బహుమతి పేరిట మోసం | Fraud in the name of the gift | Sakshi
Sakshi News home page

బహుమతి పేరిట మోసం

Published Mon, Nov 24 2014 7:52 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM

Fraud in the name of the gift

  • కారు గెలుచుకున్నారని ఫోన్‌కాల్
  • టాక్స్ చెల్లించాలని సొమ్ము వసూలు
  • మోసం గుర్తించి పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
  • సీతంపేట: కారు బహుమతిగా గెలుచుకున్నారని ఒక వ్యక్తినుంచి డబ్బులు గుంజేసిన మోసగానిపై పోలీసులకు పిర్యాదు అందింది.  ఫోర్త్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నాయి. కైలాసపురం ప్రాంతం శాంతినగర్‌లో టింకరింగ్ పనులు చేస్తూ అదే ప్రాంతంలో ఉంటున్న నిర్దేష్‌కుమార్ ఈ నెల 11న ఒక ప్రైవేట్ చానల్‌లో ప్రసారం అవుతున్న  కార్యక్రమాన్ని చూస్తున్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా అడిగిన ప్రశ్నకు ఫోన్‌లో సమాధానం చెప్పాడు. కొంతసేపటి తరువాత  కరెక్టుగా సమాధానం చెప్పారని, రూ.12.5 లక్షల విలువైన టాటా సఫారీ కారు బహుమతిగా గెల్చుకున్నారని ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.  

    మీకు కారు కావాలా, నగదు కావాలా చెప్పాలని అడగడంతో క్యాష్ కావాలని కుమార్ కోరాడు. అయితే మీ అకౌంటుకు చెక్కు పంపిస్తామని, సర్వీస్ చార్జిగా రూ.6,300 చెల్లించాలని కోరాడు. ఈ మేరకు అతను చెప్పిన ఎస్‌బీఐ అకౌంట్‌కు జమచేశాడు. రెండు రోజుల తరువాత మళ్లీ ఆ వ్యక్తినుంచి ఫోన్ వచ్చింది. మీ అకౌంట్‌కు చెక్కు పంపాం. మీది సేవింగ్ అకౌంట్ కావడం వల్ల రూ.5 లక్షల వరకు ట్రాన్జాక్షన్‌కు అనుమతి ఉన్నందున కరెంట్ అకౌంట్‌గా మార్చుకోవాలని కోరాడు.

    ఇందుకు మళ్లీ అతను చెప్పిన అకౌంట్‌కు రూ.12,500 జమచేశాడు. మళ్లీ రెండు రోజులతరువాత ఫోన్ చేశాడు. ఇన్‌కంటాక్స్ వారు మీ చెక్కును అబ్జెక్ట్ చేస్తున్నారు. టాక్స్‌గా రూ.25 వేలు చెల్లించాలని ఫోన్ రావడంతో బాధితుడు నిర్దేష్‌కుమార్ అనుమానించాడు. మోసపోయానని గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు  ఫోర్త్‌టౌన్ సీఐ కె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement