కొత్త కొత్తగా ఉన్నదీ.. | Freshers Day In Anantapur Medical College | Sakshi
Sakshi News home page

కొత్త కొత్తగా ఉన్నదీ..

Published Wed, Sep 12 2018 11:39 AM | Last Updated on Wed, Sep 12 2018 11:39 AM

Freshers Day In Anantapur Medical College - Sakshi

అనంతపురం మెడికల్‌ కళాశాలలో మంగళవారంనిర్వహించిన ఫ్రెషర్స్‌డే అట్టహాసంగా సాగింది.విద్యార్థులంతా ఆటపాటలతో అందరినీ అలరించారు.  ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్‌ వీరపాండియన్‌..
క్రమశిక్షణతో చదువుకుని తల్లిదండ్రుల కలలుసాకారం చేయాలని పిలుపునిచ్చారు. 

అనంతపురం న్యూసిటీ: ‘‘మిర్ర మిర్ర మీసం’’..అంటూ అబ్బాయిలు గబ్బర్‌సింగ్‌ సినిమా పాటకు స్టెప్పులేస్తే...‘‘అందాల ఆడబొమ్మా’’ పాటకు అమ్మాయిలు డాన్స్‌లు వేసి అందరినీ మైమరపించారు. ఇక కేరళకు చెందిన ఓ అమ్మాయి తమ సంస్కృతి ప్రతిబింబించేలా మోహినీ ఆట్టంతో ఆకట్టుకోగా..చిన్న కృష్ణయ్య చిలిపి చేస్టలను గుర్తు చేస్తూ  ‘‘గోకులకృష్ణ, గోపాల కృష్ణా మాయలు చాలయ్యా’’ అంటూ నృత్యం చేశారు.  వీటన్నింటికీ అనంతపురంలోని వైద్యకళాశాల ఆడిటోరియం వేదికైంది. మంగళవారం అనంతపురం మెడికల్‌ కళాశాలలో  నిర్వహించిన ఫ్రెషర్‌ డే అట్టహాసంగా సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఉర్రూతలూగించారు. జూనియర్ల డాన్సులు చూసి సీనియర్లు ఆడిటోరియం మార్మోగేలా ఈలలు, కేకలు వేసి ఉత్సాహపరిచారు.   

పట్టుపరికిణి..పంచెకట్టు
ఫ్రెషర్స్‌ డే సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. కొందరు విద్యార్థులు పట్టుపంచా కండువా వేసుకుని రాగా.. కొందరు అమ్మాయిలు పట్టులంగా..చీరలు ధరించి తళుక్కున మెరిశారు. కార్యక్రమం అనంతరం వైద్య విద్యార్థులు తమ తల్లిదండ్రులు, తోటి విద్యార్థులతో కలసి సెల్పీలు దిగడం ప్రత్యేకాకర్షణగా నిలిచింది.   

ప్రతిక్షణం ఆస్వాదించండి
ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య విద్యను అభ్యసించే అవకాశం రావడం గొప్ప అదృష్టమనీ, దాన్ని దక్కించుకున్న వైద్య విద్యార్థులంతా తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ పిలుపునిచ్చారు. ఫ్రెషర్‌డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన..విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. స్నేహపూరితమైన వాతావరణంలో మెలగాలన్నారు. ఏదైనా సమస్య వస్తే స్నేహితులు, సీనియర్లలో పంచుకుని ఒత్తిడిని అధిగమించాలన్నారు. చెడు వ్యసనాలకు బానిసలవ్వద్దన్నారు. కళాశాలలో చదివే రోజులు మరుపురానివని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన మైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కేఎస్‌ఎస్‌ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్, అకడమిక్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఉషాదేవి, అడ్మినిస్ట్రేటివ్‌ వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ జేసీ రెడ్డి మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గుర్తింపు కార్డులు, సర్టిఫికెట్ల, వివిధ పోటీల్లో విజయం సాధించిన వారి బహుమతులను అందజేశారు. అనంతరం మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్‌ యండ్లూరి ప్రభాకర్, డాక్టర్‌ సాయిసుధీర్, డాక్టర్‌ బలరామిరెడ్డి, వైద్యులు బాబు, మహేష్, రవిశ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.   

శభాష్‌ హిమవర్షా
సంవత్సరం కిందట జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వీల్‌చైర్‌కే పరిమితమైన హిమవర్షారెడ్డి తన ప్రతిభపాఠవాలతో ఫ్రెషర్స్‌డేలో అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. వయోలిన్‌పై ‘‘లాహరి లాహరి’’లో పాట వినిపించిన ఆమె ‘‘యాకుందే తుషార దేవ’’ అంటూ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. దీంతో హిమవర్షారెడ్డిని తోటి విద్యార్థులతో పాటు అధ్యాపకులు హర్షధ్వానాలతో అభినందించారు. అలాగే వ్యక్తిత్వ, వ్యాసరచన, అంతాక్షరి తదితర పోటీల్లోనూ  ఆమె ఐదు బహుమతులు గెలుచుకున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement