ఉచితంపై అక్రమార్కుల కన్ను
కడియం : ఇసుకను ఉచితంగా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ఊరుకుంది. దీనిపై విధివిధానాలు కూడా కలెక్టర్ సమీక్షలో నిర్దేశించారు. కానీ మండలంలోని వేమగిరి ఇసుక ర్యాంపు వద్ద ఇంకా ఉచిత ఇసుక సామాన్యుడికి అందడం లేదు. ప్రభుత్వం ప్రకటించింది మొదలు అక్రమార్కుల కన్ను ఈ ర్యాంపుపై పడింది. పొక్లెయిన్లు, లారీలున్న వాళ్లదే ఇక్కడి పెత్తనమని స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వ విధివిధానాలతో సంబంధం లేకుండా వీళ్లు ర్యాంపులోకి ప్రవేశించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజులుగా ర్యాంపు వద్ద తరచూ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయంటున్నారు.
ప్రస్తుతం ర్యాంపులోకి వె ళ్లేందుకు బాట తామే వేశామంటూ కొందరు నాయకులు అక్కడికి చేరి, ఎగుమతి, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కాక, లారీకి రూ. 600 అదనంగా చెల్లించాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. పలువురు వాహనదారులు దీనిని వ్యతిరేకించడంతో వాగ్వాదం చోటు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు.
ఎప్పటికి అందుబాటులోకొస్తుందో?
ఉచితంగా ఇస్తామన్న ప్రకటన వరకు బాగానే ఉన్నా, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇసుక ఎప్పటికి అందుబాటులో కొస్తుందన్న దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి హామీ, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ర్యాంపులోకి మార్గం నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనలేమీ సిద్ధమైన దాఖలాల్లేవు. పర్యావరణ అనుమతుల ప్రకారం ఇసుకను ఎక్కడ, ఎంత లోతు తవ్వాలన్న దానిపై కూడా స్పష్టత లేదు.
వ్యాపార అవసరాల కోసం తరలించుకుపోయే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీనిని నియంత్రించడం ఎలా? దీనిపై పర్యవేక్షణ ఎవరిది? స్టాక్ పాయింట్‌లో మూడేళ్లుగా నిల్వ ఉన్న దాదాపు రూ.80 లక్షల ఇసుక అక్రమార్కుల పాలైంది. దీనినే కాపాడలేని పోలీస్, రెవెన్యూ అధికారులకు ర్యాంపు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తే ఎంత వరకు అర్హులైన వారికి న్యాయం జరుగుతుంది? తదితర సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
తవ్వకాలు అడ్డుకున్నాం..
మైన్స్ అధికారుల సూచనల మేరకే ర్యాంపులో ఇసుకను తవ్వాల్సి ఉందని తహశీల్దార్ పిల్లా రామోజీ చెప్పారు. ఇష్టారాజ్యంగా తవ్వేందుకు ఏమాత్రం అవకాశం ఉండదన్నారు. గోదావరిలో ఇసుకను తవ్వేందుకు 17 వాహనాలొచ్చినట్టు శుక్రవారం గుర్తించామన్నారు. తనకందిన ఫిర్యాదు మేరకు ర్యాంపు వద్దకు వెళ్లి పరిశీలిస్తుండగా అక్కడి వాహనాలు వెళ్లిపోయాయన్నారు. సంబంధిత వాహనాల నంబర్లతో ఆర్టీవోకు ఫిర్యాదు చేస్తున్నట్టు రామోజీ చెప్పారు. వీరిపై నిబంధనల మేరకు చర్యలుంటాయన్నారు.
సామాన్యుడికి చేరని ఇసుక..
పూర్తిస్థాయి విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో ఉచిత ఇసుక సామాన్యుడికి చేరడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ ప్రకటన వెలువడింది మొదలు ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తమతమ సొంత వాహనాలతో వచ్చి ఇసుకను తీసుకు వెళ్లారని సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అభివృద్ధి పనులకు వినియోగించే నిమిత్తం స్టాక్ పాయింట్ నుంచి అనుమతిచ్చిన 275 క్యూబిక్ మీటర్ల ఇసుక కూడా వ్యాపార అవసరాలకే తరలిపోయిందంటున్నారు. అనధికారికంగా తవ్వకాలు మాత్రం సాగిపోతున్నాయి.