♦ ఏపీ రాజధాని భూములపై పూర్తి హక్కులు వాటికే!
♦ లీజు హక్కులు 99 ఏళ్లకు పెంపు
♦ నేడు చట్ట సవరణ బిల్లుకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్‌లో సేకరించిన కోట్ల రూపాయల విలువైన భూములను సింగపూర్ ప్రైవేట్ సంస్థలు కోరినట్లుగా అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్ కన్సార్టియంను ఎంపిక చేయాలని ప్రభుత్వ పెద్దలు ముందుగానే నిర్ణయించుకున్నారు. తొలిదశలో మూడు వేల ఎకరాలను ఇస్తే అభివృద్ధి చేస్తామని, ఆ భూమిపై పూర్తి హక్కులు కల్పించాలని అసెండాస్ సంస్థ ప్రభుత్వ పెద్దలను కోరింది. దీనిపై వారు అసెండాస్ ప్రతినిధులతో బేరసారాలు జరిపారు.
సింగపూర్ సంస్థ కోరినట్లు భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు వీలుగా ఏపీ మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్టంలో సవరణలు తేవాలని నిర్ణయించారు. వీటిని ఇప్పటికే ఆర్డినెన్స్ ద్వారా తె చ్చారు. ఇప్పుడు ఆర్డినెన్స్ స్థానే చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లును శనివారం ప్రవేశపెట్టారు. ఆ బిల్లును సోమవారం ఆమోదించనున్నారు. 2001లో చేసిన చట్టంలో పరిశ్రమలకు, ఇతర ప్రాజెక్టులకు కేటాయించే భూములను 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలనే నిబంధన మాత్రమే ఉంది. ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు వీల్లేదు. అయితే ఇప్పుడు పూర్తి హక్కులు సింగపూర్ ప్రైవేట్ సంస్థలకు కల్పించడంతో పాటు లీజు కాలాన్ని 99 ఏళ్లకు పొడిగిస్తూ సవరణలు చేస్తున్నారు.
అలాగే లీజుకాకుండా మొత్తానికి విక్రయించేందుకు వీలుగా చట్టంలో నిబంధనలను కల్పించారు. మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక కానున్న అసెండాస్ సంస్థ ఐదు దశల్లో రాజధాని అభివృద్ధిని 25 -30 ఏళ్లలో పూర్తి చేస్తామని, ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించాలని, మధ్యలో మరో సంస్థలు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదని ప్రభుత్వ పెద్దలకు స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు చట్టంలో సవరణలు తెస్తున్నారు.
సింగపూర్ సంస్థలు కోరినట్టే..!
Published Mon, Dec 21 2015 4:15 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement