Singapore companies
-
స్విచ్ ఒప్పందం రద్దు శుభపరిణామం
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కంపెనీలు స్విచ్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం శుభపరిణామం, దీన్ని మేము మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిరావు పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు చెప్పినా వినిపించుకోకుండా స్విచ్ చాలెంజ్‌ను సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా మార్చడానికి ఏకంగా రూల్స్ మార్చారు. ఈ ఒప్పందం ఒక లోపభూయిష్టమైనదని, దీనిని రద్దు చేయడంపై ప్రజలందరూ సంతోషించాలని పేర్కొన్నారు. స్విచ్ చాలెంజ్ ఒప్పందం వల్ల రూ. 306 కోట్లు సింగపూర్ కంపెనీలు పెట్టుబడితే రూ. 3604 కోట్లు లబ్ధి చేకూరనుంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందం రద్దు అయితే రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు అంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్విస్ చాలెంజ్ ఒప్పందం రద్దు వల్ల ఏపీలోని 13 జిల్లాల అభివృద్ది జరిగేలా అధికార వికేంద్రికరణ జరగాలి అని అభిప్రాయపడ్డారు. రాజధానిలో 45,50 అంతస్తుల నిర్మాణాలపై ప్రభుత్వం పునరాలోచించాలని తెలిపారు. -
పరాకాష్టకు చేరిన విలువల పతనం
గత 35 ఏళ్ల ప్రభుత్వ పాలనతో పోలిస్తే నాలుగేళ్ల చంద్రబాబు పాలన అతి చెత్త పాలనగా మిగిలిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజల ప్రయోజనాలకు సంరక్షణ కర్తలుగా ఉండాలి అనే భావననే క్షీణింపజేస్తూ, వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ వచ్చారని ఆరోపించారు. పాలకులు చెడుమార్గం పట్టినప్పుడు పౌర సమాజమే తగు నిర్ణయం తీసుకోవాలంటున్న అజయ్ కల్లం అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... మీరు రాసిన ‘మేలుకొలుపు’ లక్ష్యం ఏమిటి? వేకప్ కాల్ అనే ఇంగ్లిష్ పదానికి తెలుగు అర్థం మేలుకొలుపు. 1980లనాటి రాజకీయ నేతల్లో కాస్త నిజాయితీ ఉండేది. ఆ తరం నేతలు నిజాయితీపరులైన అధికారులను ఇబ్బంది పెట్టేవారు కాదు. సమాజం కోసం, రాష్ట్రం కోసం ఎవరైనా మంచి సలహా ఇస్తే ‘అవును.. మనం అలా చేద్దాం’ అంటూ ప్రోత్సహిం చేవారు. ఆ విధంగానే మనకు ఐటీడీఎ వంటి గొప్ప సంస్థలు ఏర్పడ్డాయి. కానీ 1980ల చివరికి వచ్చేసరికి మా కళ్లముందే వ్యవస్థలన్ని ధ్వంసం అయిపోవడం, క్షీణించిపోవడం చూశాం. వ్యవస్థలు విఫలమవటం, ఆనాటివరకు కొద్ది స్థాయిలో ఉండే అవినీతి తర్వాత భరించలేని స్థాయికి చేరడం, విలువలు పూర్తిగా పక్కకుపోవడం, సమర్థత ప్రాతిపదికన కాకుండా మనకు పనికొచ్చేవాడు ఎవరు అంటూ ఉన్న ఆఫీసర్లలో వెతుక్కోవడం మొదలైంది. మనప్రాంతం వాడా, మన కులంవాడా, మనం అడిగిన పని చేసిపెడతాడా లేదా అనేవి పదవులకు కొలమానాలుగా మారాయి. బ్యూరోక్రాట్లకు ప్రజా ప్రయోజనాలతో ఏమాత్రం పనిలేదనే వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజల ప్రయోజనాలకు సంరక్షణ కర్తలుగా ఉండాలి తప్ప రాజకీయ ప్రయోజనాలకోసం కాదు. ఆ భావననే క్షీణింపజేస్తూ, వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ వచ్చారు. ఇదే నా ‘మేలుకొలుపు’ లక్ష్యం. ప్రభువులు మీపట్ల చాలా ఆగ్రహంతో ఉన్నట్లున్నారే? ప్రశ్నించే అలవాటు సమాజంనుంచి పోవడం వల్లే వాళ్లాస్థాయికి వచ్చారు. ప్రశ్నిస్తే ఆగ్రహించడమా? నాయీ బ్రాహ్మణులను సచివాలయంలోకి ఎందుకు రానిచ్చారు అని సీఎం అరిస్తే ఎలా? నాయకులు బ్యాలెన్స్ తప్పినప్పడే ఇలాంటివి జరుగుతుంటాయి. ఎవరూ మమ్మల్ని ప్రశ్నించకూడదు, మేం మాత్రం అందరిమీదా పెత్తనం చెలాయిస్తాం అంటే మీరు అక్కడ ఉండే పరిస్థితే ఉండదు. ఇద్దరు సీనియర్ అధికారులు ప్రభుత్వ విధానాలను వరుసగా తూర్పారబట్టడం ఇదే ప్రథమం కదా? గతంలో మన వ్యవస్థలో ఎప్పటికప్పుడు కొద్దో గొప్పో సానుకూలంగా ఆలోచించేవాళ్లం. విచిత్రం ఏమిటంటే, పోయినవాళ్లే మంచివాళ్లు అని పెద్దలు చెబుతుంటారు కదా. గత 35 ఏళ్లుగా కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా పరిస్థితులు మెరుగవుతాయనే ఆశ ఎక్కువగా ఉండేది. కానీ దానికి పూర్తి భిన్నంగా జరుగుతూ వస్తోంది. పాలనకు సంబంధించి ఏ అయిదేళ్ల కాలాన్ని తీసుకున్నా, అంతకుముందు అయిదేళ్ల పాలనే ఉత్తమంగా ఉండేదన్న ప్రతిస్పందన ఆటోమేటిక్‌గా వస్తోంది. పరిస్థితి మెరుగుపడటానికి బదులు మరింతగా దిగజారుతూండటాన్నే చూస్తున్నాం. అయితే పార్టీలే తమ ఎజెండాను తీసుకెళ్లి ప్రజ లకు ఇవి చేస్తాం, అవి ఇస్తాం అంటూ చెబుతూ వస్తున్నాయి కానీ ప్రజలు మాకు ఇది కావాలి. ఇది వద్దు అని తమ సొంత ఎజెండాను రూపొందించుకుని డిమాండ్‌చేసే పరి స్థితి ఏర్పడాలన్న ఆలోచన మాత్రం మా ఇద్దరికీ వచ్చింది. ఒక్కటి మాత్రం నిజం. ఏపీలో ఇప్పుడున్న ప్రభుత్వ పాలన గత 35 ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాలన్నింటి కంటే చెత్త పాలన అని మాత్రం చెప్పాలి. కారణం ఏమంటే ప్రభుత్వ పాలనా సంస్థలు పూర్తిగా బలహీనమైపోయాయి. కానీ మండల వ్యవస్థ ద్వారా పాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లారని ప్రశంస కూడా వచ్చింది కదా? ఉన్న వ్యవస్థలను పనికిమాలినవిగా తయారు చేసి, ప్రజల వద్దకు పాలన అంటే ఉపయోగం ఏమిటి? పైగా మండల వ్యవస్థ నాటి నుంచి నేటి వరకుకూడా ఒక వ్యవస్థగా బలోపేతం కాలేదు. గతంలోని గ్రామీణ సమితులకు అది ప్రత్యామ్నాయం కాలేదు. మెంటే పద్మనాభంగారితో నాకున్న చనువుతో నేను ఆయన్ని ప్రశ్నించాను. ఇదేంటండీ తగిన ప్రత్యామ్నాయం ఏదీ తీసుకురాకుండానే మీరు ఉన్న వ్యవస్థలన్నింటినీ దునుమాడుతున్నారు. (ఆరోజునుంచి ఈరోజు వరకు గ్రామీణ రికార్డులు బాగుపడలేదు.) వ్యవస్థలను నాశనం చేస్తే మీకేంటండీ లాభం? ప్రజ లకు సరఫరా దెబ్బతింటుంది. దాంతో మీకు చెడ్డపేరు వస్తుంది కదా అని ఆయన్ని అడిగాను. దానికాయన అభిమానంతోటే ఒక విషయం చెప్పారు. అజయ్ మీరంతా యువకులు. మీరు ఆదర్శవాదంతోనే ఆలోచిస్తుంటారు. వ్యవస్థలన్నీ చక్కగా పనిచేసిపెడితే ఇక మాదగ్గరకు ఎవడొస్తాడయ్యా.. వ్యవస్థలు పాడైపోతేనే మా పాత్ర, మా ప్రాధాన్యం ప్రజల్లో పెరుగుతుంది అని చెప్పారాయన. ఆ విధంగా అప్పటినుంచి క్రమక్రమంగా ఒక్కో వ్యవస్థనూ నాశనం చేసుకుంటూ పోయారు. పైగా ఈరోజు ప్రభుత్వంలో ఏ కలెక్టర్‌కి, ఏ విభాగాధిపతికి స్వేచ్ఛ ఉంది? నాయకులు మొత్తం అధికారాలను తమ సొంతం చేసుకుం టున్నారు. కేంద్రీకరించుకుంటున్నారు. సింగపూర్ కంపెనీకి భూములు కట్టబెట్టడంపై మీరు అభ్యంతరం వ్యక్తం చేయలేదా? ఎందుకు లేదు? సింగపూర్ కంపెనీకి 1600 ఎకరాలు కట్టబెట్టడం అనేది ఏకపక్ష ఒప్పందం. దీంట్లో ప్రజా ప్రయోజ నాన్ని బలి తీసుకుంటున్నారు. ప్రభుత్వం అవతలివాళ్లకు లాభం కలిగేలా చేస్తోంది అని చాలా క్లియర్‌గా మా వాదనపై ఆరు పాయింట్లు నిర్దిష్టంగా రాసి అందించాం. దాన్ని కేబి నెట్ భేటీలో స్వయంగా నేను లేవనెత్తినా ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. మహారాష్ట్రలో దబోల్ విద్యుత్ ప్రాజెక్టు కేసు మీకు గుర్తుందా? దానికీ దీనికీ పెద్దగా తేడా లేదండీ అని చెప్పాను. అవునవును. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. కానీ మా నిర్ణయం మేము తీసుకుంటాము అని స్పష్టం చేశారు. ఈ అంశంపై నా విధి నేను చేశాను. కాబట్టి పశ్చాత్తాపపడాల్సిన పనిలేదు. మీరు కాదన్నా కేబినెట్ ఓకే చేసింది కదా? పౌరసమాజమే దీనికి సమాధానమివ్వాలి. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం పౌర సమాజానిదే కదా. రాజధాని చుట్టూ పరిణామాలపై మీకేమనిపిస్తోంది? నిజం చెప్పాలంటే రాజధాని వ్యవహారాల్లో మేమెన్నడూ జోక్యం చేసుకోలేదు. దాంట్లో మా పాత్ర ఏమీ లేదు. కానీ ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశంలో కూడా రాజధానికి ఇంత ప్రాధాన్యమిచ్చిన చరిత్ర ఎక్కడా లేదు. ఇంత హైప్ చేసింది లేదు కూడా. మన దేశ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దదైన కాలిఫోర్నియా నగరంలో ప్రభుత్వ శాఖలు ఎక్కడో ఒక మూలన పడేసినట్లుంటాయి. నెదర్లాండ్స్‌లో ప్రభుత్వ శాఖలన్నీ హేగ్ వంటి చిన్న నగరంలో ఉంటున్నాయి తప్ప రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో లేవు. ఆస్ట్రేలియాలో కీలక శాఖలన్నీ కాన్ బెర్రా అనే 3 లక్షల జనాభా ఉన్న అటవీ ప్రాంత పట్టణంలో ఉంటున్నాయి. రాజధాని అంటే పరిపాలనా శాఖ లతో కూడిన నిర్మాణం. దాన్ని ఒక పెద్ద మెగాసిటీగా, గ్రేటర్ సిటీగా పెంచాల్సిన అవసరం లేదు. అందులోనూ చేతిలో డబ్బులు లేని దాసరికి అవసరమే లేదు. రెండుమూడు ప్రభుత్వ భవనాలు, రెండువేల కోట్ల ఖర్చు, కావలసిన డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్లు, మౌలిక వసతులు తప్పితే అంతకు మించిన పెట్టుబడి అవసరమే లేదు. అక్కడున్న అవకాశాలను బట్టే రాజధాని చుట్టూ సహజ సిద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఈమాత్రం దానికి రాజధానిని పూర్తిగా కేంద్రీకృతం చేయాల్సిన అవసరం లేదు. పాలన ఎంత వికేంద్రీకరణకు గురైతే అంత సమర్థంగా ఉంటుంది. నిజంగా సచివాలయం అనేది గ్రామంలో ఉండాలి. గ్రామ వ్యవహారాలను నిత్యం చూసే సెక్రటేరియట్ అది. నేటికీ చాలా దేశాల్లో సెక్రటేరియట్ అనే భావనే లేదు. దేశరాజధాని ఢిల్లీలో సెక్రటేరియట్ ఉందా? వివిధ శాఖలు మాత్రం ఉన్నాయి. వాటì æపని అవి చేసుకుంటున్నాయి. ఆన్లైన్ వ్యవస్థ వచ్చింతర్వాత అన్నీ ఒకేచోట కేంద్రీకరించడం ఎందుకు? అవును. ఆన్లైన్ వ్యవస్థతో పనులు సమర్థంగా జరుగుతాయి. అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు వీలిచ్చే ఈ వైఖరిని మొత్తం ప్రపంచమంతా ప్రస్తుతం పాటిస్తోంది. ప్రభుత్వాఫీసులన్నీ ఒకే చోట ఎందుకు పెట్టాలి? నాలుగు డిపార్ట్మెంట్లు తిరుపతిలో, మరో నాలుగు విశాఖలో పెట్టండి. కొన్ని విభాగాలను కర్నూలులో పెట్టండి. దానివల్ల నష్టం ఏమిటి? ఏ డిపార్ట్మెంట్తో ఎవరికి పనిబడితే వారు మాత్రమే అక్కడికి వెళతారు. అంతేగానీ అన్ని పనులకూ రాజ ధానికే ఎందుకు రావాలి? రాజధానిలో ఉండటం వల్ల ఎవరికీ లాభం లేదు. కేవలం ప్రభుత్వోద్యోగులకు అక్కడికక్కడే ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి తప్ప ఇతరులకు లాభం ఏమిటి? రెండోది ఎమ్మెల్యేలు పైరవీలు చేసుకోవడానికి కూడా రాజధాని ఉపయోగపడుతుంది. అంతే తప్ప సాధారణ ప్రజలకు అన్నీ ఒకేచోట ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదు. -
అరచేతిలో వైకుంఠం!
