తాతా నాన్నమ్మలే స్ఫూర్తి | four peoples help to Tenth class student | Sakshi
Sakshi News home page

తాతా నాన్నమ్మలే స్ఫూర్తి

Published Thu, Jan 28 2016 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

four peoples help to Tenth class student

 పక్కవాడేమైపోతే నాకెందుకు..అనుకునే వారు ఉన్న ఈ రోజుల్లో ఒక బాలుడు తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా నలుగురిని కాపాడి అందరి చేత భేష్  అనిపించుకున్నాడు. పదోతరగతి విద్యార్థి అయిన కొయ్యాన రాకేష్  మండలంలోని కనుగులవానిపేటలో మంగళవారం ఊటబావిలో మునిగిపోతున్న నలుగురు చిన్నారులను క్షేమంగా బయటకు తీసి ఆ కుటుంబాలకు మరచిపోలేని సంతోషాన్ని అందించాడు.
 
 మండలంలోని కనుగులవానిపేటలో ముగ్గురు చిన్నారులు ఊటగెడ్డలో మునిగి చనిపోయిన  విషాదాంతం విదితమే.. అయితే ఈ దారుణ ఘటనలో మరో నలుగురు చిన్నారులు మృతువు అంచులదాకా వెళ్లి క్షేమంహా బయటపడ్డారు. దీనికి కారణం  కొయ్యాన రాకేష్ అనే సాహస బాలుడు. అతడు సాహసం చేసి పది అడుగుల లోతు ఉన్న ఊట గెడ్డలోకి దూకి కొన ఊపిరితో ఉన్న కనుగుల ఇందు, కనుగులు హారిక, టి. ధరణి, పి. కల్పనలను కాపాడాడు. మిగిలిన వారిని కాపాడుదామని ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఎంతశ్రమించినా వారి ఆచూకీ లేకపోయింది. ఇంకా ఎవరైనా దొరుకుతారేమోనన్న ఆత్రుతతో వెంటనే ఈ విషయాన్ని గ్రామస్తులకు చేరవేశాడు. గ్రామస్తులు ఊటగెడ్డ ఒడ్డుకు చేరుకుని గాలించారు. అయినా ఆ ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.
 
 మూడేళ్లకే తల్లిని కోల్పోయినా..
 సాహస బాలుడు కొయ్యాన రాకేష్ ఇప్పలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. రాకేష్‌కు మూడేళ్ల వయసులోనే తల్లి చనిపోయింది. అప్పటి నుంచి రాకేష్ సంరక్షణ బాధ్యత అంతా నాన్నమ్మ, తాతయ్యలు రమణమ్మ, మల్లేసులపై పడింది. వృద్ధాప్యంలో ఉన్నా వారు పొలం పనులు చేసుకుంటూ రాకేష్‌ను పెంచుతున్నారు. వారి మాటలే రాకేష్‌కు స్ఫూర్తి గా నిలిచాయి. రాకేష్‌కి తల్లి తండ్రీ, దైవం అన్ని ఆ తాతా నాన్నమ్మలే.
 
 చిన్నతనంలోనే తల్లిని కోల్పోయినప్పటికీ మనోస్థైర్యాన్ని కోల్పోకుండా చదువుల్లోనూ రాణిస్తూ.. పనుల్లో నాన్నమ్మ, తాతయ్యలకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. కుటుంబ సభ్యులను కోల్పోతే కలిగే కష్టం తనకు తెలుసునని, అందుకే అటువంటి కష్టం ఇంకెవరికీ రాకూడదనే ఉద్దేశంతో చిన్నారులను కాపాడాలనే ఆత్రుతతో ప్రమాదకమని తెలిసినా మరో ఆలోచనే లేకుండా ఊటగెడ్డలోకి దూకానని చెప్పాడు. ముగ్గురు పిల్లలను కాపాడానని, అయితే నాలుగేళ్ల పాప అప్పటికీ పూర్తిగా మునిగిపోయిందని, జుత్తు మాత్రమే కనిపించగానే ఊపిరి బిగపట్టి ప్రయత్నించగా ఆ పాపను కూడా కాపాడగలిగానని అన్నాడు.  
 
 సాహస బాలునికి జిల్లా కలెక్టర్ అభినందన
 శ్రీకాకుళం టౌన్ : శ్రీకాకుళం మండలం కనుగులవానిపేట గ్రామం సమీపంలోని ఉప్పుగెడ్డలో మునిగిపోతున్న ముగ్గరు చిన్నారులను రక్షించడంతోపాటు మృతుల సమాచారాన్ని గ్రామస్తులకు వేగంగా అందించిన సాహసబాలుడు కొయ్యాన రాకేష్ (16)ను గురువారం కలెక్టరు పి. లక్ష్మీనృసింహం అభినందించారు. మృత్యుంజ యులుగా మిగిలిన చిన్నారులు కల్పన, ఇందు, ధరణిల కుటుంబ సభ్యులను కడుపుకోత నుంచి రక్షించిన ఘనత రాకేష్‌కు దక్కిందని ప్రశంసించారు. గ్రామస్తులతో కలిసి రాకేష్ కలెక్టర్‌ను కలిశారు.  నిరుపేదలైన కుటుంబాలను విషాదం నుంచి తప్పించిన రాకేష్ సాహసాన్ని మెచ్చి రాష్ర్టపతి పురస్కారానికి సిఫార్సు చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కలెక్టర్‌ను కలసిన వారిలో శ్రీకాకుళం డీఎస్పీ కె. భార్గవరావు నాయుడు, కళ్లేపల్లి నీటిసంఘం అధ్యక్షుడు కలగ శివప్రసాద్  హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement