నేటి నుంచి ‘స్వచ్ఛ్ భారత్ మిషన్’
కడప కల్చరల్ :
స్వచ్ఛ్ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై ఈనెల 25వ తేదీ నుంచి అక్టోబర్ 23వరకు నిర్వహించనున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కేవీ రమణ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి స్వచ్ఛ్ భారత్ మిషన్ కార్యక్రమంపై ఎంపీడీఓలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు, మండలస్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలస్థాయిలో అధికారులు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని, కళాజాత, గోడపత్రాలు, కరపత్రాల ద్వారా విసృ్తత ప్రచారం చేయాలన్నారు. గ్రామ పంచాయతీల్లో సెక్రటరీలు పూర్తి బాధ్యత తీసుకొని మురికి కాలువల్లో పూడికతీత, రోడ్లపై నిలిచిన మురికినీటిని తొలగించడం, తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలన్నారు. ఆరుబయటి ప్రాంతాల్లో మల విసర్జన వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల గ్రామ వాసులకు అవగాహన కల్పించాలన్నారు. డ్వామా పీడీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లాకు లక్షా 6వేల వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయన్నారు. తాగునీరు కలుషితం కాకుండా పైపులైన్లను పరిశీలించి మరమ్మతు చేసి సురక్షితమైన మంచినీరు అందించాలన్నారు. డీఆర్‌డీఏ పీడీ అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఆధార్ సీడింగ్‌తో పూర్తిచేసిన సామాజిక పింఛన్ల వివరాలు ఈనెల 25వ తేదీలోపుగా డేటా నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ రామారావు, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, డీఎంఅండ్‌హెచ్‌ఓ ప్రభుదాస్, డీపీఓ అపూర్వ సుందరి, స్టెప్ సీఈఓ మమత, ఐసీడీఎస్ పీడీ లీలావతి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.