతాడేమోనని మరపట్ల ప్రకాష్ జీవమణి, కుటుంబ సభ్యుల వద్ద ఆందోళన చెందినట్టుగా పోలీసులకు తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుంచి కొవ్వాడ అన్నవరంలోని తన ఇంటికి ప్రకాష్ వెళ్లడం, తెల్లవారు జామున కుటుంబంతో సహా మృత్యువాత పడటం జరిగిపోయూరుు.
తీవ్రంగా గాలింపు
జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగడంతో పోలీసులు నిందితుల కోసం భీమవరం ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ తనిఖీ చేశారు. ఉదయం ఆరుగంటల సమయంలో టౌన్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై నిందితుడు రవి తిరుగాడినట్టు అక్కడ ఉన్న సీసీ కెమేరాల ద్వారా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. విశాఖపట్నం వెళుతున్న లోకమాన్యతిలక్ రైలులో నిందితుడు ఎక్కినట్టుగా పోలీసులు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు.సంఘటనా స్థలానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తహసిల్దార్ గంధం చెన్ను శేషు, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లూరి సాయిదుర్గరాజు తదితరులు వెళ్లి పరిశీలించారు. పోలీసుల నుంచి వివరాలు అడిగితెలుసుకున్నారు.
భార్యను గల్ఫ్ పంపడాన్ని ఇష్టపడని అల్లుడు
మరపట్ల ప్రకాష్ జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ ఏజెంట్‌గా పనిచేసేవాడు. భార్య రాజమణి పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజనం వంట పనిచేసేది. పెద్ద కుమారుడు దేవరాజ్ భీమవరం పట్టణంలోని ప్రశాంతి ఒకేషనల్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. రెండవ కుమారుడు ప్వధ్వీరాజ్ (వంశీ) స్థానిక స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. ప్రకాష్ తన కుమార్తె దివ్యను కువైట్‌కు పంపడం అల్లుడు రవికి ఇష్టంలేదు. దీంతో తరచూ అత్తింటి వారితో గొడవ పడేవాడు. రవి స్థానికంగా ఉన్న పాలకేంద్రంలో పనిచేస్తున్నాడు.