రేపటి నుంచి జనభేరి
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించి, ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి తెలిపారు. శుక్రవారం రాత్రి అమలాపురం నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ‘జనభేరి’ పేరిట సాగే జగన్ జిల్లా పర్యటనకు గురించి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జగన్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కొవ్వూరు నుంచి రాజమండ్రిలో అడుగు పెడతారు. రాజమండ్రి కార్పొరేషన్
పరిధిలో రోడ్ షో నిర్వహించి, రాత్రికి అమలాపురంలో బస చేస్తారు. 17న ఉదయం 9 గంటలకు అమలాపురంలో పలు వార్డుల్లో రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ముమ్మిడివరం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు రామచంద్రపురంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అనంతరం మండపేట నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారు. అదే రోజు రాత్రికి సామర్లకోట చేరుకుని అక్కడే బస చేస్తారు. 18న ఉదయం పిఠాపురంలో రోడ్ షో నిర్వహించి సాయంత్రం ఏలేశ్వరం నగర పంచాయతీలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆరు గంటలకు తుని చేరుకుని ప్రచారం నిర్వహిస్తారు. జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, పట్టణ, మండల కన్వీనర్లు, కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, జగన్ పర్యటనను విజయవంతం చేయాలని చిట్టబ్బాయి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్ సీపీ అభ్యర్థులు రోడ్ షోలకు హాజరు కావాలన్నారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా ఎన్నికల నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. అమలాపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ గొల్ల బాబూరావు మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే జగన్ అమలాపురం మున్సిపాలిటీలో పర్యటించనుండడం అభ్యర్థుల్లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, లీగల్ సెల్ కన్వీనర్ మట్టపర్తి మురళీకృష్ణ, అమలాపురం మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు జక్కంపూడి తాతాజీలు మాట్లాడుతూ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు కుడుపూడి త్రినాథ్, పితాని చిన్న, నల్లా రమేష్, పంపన పద్మలత, వాసంశెట్టి తాతాజీ తదితరులు పాల్గొన్నారు.