కడలి తీరానికి ఆనుకుని ఉండే ఆ మత్స్యకార గ్రామంలో కొందరు చెప్పిందే వేదం. వారి చూపుడువేలే చట్టం. రాజ్యాంగం, శిక్షాస్మృతులు, వ్యవస్థలకు ఆ ఊళ్లో కడలి నురుగుకు ఉన్నంత బలం కూడా ఉండదు. ఆ గ్రామంలో ఏ పని జరగాలన్నా కొందరు పెద్దల కనుసన్నల్లోనే జరుగుతుంది. వారి తీర్మానమే అక్కడ అంతిమ తీర్పు. రేషన్ దుకాణం దగ్గర నుంచి మద్యం దుకాణం వరకు ఏదైనా కొందరు పెద్దల సమక్షంలో జరిగే వేలంలో పాల్గొని దక్కించుకోవాల్సిందే. పోలీసులు, రెవెన్యూ...ఇలా ఏ శాఖ ఆదేశాలూ అక్కడ చెల్లుబాటు కావు. ఆ గ్రామంతో పాటు చాలా తీరప్రాంత గ్రామాల్లో ఏళ్లతరబడి నెలకొన్న ఈ సంస్కృతి ఇటీవల కాలంలో కొన్నిచోట్ల తగ్గుముఖం పట్టింది. అయితే ఇప్పటికీ పెత్తందారీతనం నీడలోనే ఉన్న ఆ ఊరు కాట్రేనికోన మండలం బలుసుతిప్ప.
⇒ బలుసుతిప్పను వీడని పెత్తందారీ పోకడలు
⇒ నిరాఘాటంగా నడుస్తున్న సమాంతర సర్కారు
⇒ ఏ పనైనా కొందరు పెద్దల కనుసన్నల్లోనే..
⇒ నేడు బెల్ట్‌షాపు తదితరాల నిర్వహణకు వేలం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామంలో ఇప్పటికీ కొందరు పెద్దల నిరంకుశ పెత్తనమే చెలామణి అవుతోంది. వారి మాటను ధిక్కరించిన వారికి ఇక్కట్లు తప్పని పరిస్థితి నెలకొంది. గ్రామంలో మద్యం దుకాణం, ఉప్పుమడులు, రేవుల వేలం తమ ఆధీనంలో కొందరు పెద్దలు నడిపిస్తుంటారు. తాజాగా వాటికి శనివారం నిర్వహించే వేలంలో పాల్గొనే వారు డిపాజిట్లు చెల్లించండంటూ గ్రామంలో శుక్రవారం చాటింపు కూడా వేయించారు.
బెల్టు షాపు వేలంలో పాల్గొనాలంటే రూ.50 వేలు, రేషన్‌షాపు, మార్కెట్ వంటి వాటి కోసం రూ.10 వేలు వంతున డిపాజిట్ చెల్లించాలని అక్కడి పెద్దల కమిటీ నిర్ణయించిందని సమాచారం. వేలం పాటల ద్వారా బెల్టు షాపును దక్కించుకొన్న వారు లెసెన్సు షాపులో విక్రయిస్తున్న ధరలకు అదనంగా మద్యం సీసాపై రూ.10, బీరు బాటిల్‌పై రూ.15 వేసుకోవచ్చని నిర్ణయించారు. ఈ బెల్ట్‌షాపునకు పల్లంకుర్రు లెసైన్సు షాపు నుంచి మద్యం సరఫరా అవుతుంటుంది. అక్కడ ఇప్పటికే మద్యం బాటిల్‌ను ఎంఆర్‌పీ కంటే అదనంగా రూ.10 నుంచి రూ.20కు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
బెల్ట్‌షాపునకు నిర్వహించే వేలం ద్వారా ధరలు పెంచి విక్రయించడంతో మరింత భారం పడుతుందని మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఈ గ్రామంలో నిర్వహించిన వేలం పాటలో బెల్టు షాపు రూ.22 లక్షలు, రేవు పాటలు రూ.2 లక్షలు, ఉప్పుమడులు రూ.8,50,000, మార్కెట్‌కు రూ.2,20,000గా నిర్ణయించారు.
బలుసుతిప్పలోని కొత్తపేట, మధ్యపేట, పాతపేటల నుంచి పలువురు పెద్దల సమక్షంలో శనివారం వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత వేలం సొమ్ముల లెక్కలు తేలక పోవడంతో వేలాన్ని అడ్డుకోవాలని కొందరు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం పరిస్థితి ఉద్రికంగా మారే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మరి, అధికార యంత్రాంగం ఏం చేస్తుందో చూడాలి.
అక్కడ వారి చూపుడువేలే చట్టం
Published Sat, Dec 13 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:04 PM
Advertisement
Advertisement