జిల్లాలో మరో రెండు చోట్ల మెరుగు పేరిట బంగారు ఆభరణాలు అపహరించిన ఘటనలు జరిగాయి. బంగారు ఆభరణాలకు ఉచితం గా మెరుగుపెడతామని నమ్మించి ఇద్దరు మహిళల
భూపాలపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలో మరో రెండు చోట్ల మెరుగు పేరిట బంగారు ఆభరణాలు అపహరించిన ఘటనలు జరిగాయి. బంగారు ఆభరణాలకు ఉచితం గా మెరుగుపెడతామని నమ్మించి ఇద్దరు మహిళల పుస్తెల తాళ్లు చోరీచేసిన సంఘటనలు భూపాలపల్లి, నర్సంపేట పట్టణాల్లో సోమవారం జరిగాయి. బాధితుల కథనం ప్రకారం... పట్టణంలోని హనుమాన్‌నగర్ కాలనీలో నివాసం ఉండే చింతల కొమురయ్య, గంగ(భూలక్ష్మి) దంపతులు సోమవారం మధ్యాహ్నం భోజ నం చేసి టీవీ చూస్తున్నారు.
ఈ క్రమంలో 30 ఏళ్ల వయసున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వారింటి ముందు కు వచ్చి రాగి వస్తువులకు ఉచితంగా మెరుగుపెడతామని చెప్పారు. అందుకు ఆ దంపతులు ససేమిరా అన్నప్పటికీ సదరు వ్యక్తులు బలవంతపెట్టారు. దీంతో గంగ ఒక బిందెను తీసుకొచ్చి వారికి ఇవ్వగా కొన్ని రసాయనాలతో కడిగి శుభ్రం చేశారు. అనంతరం బంగారం ఇస్తే మెరుగుపెట్టి ఇస్తామని నమ్మించేందుకు ప్రయత్నించగా గంగ ససేమిరా అంది. అయినా ఇద్దరి లో ఒకరు ఆమె వద్దకు వచ్చి మెడలో ఉన్న పుస్తెల తాడుకు ఎరుపు రంగులో ఉన్న నీటిని అంటించాడు.
తాడు ఎలా మెరుస్తుందో చూడండి.. మేం దొంగలం కాదు.. హైదరాబాద్‌లోని ఓ కంపెనీ నుంచి వచ్చాం.. అని చెప్పి నమ్మించాడు. దీంతో గంగ ఆమె మెడపై ఉన్న పుస్తెల తాడును తీసి ఇచ్చింది. సదరు వ్యక్తులు పుస్తెల తాడును ఒక టిఫిన్ బాక్స్‌లో వేసి అందులో నీటిని పోసి ఎరుపురంగులో ఉన్న ఒక పౌడర్‌ని కలిపా రు. అనంతరం గ్యాస్ స్టౌ మీద కాసేపు నీటిని వేడి చేస్తే అందులో ఉన్న పుస్తెల తాడు మెరుస్తుందని చెప్పి ఇంట్లోకి వెళ్లారు.
టిఫిన్ బాక్స్‌ని స్టౌ మీద పెట్టి పది నిమిషాలపాటు నీరు వేడి అయ్యూక బాక్స్ మూతతీసి పుస్తెల తాడు తీసుకోండని చెప్పి ఆ ఇద్దరు వెళ్లిపోయా రు. కాసేపటికి అనుమానం వచ్చిన గంగ టిఫిన్ బాక్స్ మూత తీసి చూసేసరికి అందులో పుస్తెల తాడు లేదు. దీంతో లబోదిబోమంది. అప్పటికే ఆ దొంగలు పారిపోయారు. పుస్తెలతాడు మూడు తులాలు ఉంటుందని బాధితులు వాపోయారు. బాధితులు కొమురయ్య, గంగల ఫిర్యాదు మేరకు భూపాలపల్లి సీఐ ఆదినారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.