లెవీపై సమ్మెట
Published Sun, Jan 12 2014 2:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
కోటబొమ్మాళి, జలుమూరు, న్యూస్‌లైన్: భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) ఉద్యోగుల సమ్మె కారణంగా లెవీ సేకరణకు జిల్లాలో బ్రేకు పడింది. గోదాముల వద్ద వందలాది వాహనాలు అన్‌లోడ్ కాకుండా నిలిచిపోయాయి. జిల్లాలో సుమారు 130 మంది ఉద్యోగులు నిమ్మాడ, రావిపాడు, నైర, పలాస, ఆమదాలవలస ఎఫ్‌సీఐ గోదాముల్లో పనిచేస్తున్నారు. వీరంతా సమ్మెలో ఉండటంతో ప్లాట్‌ఫారంపై నంబర్లు ఇచ్చే వీలులేక లారీలు బియ్యం లోడులతో నిలిచిపోయాయి. హమాలీలు, కలాసీలు ఇతర సిబ్బందికి కూడా పనిలేకుండా పోయింది. పింఛను సదుపాయం, ఖాళీ పోస్టుల భర్తీ, 3, 4 తరగతుల ఉద్యోగులకు మూలవేతనం, అలవెన్సులు కల్పించాలన్న డిమాండ్లతో శుక్రవారం సిబ్బంది సమ్మె చే శారని నిమ్మాడ ఎఫ్‌సీఐ గోదాముల టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ ఇ.వి. కృష్ణారావు శనివారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఆ తర్వాత రెండో శనివారం, ఆదివారం కూడా సెలవులే కావడంతో ఉద్యోగులు విధుల్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఫలితంగా నిమ్మాడలోని గోదాముల వద్ద శనివారం నాటికే పెద్ద సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. గోదాములు నిండిపోయాయి. స్థలం లేక చాలా లారీలను బయట రోడ్డు పక్కన కూడా నిలిపివేశారు. రావిపాడు గోదాముల వద్ద కూడా 150 వరకు లోడ్ లారీలు నిలిచిపోయాయి. పదివేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ గోదాముల్లో ప్రస్తుతం 5400 టన్నులు మాత్రమే దించారు.
ఎఫ్‌సీఐ క్వాలిటీ ఇన్‌చార్జి బియ్యం పరిశీలించి నిల్వకు అనుమతి ఇస్తే తప్ప బియ్యం అన్‌లోడ్ చేయించలేమని ఇక్కడి వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ అధికారి వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జిల్లాలో 3.8 లక్షల టన్నుల బియ్యం లెవీగా సేకరిం చాలని లక్ష్యం నిర్ణయించగా ఇప్పటివరకు 30 వేల టన్నులే సేకరించారు. ఈ తరుణంలో ఉద్యోగుల సమ్మె, సెలవులతో లెవీకి భారీగా గండి పడింది. మిల్లర్లకూ ఈ సమ్మెతో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. లారీలు రోజుల తరబడి నిలిచిపోవడం వల్ల డెమరేజ్ చార్జీలు కూడా పెరుగుతాయని అంటున్నారు. లారీల సిబ్బంది కూడా నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని మిల్లుల నుంచి ప్రతిరోజు 500 ఏసీ కేజీల(13500 టన్నులు) బియ్యం లెవీకి వెళుతోంది. అయితే ఎఫ్‌సీఐ మాత్రం 300 ఏసీ కేజీలు(8100 టన్నులు) మాత్రమే తీసుకుంటోంది. దీంతో లెవీ సేకరణ కుం టుపడుతోందని రైస్‌మిల్లర్ల సంఘం రాష్ట్ర సం యుక్త కార్యదర్శి బోయిన రమేష్ చెప్పారు. అంతేకాకుండా ఇటీవల 1001 రకం బియ్యం లో నలుపుగింజ వస్తున్నదని లెవీకి నిరాకరించడంతో మరింత ఇబ్బంది ఏర్పడిందన్నారు.
రైతులపై తీవ్ర ప్రభావం
సమ్మె రైతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్ద పండుగ సం క్రాంతి ముందు సిబ్బంది సమ్మెతో లెవీ నిలిచిపోయి సమయానికి డబ్బులు అందకపోతే పండుగ ఖర్చులు ఎలాగని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు తాము పండించిన ధాన్యా న్ని మిల్లర్లకు విక్రయిస్తారు. మిల్లర్లు లెవీ, ఇతర అమ్మకాల తర్వాత వచ్చే సొమ్మునే వారికి చెల్లిస్తారు. ఇప్పుడు లెవీ నిలిచిపోవడం, సోమవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే సూచనలు కని పిస్తుండటంతో సుమారు రూ. 40 కోట్ల మేరకు రైతులకు చెల్లిం పులు జరిగే అవకాశం లేదు. రైతులకు ప్రధానమైన సంక్రాంతికి పంట అమ్మగా వచ్చిన డబ్బులతో అన్నీ కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో వారు దిగాలు చెందుతున్నారు.
నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి
శుక్రవారం ఒక్కరోజే సమ్మె అయినా నాలుగు రోజులుగా అవస్థలు పడుతున్నాం. టెక్కలి నుంచి బియ్యం లోడు తెచ్చాను. అన్‌లోడ్ కాక రాత్రీపగలు ఇక్కడే పడిగాపులు పడాల్సి వస్తోంది. మా లారీ అన్‌లోడ్ కావడానికి మరో వారం పడుతుందని ఆందోళనగా ఉంది.
-కె.శ్రీను. లారీ డ్రైవర్, టెక్కలి
సంక్రాంతి ఇక్కడే
మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. భోజనం, ఇతర అవసరాలకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. పరిస్థితి చూస్తుంటే మాకు సంక్రాంతి ఇక్కడే అయ్యేటట్లుంది. అధికారులు స్పందించకపోతే సమస్య పరిష్కారం కాదు.
-జి.కోటిబాబు, లారీ డ్రైవర్, జమ్ము గ్రామం
Advertisement
Advertisement