ఇసుక మాఫియాపై ఉక్కు పాదం
►ఐజీ ఎన్.సంజయ్ మాదిపాడులో చెక్‌పోస్టు ప్రారంభం
►ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, ఉచితంగా ఇసుకను వినియోగించుకోవాలి
►జిల్లాలో ఆరు చెక్ పోస్టులు ఏర్పాటు
మాదిపాడు (అచ్చంపేట) రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా,ఉచితంగా ఇసుకను వినియోగించుకోవచ్చని, ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు రేంజి ఐజీ ఎన్.సంజయ్ అన్నారు. మండలంలోని మాదిపాడు వద్ద సోమవారం ఆయన ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలి వెళ్లకుండా చెక్ పోస్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలి వెళ్లకుండా గుంటూరు జిల్లాలో ఆరు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని పొందుగల, తంగెడ, నాగార్జున సాగర్, మాదిపాడు, గోవిందాపురం, జట్టిపాలెంల వద్ద చెక్ పోస్టులు ప్రారంభించామని చెప్పారు.
ఈ చెక్ పోస్టుల వద్ద పోలీస్ సిబ్బంది 24 గంటలు నిఘా ఉంచుతారని చెప్పారు. మోతాదు మించి రవాణా చేయడం, ఇసుకను నిల్వ ఉంచడం నేరమన్నారు. ఒక్కసారి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాన్ని వదిలేది లేదని, పిడియాక్ట్ కింద వేలం పెడతామన్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రామ ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చిందన్నారు. నిబంధనలను అతిక్రమించినా, గూండాగిరి చేసినా ఉపేక్షించేది లేదన్నారు. ప్రకటించిన రీచ్‌లలోనే ఇసుక రవాణా చేసుకోవాలన్నారు. లోడింగ్, ట్రాన్స్‌పోర్టు చార్జీలను మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేయవలసి ఉంటుందని, అంతకు మించి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయండి
మీమీ గ్రామాల్లో, ప్రాంతాల్లో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా రవాణా చేసినట్లయితే వెంటనే 18005994599 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాను పట్టించిన వారికి బహుమతులను ఇస్తామని, బాధ్యతాయుతంగా పనిచేసిన పోలీస్ సిబ్బందికి రివార్దులు ఇస్తామని చెప్పారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ్‌నాయక్, సత్తెనపల్లి డీఎస్సీ ఎం.మధుసూదనరావు, సీఐ కోటేశ్వరరావు, అచ్చంపేట ఎస్‌ఐ గుడి రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు.
పొందుగలలో పోలీస్ ఔట్‌పోస్టు ప్రారంభం
పొందుగల(దాచేపల్లి) : మండలంలోని పొందుగల గ్రామంలో పోలీస్ ఔట్‌పోస్ట్‌ను మంగళవారం ఐజి ఎన్.సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టిందని, ఇసుక నిజమైన లబ్ధిదారుడికి అందేలా తమవంతు చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుకను అక్రమంగా రాష్ట్రం దాటి తరలించినా,ఇసుక నిల్వలకు పాల్పడినా చర్యలు తప్పవన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకే ఇక్కడ చెక్‌పోస్ట్ ఏర్పాటుచేశామన్నారు. ఐజీ వెంట జిల్లా రూరల్ ఎస్పీ కె. నారాయణ్‌నాయక్, డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ ఆళహరి శ్రీనివాసరావు తదితరులున్నారు.