సాక్షి, అమరావతి: అమరావతిలో నవ నగరాలు, ఐకానిక్ టవర్లు, ఐకా నిక్ బ్రిడ్జీలు.. వాటర్ ఛానళ్లు.. గోల్ఫ్ కోర్సులతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కోటలు దాటినా అడుగులు మాత్రం అస్తవ్యస్థంగా ఉంటున్నాయి. రాజధాని ఎక్కడుందో కనపడ్డంలేదు కానీ అంతర్జాతీయ స్థాయి కుంభకోణాలు మాత్రం కలవరపెడుతున్నాయి. కొత్త రాజధానిలో నిర్మాణాలు ఒకటి రెండే ఉండగా వివాదాలు, అడ్డగోలు వ్యవహారాలు మాత్రం అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. సింగపూర్ కంపెనీలతో లాలూచీపడి వేల కోట్ల విలువైన భూములను వారికి అప్పనంగా అప్పగించడం.. భూసమీకరణ పేరుతో నాలుగు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడం.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వాటిని సొంతం చేసుకోవడం వంటి అనేక దారుణాలు నాలుగేళ్లుగా అమరావతికి అడ్డుగా మారాయి. రాజధాని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని అవినీతికి పాల్పడిందనడానికి ఇవే నిదర్శనాలు. గద్దెనెక్కకాగానే ఇన్సైడర్ ట్రేడింగ్ 2014 ఎన్నికల అనంతరం రాజధాని ఎక్కడనే విషయంపై వ్యూహాత్మకంగా లీకులిచ్చిన ప్రభుత్వ పెద్దలు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా చేజిక్కించుకున్నారు. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి తమకు అనుకూలమైన ప్రాంతంలో రాజధాని ఏర్పాటుచేయాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని తమకు కావల్సిన వారికి మాత్రమే చెప్పారు. దీంతో సీఎం, ఆయన కుమారుడు, వారి కోటరీ వ్యక్తులంతా ఆ ప్రాంతంలో తక్కువ ధరకు భారీగా భూములు కొనుగోలు చేశారు. ఇలా తాము ముందే అనుకున్న ప్రాంతంలో సుమారు 25వేల ఎకరాలను టీడీపీ నాయకులు తక్కువ రేటుకు చేజిక్కించుకున్నారు. అదే సమయంలో బయట ప్రపంచానికి మాత్రం రాజధాని నూజివీడులో అని, గన్నవరంలో అని గుంటూరు జిల్లాలోని నాగార్జున వర్సిటీ ప్రాంతంలో అని అనుకూల మీడియా ద్వారా లీకులిచ్చారు. తద్వారా రాజధాని పేరుతో ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ సృష్టించి సాధారణ, మధ్యతరగతి ప్రజలను తప్పుదారి పట్టించారు. అనుకున్న చోట భూములన్నీ తమ చేతుల్లోకి వచ్చాక గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని ఏర్పాటుచేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో అప్పటివరకూ భూములమ్ముకున్న వారు గొల్లుమనగా, ప్రభుత్వ లీకులతో వేరే ప్రాంతాల్లో కొన్నవారు నిండామునిగిపోయారు. దీంతో తాము అనుకున్న ప్రాంతంలో కొన్న భూముల విలువ అమాంతం పెరిగిపోవడంతో టీడీపీ బడా బాబులంతా వేలకోట్ల లబ్ధి పొందారు. ఈ ఆట తెలియని సామాన్యులు సర్వం పోగొట్టుకున్నారు. దళిత రైతుల అసైన్డ్, లంక భూములను సైతం అధికార పార్టీ నేతలు భయపెట్టి కారుచౌకగా తీసుకున్నారు. ఇలా ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేల బాగోతాలను ‘సాక్షి’ రెండేళ్ల క్రితమే బయటపెట్టింది. బలవంతపు భూసమీకరణ.. అడుగడునా దౌర్జన్యాలు ఇలా భూముల కొనుగోళ్లు పూర్తయ్యాక తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం భూసమీకరణ ద్వారా 34వేల ఎకరాలను లాక్కుంది. కృష్ణా నది తీరంలో నాలుగు పంటలు పండే అత్యంత విలువైన భూములను ఇవ్వలేమని రైతులు గగ్గోలు పెట్టినా.. పర్యావరణవేత్తలు మొత్తుకున్నా, ప్రతిపక్షాలు, స్థానికులు పెద్దఎత్తున ఆందోళనలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం బెదిరింపులు, దౌర్జన్యాలతో భూములు లాక్కుంది. పలుచోట్ల తోటలను దగ్ధం చేయడం, ఇవ్వని రైతులపై కేసులు పెట్టి వేధించడం, టీడీపీ నేతలు వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరించడం, పొలాలకు నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేయడం, వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవడం, రైతులకు తెలియకుండానే వారి భూములను దున్నేయడం వంటి అనేక అరాచకాలకు పాల్పడింది. ఈ ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు తమకు అనుకూలమైన కొందరు రైతులను చూపించి స్వచ్ఛందంగా రైతులు భూములిచ్చినట్లు ప్రచారం చేసింది. మరోవైపు.. నాలుగు పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మాణం వద్దంటూ పర్యావరణవేత్తలు గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా నిబంధనల మేరకు రాజధాని నిర్మాణం చేపట్టాలని ట్రిబ్యునల్ సూచనలు చేసింది. వాటి ప్రకారమే నడుచుకుంటామని ట్రిబ్యునల్‌కు చెప్పిన సర్కార్.. క్షేత్రస్థాయిలో మాత్రం తన ‘ప్లాన్’ ప్రకారమే వెళ్తోంది. అలాగే.. మేధాపాట్కర్, రాజేంద్రసింగ్ వంటి పర్యావరణవేత్తలు సైతం రాజధాని ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్న నష్టంపై తమ వాణి వినిపించారు. పర్యావరణ విషయం ఇలా ఉంటే.. భూసమీకరణ సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, బెదిరింపులపై ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బ్యాంకు ప్రతినిధులు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. దీంతో రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక సాయం పై ఆ బ్యాంకు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్లాట్ల కేటాయింపుల్లో వివక్ష ఇదిలా ఉంటే.. భూసమీకరణ ప్యాకేజీని టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి లబ్ధిచేకూర్చేలా తయారుచేసిన ప్రభుత్వం రైతులకిచ్చే ప్లాట్ల విషయంలో వివక్ష చూపించింది. ఎక్కడి భూములకు అక్కడే ప్లాట్లు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇష్టానుసారం వాటిని మార్చేసి అనుకూలురకు కావల్సిన చోట కేటాయించింది. కాగా, ప్లాట్ల పంపిణీ కేవలం కాగితాల్లోనే జరిగింది తప్ప ఎవరికీ ప్లాట్లు భౌతికంగా ఇవ్వలేదు. ప్లాట్ల కేటాయింపునకు నిర్వహించిన లాటరీ విధానంపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘తాత్కాలికం’లో డొల్లతనం ఇంత హడావుడి చేసినా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ తప్ప మరో నిర్మాణం రాజధానిలో కట్టలేకపోయారు. వీటికి వెయ్యి కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఆరు బ్లాకులను మొదట రూ.180 కోట్లతో మొదలు పెట్టి అంచెలంచెలుగా దాని ఖర్చు పెంచుకుంటూ వెళ్లారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనాలు పైన పటారం లోన లొటారం మాదిరిగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికే భవనాల లోపల వర్షపు ధార కారిపోతుండడం వాటి డొల్లతనాన్ని బయటపెట్టింది. ఒక్క శాశ్వత భవనమూ లేదు రాజధానిలో ఇప్పటివరకూ ఒక్క శాశ్వత భవన నిర్మాణానికీ పునాది పడలేదు. డిజైన్ల కోసం చంద్రబాబు చేస్తున్న విన్యాసాలతో నవ్వులపాలవడం తప్ప ఫలితం లేకుండాపోయింది. 900 ఎకరాల్లో హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయం, శాఖాధిపతులు, విభాగాధిపతులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయ భవనాల డిజైన్ల మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా మొదట జపాన్‌కు చెందిన ‘మకి’ అసోసియేట్స్‌ను అంతర్జాతీయ పోటీలో ఎంపిక చేసిన ప్రభుత్వం అనూహ్యంగా దాన్ని పక్కకు తప్పించి లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్‌ను ఎంపిక చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఢిల్లీలోని కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కు ‘మకి’ ఫిర్యాదు చేయడంతోపాటు అంతర్జాతీయ జర్నళ్లలో ఎండగట్టింది. దీంతో అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు బజారునపడింది. మరోవైపు.. బాహుబలి, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల్లోని అమరావతి సెట్టింగ్‌లపై మనసుపడి వాటి దర్శకులతో చర్చలు జరిపారు. రెండున్నరేళ్లపాటు ఇలా డిజైన్లు మార్చిమార్చి ఇటీవలే ఆమోదం తెలిపినా ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. ఇదిలా ఉంటే.. రాజధాని రోడ్లు, భవనాల నిర్మాణ అంచనాలను కళ్లుచెదిరేలా తయారు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చదరపు అడుగుకు రూ.నాలుగైదు వేలతో నిర్మించే అవకాశం ఉన్న భవనాలకు రూ.7వేల నుంచి 10 వేల వరకూ అంచనాలు వేసి టెండర్లు పిలవడంతో నిర్మాణ నిపుణులే విస్తుపోతున్నారు. తాజాగా రూ.1,387 కోట్ల అంచనాతో కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జి పనుల్ని ఖరారు చేయడం ఈ కోవలోనిదే. మరోవైపు.. టెండర్లు, డిజైన్లతో సంబంధం లేకుండా రూ.250 కోట్లు ఖర్చుపెట్టి ఏడాదిన్నర క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో ఉద్ధండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేయించినా అక్కడ ఏం కట్టాలనే దానిపై ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. పరిపాలనా నగరానికి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో శంకుస్థాపన చేయించినా దానికి సంబంధించిన డిజైన్లూ ఇంకా ఖరారు కాలేదు. ఇలా రాజధానికి సంబంధించిన ప్రతీ పని ఒక ఆర్భాటపు ప్రహసనమే తప్ప ఆచరణలోకి రాలేదు. స్టార్టప్ ఏరియాలో సింగపూర్ కంపెనీలతో లాలూచీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో రాజధాని భూములను కారుచౌకగా సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి కుంభకోణానికి తెరతీసింది. రైతుల నుంచి సేకరించిన భూముల్లోని 1691 ఎకరాలను ఎకరం రూ.12 లక్షల చొప్పున స్విస్ ఛాలెంజ్ విధానంలో నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి సింగపూర్ కన్సార్టియంకు అప్పగించింది. విడతల వారీగా అప్పగించే ఈ భూముల విలువలో కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. అవే భూములను ఇతర కంపెనీలకు ఎకరం రూ.4 కోట్లకు ప్రభుత్వం కేటాయించింది. దీన్నిబట్టి రూ.6,764 కోట్ల విలువైన భూములను కేవలం రూ.250 కోట్లకు అప్పగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ప్రాజెక్టు కోసం రాజధాని ప్రకటనకు ముందే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సింగపూర్ కంపెనీలతో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను వారితో తయారు చేయించి ఆ తర్వాత ఈ ప్రాజెక్టును స్విస్ ఛాలెంజ్ విధానంలో వారికే అప్పగించారు. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలో తమకూ అవకాశం ఇవ్వాలని పలు సంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపింది. దీంతో ప్రభుత్వం ఏపీఐడీసీ చట్టాన్నే మార్చేసి సింగపూర్ కన్సార్టియంకు ప్రాజెక్టును అప్పగించింది. ప్రభుత్వం అభివృద్ధి చేసి ఇచ్చిన ఈ భూముల్లో ప్లాట్లు వేసి సింగపూర్ కన్సార్టియం, ఏడీసీ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) కలిసి విక్రయిస్తుంది. కారుచౌకగా భూములివ్వడంతోపాటు రూ.5,500 కోట్లతో అందులో మౌలిక వసతులు అభివృద్ధి చేసే పని కూడా ప్రభుత్వానిదే. ఈ భూములపై సింగపూర్ కన్సార్టియంకు సీఆర్డీఏ పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఇచ్చేసింది. ఇంతచేసి సింగపూర్ కంపెనీలు ఇందులో పెట్టే పెట్టుబడి రూ.330 కోట్లు మాత్రమే. కానీ, ప్రాజెక్టులో మాత్రం 58 శాతం వాటా వారికి ఇచ్చారు. భూములు, వసతులు కల్పన అన్నీ చేసిన ఏడీసీ వాటా మాత్రం 42 శాతమే. ఇంత దారుణంగా ప్రభుత్వం నష్టపోతూ కూడా సింగపూర్ సంస్థలకు ప్రభుత్వం మోకరిల్లడం వెనుక ప్రభుత్వ ముఖ్యుల స్వప్రయోజనాలున్నాయని, వేల కోట్ల లబ్ధి ఉందని స్పష్టమవుతోంది. -
ప్రజల ఆస్తులు.. చంద్రబాబు సొంత ఆస్తులైనట్టు!
సాక్షి, కాకినాడ : ప్రజల ఆస్తులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత ఆస్తులుగా భావించి.. సింగపూర్ కంపెనీలకు దానం చేస్తున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. రైతు జీవితంలో నిత్యం కష్టాలే ఉంటాయని, రైతుల పట్ల సానుభూతి చూపాల్సిన ప్రభుత్వమే వారిని కష్టాలపాలు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం అన్ని పార్టీల నేతలతో ఒకే వేదికపైకి వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ సమావేశం ఏర్పాటు చేయాలని ముద్రగడ కోరారు. రాష్ట్రాన్ని సింగపూర్ పాలిత ప్రాంతంగా మార్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అందరూ కలిసి రాష్ట్రాన్ని, రైతులను, సామాన్య ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరముందని ముద్రగడ అన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతలకు ముద్రగడ సోమవారం ఒక లేఖ రాశారు. ‘చంద్రబాబు తన తండ్రి, తాతల ఆస్తులు అయినట్టు భావించి రైతుల భూములను దానం చేస్తున్నారు. ఈ విధంగా ఈ భూములను ధారాదత్తం చేసిన జూన్ 7ను చరిత్రలో చీకటి రోజుగా భావించాలి. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి పరాయి పాలన నుంచి విముక్తి పొందాం. ఇప్పుడు సింగపూర్ పాలన నుంచి బయటపడేందుకు మరోసారి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. బ్రిటీష్ వారిని మన దేశం నుండి ఎలా తరిమికొట్టామో.. అదేవిధంగా సింగపూర్ కంపెనీని తరిమి కొట్టాలి’ అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. వామపక్షలను కలుపుకుని పోరాటం చేస్తే.. అందులో పాల్గొనేందుకు.. తనలాంటి వాళ్లు ఎందరో సిధ్ధంగా ఉన్నారని, వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ అన్ని పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఈ విషయమై చర్చించాలని పేర్కొన్నారు. -
భూములతోపాటు నదిని రాసిచ్చేస్తారా?
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతుల హక్కులను కాలరాస్తోందని, తమ అనుమతి లేకుండా తమ భూములను సింగపూర్ కంపెనీలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి హక్కు ఎక్కడిదని రాజధాని ప్రాంత రైతులు ధ్వజమెత్తుతున్నారు. గ్రాఫిక్స్ డిజైన్లు, ఊహా చిత్రాలతో ప్రభుత్వం మభ్యపెడుతోంది తప్పితే క్షేత్రస్థాయిలో అభివృద్ధి అనేది మచ్చుకైనా కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. తమ భూములతోపాటు కృష్ణా నదిని కూడా సింగపూర్ కన్సార్టియానికి రాసిచ్చేలా ప్రభుత్వ చర్యలున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూలింగ్‌కు ఇవ్వకపోయినా.. రాజధాని గ్రామాలైన తాళ్లాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెంలలో 1691 ఎకరాలను సింగపూర్ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వమే చదును చేసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్‌కి అప్పగించాలి. ఇలా అప్పగించిన భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లుగా విభజించిన తర్వాత సింగపూర్ కంపెనీలు ఇతరులకు విక్రయించనున్నాయి. కాగా.. ఈ మొత్తం 1691 ఎకరాల్లో సుమారు 200 ఎకరాలను రైతులు భూసమీకరణకు ఇవ్వలేదు. అయినా రైతుల అనుమతి లేకుండా ప్రభుత్వం అప్రజాస్వామికంగా భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడంపై రైతులు మండిపడుతున్నారు. ప్లాట్లను అభివృద్ధి చేయకుండా ఒప్పందాలు రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 25 వేల మంది రైతుల నుంచి 34 వేల ఎకరాలను సేకరించింది. దీనికి ప్రతిగా ప్రభుత్వం సుమారు 60 వేల రిటర్నబుల్ ప్లాట్లను రైతులకు కేటాయించింది. ఈ ప్రక్రియ ప్రారంభమై రెండేళ్లవుతున్నా ఇంతవరకు ఏ ఒక్క ప్లాటునూ ప్రభుత్వం అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. తమకు ఇచ్చిన ప్లాట్లను ఇంతవరకు అభివృద్ధి చేయని ప్రభుత్వం.. సింగపూర్ కంపెనీలకు ఇచ్చిన భూమిని ఎలా అభివృద్ధి చేస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. దళితులమనే దగా చేస్తోంది.. బ్రిటిష్ పాలనలో మాకు భూములు పంపిణీ చేశారు. రాజధాని కోసం సమీకరిస్తున్న భూములన్నింటికి ప్రభుత్వం ఒకే తరహా ప్యాకేజీ ఇవ్వడం లేదు. దళితులమనే మాకు అన్యాయం చేస్తోంది. పూలింగ్ ఇవ్వని భూములను మా అనుమతి లేకుండా స్టార్టప్ కంపెనీలకు కట్టబెట్టడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటి? రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయకుండా ప్రజా ధనాన్ని విదేశీ కంపెనీలకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. – కలపాల ప్రభుదాస్, రైతు, లింగాయపాలెం దళితులమనే దగా చేస్తోంది.. బ్రిటిష్ పాలనలో మాకు భూములు పంపిణీ చేశారు. రాజధాని కోసం సమీకరిస్తున్న భూములన్నింటికి ప్రభుత్వం ఒకే తరహా ప్యాకేజీ ఇవ్వడం లేదు. దళితులమనే మాకు అన్యాయం చేస్తోంది. పూలింగ్ ఇవ్వని భూములను మా అనుమతి లేకుండా స్టార్టప్ కంపెనీలకు కట్టబెట్టడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటి? రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయకుండా ప్రజా ధనాన్ని విదేశీ కంపెనీలకు ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. – కలపాల ప్రభుదాస్, రైతు, లింగాయపాలెం -
సింగపూర్‌కే సర్వ హక్కులు
సాక్షి, అమరావతి: రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుపై సర్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థలకు కట్టబెట్టింది. రైతుల నుంచి ఉచితంగా సేకరించిన భూమిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకునే అవకాశంతో పాటు నచ్చినవారికి వేలం లేదా సంప్రదింపుల ద్వారా విక్రయించుకునే హక్కులను సింగపూర్ కంపెనీలకు కల్పించింది. ఈమేరకు సీఎం చంద్రబాబు, సింగపూర్ వాణిజ్యశాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్ సమక్షంలో ఇరుపక్షాలు గురువారం సంతకాలు చేశాయి.స్టార్టప్ ఏరియా కింద అభివృద్ధి చేసే 1,691 ఎకరాలను ఎలాంటి ఆక్రమణలు లేకుండా చదును చేసి ఒప్పందం చేసుకున్న 12 నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ (ఏడీపీ)కి అప్పగించాల్సి ఉంటుందని సెంబ్‌కార్ప్, అసెండాస్–సింగ్బ్రిడ్జ్లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశాయి. ఇలా అప్పచెప్పిన భూమిని అభివృద్ధి చేసి, ప్లాట్లుగా విభజించి ఇతరులకు విక్రయించనున్నట్లు ఆ కంపెనీలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ స్థలం ఇవ్వాలంటే ఆ 1,691 ఎకరాల్లో ఉన్న మసీదులు, గుడులు, చర్చిలు, శ్మశానాలు కూల్చి, చదును చేసి భూములను ఏడీపీకి దఖలు చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైతులు ఉచితంగా ఇచ్చిన భూములను తనఖా పెట్టుకోండి రాజధాని కోర్ క్యాపిటల్‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందంతోపాటు రాయితీలు, అభివృద్ధి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సింగపూర్‌కు చెందిన కంపెనీలు అసెండాస్, సెంబ్కార్ప్లు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్‌కు 58 శాతం వాటా, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ)కు 42 శాతం వాటా ఉండేలా అమరావతి డెవలప్మెంట్ పార్టనర్స్ పేరుతో భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా సింగపూర్ కంపెనీలు రూ. 306 కోట్లు, ఏడీసీ రూ. 222 కోట్లు ఈక్విటీని సమకూర్చనున్నాయి. ఏడీపీ కంపెనీ బోర్డులో సింగపూర్‌కు చెందిన నలుగురు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు బోర్డు సభ్యులుగా ఉంటారు. ఇక రాయితీలు, అభివృద్ధి ఒప్పందం విషయానికి వస్తే 15 ఏళ్లలో మూడు దశల్లో 1,691 ఎకరాలను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో 656 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. ప్రాజెక్టు అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం ఈ భూములను తనఖా పెట్టుకొని మరీ రుణాలు తీసుకునే హక్కును కూడా కల్పించారు. అంతేకాదు అభివృద్ధి చేసిన భూములను వేలం లేదా సంప్రదింపులు ద్వారా విక్రయించుకోవచ్చు. ఇలా అభివృద్ధి చేసిన భూమిలో కనీసం 70 శాతం అమ్మిన తర్వాతనే రెండో దశ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 15 ఏళ్ల కాలపరిమితిని నిర్ణయిస్తే రాయితీలు మాత్రం 20 ఏళ్లు కల్పించడం గమనార్హం. ఏడీపీకి ఇచ్చే వివిధ రాయితీ వివరాలను మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేదు. 2020 నాటికి అసెంబ్లీ, హైకోర్టు: సీఎం చంద్రబాబు ఈ ఒప్పందం వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నగరాన్ని నిర్మించడం ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా సంపద సృష్టించాలన్నది తమ లక్ష్యమన్నారు. 2020 కల్లా హైకోర్టు, అసెంబ్లీ భవనాలు పూర్తవుతాయన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమరావతికి విమాన సర్వీసులు నడపడానికి సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంసిద్ధత వ్యక్తం చేసిందని, నెల రోజుల్లో ఈ సర్వీసులు ప్రారంభం కావచ్చన్నారు. త్వరలో సింగపూర్‌లో జరిగే వరల్డ్ సిటీ సమ్మిట్‌లో అమరావతి గురించి వివరించనున్నట్లు ఈశ్వరన్ తెలిపారు. అంతకుముందు జరిగిన మూడో సంయుక్త అమలు పర్యవేక్షణ కమిటీ సమావేశంలో రాజధాని నిర్మాణం, ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. -
భలే మంచి చౌకబేరము!
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో ప్రభుత్వ పెద్దలు స్వప్రయోజనాలే పరమావధిగా భావిస్తున్నారు. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు అపరిమిత లబ్ధి చేకూర్చడంతోపాటు భూములివ్వని రైతులను దగా చేస్తున్నారు. రాజధానిలో ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరాకు రూ.4 కోట్ల ధరతో భూములు కేటాయించిన రాష్ట్ర సర్కారు సింగపూర్ కంపెనీలపై మాత్రం ఎనలేని ఔదార్యం ప్రదర్శిస్తోంది. అమరావతిలో సింగపూర్ కంపెనీలతో కలిసి చేపట్టనున్న స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టుకు కేటాయించిన భూముల విలువ ఎకరాకు కేవలం రూ.12.02 లక్షలేనని తేల్చేసింది. అంతేకాదు రూ.47.05 కోట్ల విలువైన స్టాంప్ డ్యూటీ, పవర్ ఆఫ్ అటార్నీ స్టాంప్ డ్యూటీ మినహాయింపులు కూడా ఇచ్చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం విలువ రూ.140.62 కోట్లే రాజధానిలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, నాబార్డు వంటి సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.4 కోట్ల ధరతో భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు కూడా ఎకరానికి రూ.4 కోట్ల ధరతోనే భూములిస్తామని సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు. స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరిట సింగపూర్ కంపెనీలకు అమరావతిలో 1,691 ఎకరాలు కేటాయించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు ఎకరాకు రూ.4 కోట్లు అయితే, ఈ మొత్తం భూముల విలువ రూ.6,764 కోట్లు. కానీ, ఎకరాకు రూ.12.02 లక్షలు మాత్రమేనని నిర్ధారించడంతో ఈ భూముల విలువ కేవలం రూ.140.62 కోట్లు కానుంది. అంటే ప్రభుత్వ ఖజానాకు రూ.6,623.38 కోట్లు నష్టం వాటిల్లుతోంది. సొంత లాభమే ముఖ్యం రాజధానిలో ప్రభుత్వ పెద్దలు విదేశీ కంపెనీలకు అత్యంత తక్కువ ధరకే భూములివ్వడం వెనుక రెండు కారణాలున్నాయని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) వర్గాలు చెబుతున్నాయి. ఒకటి తక్కువ ధరకే భూములిచ్చి, సింగపూర్ కంపెనీలకు భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చి అందులో స్వలాభం చూసుకోవడం. రెండోది ఎకరా విలువ రూ.12.02 లక్షలేనని తేల్చడం ద్వారా రాజధాని ప్రాంతంలో ఇప్పటిదాకా భూములివ్వని రైతుల నుంచి అదే ధరకు భూములు లాక్కోవడం. మినహాయింపులే.. అమరావతిలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు 1,691 ఎకరాల్లో చేపట్టే స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టు వ్యయం రూ.3,137 కోట్లుగా పేర్కొన్నారు. ప్రాజెక్టు విలువలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది రూ.15.68 కోట్లు అని స్పష్టం చేసింది. అలాగే సింగపూర్ కంపెనీలకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఇచ్చేసింది. దీనికి స్టాంప్ డ్యూటీ కింద ఒక శాతం మినహాయింపు ఇచ్చారు. ఇది రూ.31.37 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్టు విలువలో స్టాంప్ డ్యూటీ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ స్టాంప్ డ్యూటీ మొత్తం మినహాయింపు రూ.47.05 కోట్లు అన్నమాట! రాజధాని అమరావతిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూమి ధరలు(ఎకరాకు) - ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: రూ.4 కోట్లు - లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: రూ.4 కోట్లు - స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా: రూ.4 కోట్లు - ఆంధ్రా బ్యాంకు: రూ.4 కోట్లు - బ్యాంక్ ఆఫ్ ఇండియా: రూ.4 కోట్లు - నాబార్డు: రూ.4 కోట్లు - న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ: రూ.4 కోట్లు - హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్: రూ.4 కోట్లు - సిండికేట్ బ్యాంకు: రూ.4 కోట్లు - ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా: రూ.4 కోట్లు -
ప్రైవేట్ రాజధాని!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధికి సింగపూర్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాల్లో ఊహకందని విచిత్రం బహిర్గతమైంది. రాయితీ, అభివృద్ధి ఒప్పందం, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్‌పై సంతకాల కోసం ఓ సంస్థ పుట్టుకొచ్చింది. ఆ సంస్థను సింగపూర్ కన్సార్టియం సృష్టించింది. తొలి నుంచి సింగపూర్ కంపెనీలకు దాసోహమైన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పుట్టుకొచ్చిన సంస్థతో ఒప్పందంపై సంతకాలు చేయించుకునేందుకు సిద్ధమైంది. రాజధాని అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో సింగపూర్ ప్రభుత్వంతో జీ టు జీ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సింగపూర్ ప్రభుత్వం మాస్టర్ డెవలపర్స్‌గా ప్రైవేట్ కంపెనీలైన అసెండాస్, సెమ్‌బ్రిడ్జి, సెమ్బ్కార్ప్లను నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మూడు కంపెనీలతో కూడిన కన్సార్టియంను ఒరిజనల్ ప్రాజెక్టు ప్రాంపెనెట్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఆ కన్సార్టియంకు స్విస్ చాలెంజ్ పేరుతో స్టార్టప్ ఏరియా 1,691 ఎకరాలను కట్టబెట్టారు. షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ ప్రకారం స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో సింగపూర్ కన్సార్టియంకు 58 శాతం వాటా, కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి 42 శాతం వాటా ఉంది. షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్పైన, రాయితీ, అభివృద్ధి ఒప్పందంపైన సింగపూర్ కన్సార్టియం సంతకం చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ కంపెనీలు సంతకాలు చేయబోమని స్పష్టం చేశాయి. ఆ కంపెనీల తరఫున ఒప్పందాలపై సంతకాలు చేయడానికి కొత్తగా సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ పీఈటీ లిమిటెడ్ (ఎస్‌ఏఐహెచ్)ను సృష్టించాయి. తమ తరఫున ఆ కొత్త కంపెనీ సంతకం చేస్తుందని గతేడాది సెప్టెంబర్ 25న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. సింగపూర్ కంపెనీలు కోరినట్లే రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తప్పులను హైకోర్టు ఎత్తి చూపినా.. స్విస్ చాలెంజ్ విధానం పేరుతో నామినేషన్‌పై సింగపూర్ కన్సార్టియంకు భూములు కట్టబెట్టడంలో తప్పులను హైకోర్టు ఎత్తి చూపినా ప్రభుత్వం తీరు మారలేదు. స్విస్ చాలెంజ్ విధానంలో తప్పులను సరిచేయకపోగా ఆ తప్పులకు సమర్థించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ యాక్ట్ (ఏపీఐడీఈఏ)–2001కి చట్ట సవరణ చేశారు. ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పరిశీలన చేయాల్సిన అవసరం లేదని చట్టాన్ని సవరించారు. ఇప్పుడు కూడా సింగపూర్ కంపెనీలు కోరినట్లు కీలకమైన రాయితీ అభివృద్ధి ఒప్పందం, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్లో మార్పులు చేయడానికి, అలాగే సంతకందారుల మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను మార్చేయడం గమనార్హం. జీవోకు విరుద్ధంగా సంతకాలకు సిద్ధం ఏదైనా పనిచేయడానికి టెండర్లో కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థతోనే సంబంధిత ప్రభుత్వ శాఖ ఒప్పందం చేసుకుంటుంది. అలాగే ఒక సంస్థ నుంచి అప్పు తీసుకుంటే ఆ సంస్థతోనే ఒప్పందం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాజధాని స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ఒరిజనల్ ప్రాజెక్టు ప్రొపెనెంట్గా సింగపూర్ కన్సార్టియం స్విస్ చాలెంజ్ విధానంలో ప్రతిపాదనలను సమర్పించింది. ఆ ప్రతిపాదనల్లోనే రాయితీ, అభివృద్ధి, షేర్ హోల్డింగ్ డాక్యుమెంట్లను కూడా సమర్పించింది. వీటిపై ఆర్థిక శాఖ మంత్రి యనమల నేతృత్వంలోని హైపవర్ కమిటీ సింగపూర్ కంపెనీలతో నేరుగా సంప్రదింపులు జరిపింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై నేరుగా టెలిఫోన్లో బేరసారాలు సాగించారు. అనంతరం సింగపూర్ కన్సార్టియంకు స్టార్టప్ ఏరియా అప్పగిస్తూ గత ఏడాది మే 8న జీవో 179 జారీ చేశారు. అదే జీవోలో ఒరిజనల్ ప్రాజెక్టు ప్రొపనెంట్.. అంటే సింగపూర్ కన్సార్టియం సంస్థలతో రాయితీ అభివృద్ధి, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్లు చేసుకోవాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ జీవోకు విరుద్ధంగా సింగపూర్ కన్సార్టియం కేవలం తొమ్మిది మంది ఉద్యోగులతో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్ఏఐహెచ్తో ఒప్పందాలు చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదినుంచీ దాసోహమే.. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ), సింగపూర్ కంపెనీలు సంయుక్తంగా అమరావతి డెవలప్మెంట్ పార్టనర్ (ఏడీపీ) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్‌ను ఏర్పాటు చేశాయి. అయితే సింగపూర్ కంపెనీలు ఇప్పుడు ఏడీపీ స్పెషల్ పర్పస్ వెహికల్‌గా ఉండరాదని, కేవలం సాధారణ ఏడీపీగానే ఉండాలని స్పష్టం చేశాయి. అందుకు కూడా అంగీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీని ప్రకారం రాయితీ, అభివృద్ధి ఒప్పందం సింగపూర్ కంపెనీలకు బదులు ఎస్‌ఏఐహెచ్, సీఆర్డీఏ మధ్య జరగనుంది. అలాగే షేర్ హోల్డర్స్ అగ్రిమెంట్ కూడా ఎస్‌ఏఐహెచ్, ఏడీపీ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్)ల మధ్య జరగనుంది. అయితే ఒరిజనల్ ప్రాజెక్టు ప్రొపనెంట్ కంపెనీలతో ఒప్పందం చేసుకోకుండా ఆ కంపెనీలు సూచించిన మరో కంపెనీతో ఒప్పందం చేసుకోవడం నిబంధనలకు విరుద్ధమని న్యాయ, ఆర్థిక శాఖలు స్పష్టంగా చెప్పాయి. గతంలో జారీ చేసిన జీవో–179కు వ్యతిరేకమని పేర్కొన్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. రాయితీ, అభివృద్ధి ఒప్పందం అంటే... రాయితీ, అభివృద్ధి ఒప్పందం అంటే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో సింగపూర్ కన్సార్టియంకు ఇవ్వాల్సిన 1,691 ఎకరాలతో పాటు ఆ కన్సార్టియంకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన నిబంధనలు, చెల్లించాల్సిన పెనాల్టీలు, అలాగే సింగపూర్ కన్సార్టియం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్న రెవెన్యూ తదితర అంశాలు ఉంటాయి. స్టార్టప్ ఏరియా ద్వారా మూడు దశల్లో సింగపూర్ కన్సార్టియం రూ. 5,768.60 కోట్లు పొందుతుంది. అవే మూడు దశల్లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.446 కోట్లు మాత్రమే రెవెన్యూ కింద వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్ కన్సార్టియం ఏమేమి చేయాలో ఈ ఒప్పందంలో ఉంటుంది. కంపెనీ ఎలా మారుస్తారు?: ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే తొలుత సింగపూర్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జీటూజీ ఒప్పందం చేసుకున్న తరువాత సింగపూర్ ప్రైవేట్ కంపెనీలను రంగంలోకి దించడమే తప్పు. ఇప్పుడు రాయితీ, అభివృద్ధి, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్లపై సింగపూర్ కన్సార్టియం సంతకం చేయకుండా మరో ప్రైవేట్ కంపెనీని ఏర్పాటుచేసి ఆ కంపెనీతో ఒప్పందంపై సంతకాలు చేయిస్తామనడం వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉంది. ఈ విధంగా సింగపూర్ ప్రైవేట్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాపారాలపై కేంద్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సింగపూర్ కంపెనీలు పెట్టిన షరతులకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు పెట్టలేదు. దీనివల్ల భవిష్యత్‌లో సింగపూర్ కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఇది రాష్ట్రానికి నష్టం. స్విస్‌చాలెంజ్ పేరుకు మాత్రమే. ఇప్పటికే నామినేషన్‌పై సింగపూర్ కన్సార్టియంకు 1,691 ఎకరాలను అప్పగించారు. సింగపూర్ కంపెనీల పేరుతో రైతుల భూముల, వారి శ్రమను దోచుకోవడం తప్ప భూములిచ్చిన రైతులకు ఇప్పటివరకు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆంధ్రుల రాజధాని అమరావతిని సింగపూర్ ప్రభుత్వం నిర్మిస్తుందని సినిమా చూపించారు. జీ టూ జీ (ప్రభుత్వానికి, ప్రభుత్వానికీ మధ్య) ఒప్పందం అన్నారు. క్రమంగా సింగపూర్ ప్రభుత్వం అదృశ్యమై మూడు ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం ముందుకొచ్చింది. స్విస్ చాలెంజ్ పేరుతో ప్రతిపాదనలు ఇచ్చింది. 1,691 ఎకరాలను వారికి ధారాదత్తం చేసింది మన ప్రభుత్వం. సింగపూర్ వారి షరతులన్నింటికీ తల ఊపింది. రాయితీ, అభివృద్ధి ఒప్పందం, షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్లపై ఆ కన్సార్టియం సంతకం చేయాల్సి ఉంది. కానీ, స్క్రీన్ ప్లే మళ్లీ మారింది. కేవలం తొమ్మిది మంది ఉద్యోగులు పనిచేసే ఒక చోటా కంపెనీని కన్సార్టియం ముందుకు తెచ్చింది. ఒప్పంద సంతకాలు ఆ చోటా కంపెనీయే చేస్తుందట. ముసుగు తొలగడంలేదూ?.. వేల మంది రైతులూ, కూలీల చెమట చుక్కలతో తడిసి పునీతమైన బంగారు భూమి బేహారుల క్రీడా స్థలంగా మారబోతోంది. ప్రభుత్వ పెద్దల ధనాశ ఐదు కోట్ల మంది మధుర స్వప్నాన్ని పీడ కలగా మార్చబోతోంది. -
ముగిసిన ఏపీ కేబినేట్ సమావేశం
విజయవాడ: కొన్ని చట్టాలను సవరించేందుకు మంగళవారం సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినేట్ మీటింగ్ ముగిసింది. ఏపీ ఐడీఈ చట్టం, ఇన్ ఫ్రా అథారిటీ, స్విస్ చాలెంజ్ విధానాల్లో సవరణల కోసం సమావేశమైన కేబినేట్ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ఐడీఈలో చట్టాన్ని సవరించేందుకు కేబినేట్ ఆమోదం వేసింది. రాజధాని నిర్మాణానికి స్విస్ చాలెంజ్ పద్దతిలో సింగపూర్ కంపెనీలకు ఉన్న అడ్డంకులను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో ఆర్డినెన్స్ జారీ చేయనుంది. నకిలీ విత్తనాల కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కేబినేట్ నిర్ణయించింది. -
ఆంధ్రప్రదేశ్‌ను అమ్మేస్తున్నారు : బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో సీఎం చంద్రబాబు అమ్మకానికి పెట్టారని, స్విస్ చాలెంజ్ విధానం వెనుక వేల కోట్ల దోపిడీ ఉందని శాసనసభ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాల క్రితం సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు తరిమెల నాగిరెడ్డి ‘తాక ట్టులో భారతదేశం’ అనే పుస్తకాన్ని రచించారని ప్రస్తుతం ఏపీలో పరిణామాలు చూస్తూంటే ‘ఏపీ అమ్ముడు పోయింది’ అనే పుస్తకం రాయాల్సినంతగా ఉన్నాయని అన్నారు. అసలది స్విస్ చాలెంజ్ కాదు, ఒక పథకం ప్రకారం చేస్తున్న పని అని, దీన్ని ‘చంద్రన్న చాలెంజ్’ అనడం మేలన్నారు. పూచీకత్తు లేకుండా అమరావతి అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో ఏర్పాటు చేసిన సంస్థలో 58 శాతం సింగపూర్ కన్సార్టియంకు, 42 శాతం ఏపీ ప్రభుత్వానికి వాటాలు ఉండటంతోనే విదేశీ కంపెనీలకు దాసోహమయ్యారనే విషయం తెలుస్తోందన్నారు. ఏ కారణం చేత రాజధాని నిర్మాణం ఆగినా అందుకు చెల్లించాల్సిన మొత్తాలకూ బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అని రాసుకోవడం విచిత్రమన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు స్విస్ చాలెంజ్‌కు వ్యతిరేకంమనీ, అందులోని నిబంధనలు కూడా అనుసరించలేదన్నారు. స్విస్ చాలెంజ్ పద్ధతి ప్రకారం (అన్‌సొలిసిటెడ్) ఎవరూ కోరకపోయినా.. నిర్మాణాలకు సంస్థలే ముందుకు రావాలని.. కానీ రాష్ట్రమే సింగపూర్ కంపెనీలకు మార్చి 22న లేఖ రాసిందని చెప్పారు. -
'స్విస్ చాలెంజ్ కాదు చంద్రన్న చాలెంజ్'
హైదరాబాద్: స్విస్ చాలెంజ్ పేరుతో సింగపూర్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. విదేశీ కంపెనీలకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. తనవాళ్లకు మేలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి నిర్మాణంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. సింగపూర్ కంపెనీలతో కలిసి ఏర్పాటు అమరావతి డెవలప్ మెంట్ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతోందని బుగ్గన గణాంకసహింతగా వివరించారు. సింగపూర్ కంపెనీలు చేసేవి కేవలం భూముల వ్యాపారం మాత్రమేనని తెలిపారు. సింగపూర్ కంపెనీలకు అన్నివిధాలా మేలు చేసే సౌకర్యాలు కల్పించినా వారు పెట్టే పెట్టుబడులు మాత్రం నామమాత్రమని చెప్పారు. భారతదేశ చట్టాల్లో లేనివిధంగా సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు సర్కారు ఒప్పందాలు చేసుకుందన్నారు. ఈ ఒప్పందాలేవీ భారతదేశ నిబంధనలకు అనుకూలంగా లేవన్నారు. అప్పులు ఆంధ్రప్రదేశ్ కు.. లాభాలకు సింగపూర్ కు తరహాలో ఒప్పందాలున్నాయన్నారు. మన ఒప్పందాలు చూసి మిగతా రాష్ట్రాలు నవ్వుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. ఎన్నో సంస్థలు పెట్టి ప్రజలను గందరగోళారికి గురి చేస్తున్నారని వాపోయారు. అయినవారికి మేలు చేసేందుకు ఏ నుంచి జడ్ వరకు అన్ని అక్షరాలు వాడుకుని ఇష్టమొచ్చినట్టుగా సంస్థలు స్థాపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సింగపూర్ కంపెనీలు అల్లుళ్ల కంటే ఎక్కువై కూర్చుకున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో తరిమెల నాగిరెడ్డి 'తాకట్టులో భారతదేశం' అనే పుస్తకం రాశారని ఇప్పుడు ఎవరైనా పుస్తకం రాస్తే 'అమ్మకానికి ఆంధ్రప్రదేశ్' అని పేరు పెడతారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. -
'స్విస్ చాలెంజ్ కాదు చంద్రన్న చాలెంజ్'
-
స్విస్ ఛాలెంజ్ పద్ధతిలోనే నిర్మాణాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో 1,691 ఎకరాల్లో నిర్మాణాలను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ సింగపూర్ కంపెనీలకు ఇంకా భూములను అప్పగించలేదన్నారు. సింగపూర్ కంపెనీలు డీపీఆర్ (సమగ్ర కార్యాచరణ ప్రణాళిక) మాత్రమే ఇచ్చాయని డీపీఆర్‌పై ఓపెన్ టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు. జాతీయ కంపెనీలు కూడా టెండర్లలో పాల్గొనవచ్చని నారాయణ పేర్కొన్నారు. -
ఇది గో ‘సహజ’ నగరం
- జరీబు భూముల్ని సాగుకు వినియోగిస్తూనే సహజసిద్ధ రాజధాని నిర్మాణం - మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేసిన నేచురల్ సిటీ విధానకర్తలు - సింగపూర్ మాస్టర్‌ప్లాన్ ప్రకారమైతే పెను నష్టం - భావి తరాల పొట్టగొట్టినవాళ్లమవుతాం.. - సింగపూర్ మాస్టర్ ప్లాన్‌ను తాము స్విస్ చాలెంజ్ చేస్తున్నామని ప్రకటన సాక్షి, అమరావతి : రాష్ట్ర రాజధాని అమరావతిని సింగపూర్ కంపెనీలు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మిస్తే ప్రకృతి సహజసిద్ధమైన వనరులు కనుమరుగై భావితరాల పొట్టగొట్టినవాళ్లమవుతామని ప్రొఫెసర్ విక్రం సోనీ హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన కృష్ణానది పరీవాహక జరీబు భూములను వ్యవసాయానికి వినియోగిస్తూనే ప్రభుత్వం సేకరించిన భూమిలో సహజసిద్ధ నగరాన్ని ఎలా నిర్మించుకోవచ్చో వివరిస్తూ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్లు, నేచురల్ సిటీ విధానకర్తలు విక్రం సోనీ, రోమి ఖోస్లాలు అమరావతి మాస్టర్‌ప్లాన్ తయారుచేశారు. ప్రకృతి సహజవనరులను కాపాడుకుంటూ ఆహార భద్రత, పర్యావరణ హితంతో కూడిన రాజధాని మాస్టర్ ప్లాన్‌ను వారు రూపొందించారు. దీన్ని మంగళవారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా విక్రం సోనీ మాట్లాడుతూ... కృష్ణానది వరదల సమయంలో కొట్టుకువచ్చే ఒండ్రుమట్టి, ఇసుక వల్ల ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరగడమే కాకుండా ఏడాది పొడవునా 300 రకాల పంటలు పండుతున్నాయన్నారు. ఇలాంటి సారవంతమైన జరీబు భూముల్లో కోర్ కేపిటల్ నిర్మించతలపెట్టడాన్ని సమాజహితం కోరే ఏ ఒక్కరూ సమ్మతించరని చెప్పారు. నది ఒడ్డు నుంచి మూడు కిలోమీటర్లు వదిలి రాజధాని నిర్మించుకుంటే నగరానికి కావాల్సిన నీరు, వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఎవరిపైనా ఆధారపడనక్కర్లేదన్నారు. దీనివల్ల కేవలం భూగర్భజలాల రూపంలో ఏటా రూ. 900 కోట్ల విలువైన నీటిని ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఇలా మూడు కిలోమీటర్లు వదిలి నగరాన్ని కట్టడం వల్ల అంతర్గత ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు, బహిరంగంగా నాలుగు డిగ్రీలు తగ్గుతాయని ఆయన వెల్లడించారు. హరప్పా నగరాన్నే కట్టిన ఘనత మనది ఇప్పుడు కృత్రిమంగా నిర్మించే ఆకాశహర్మ్యాల నగరాలకు కాలం చెల్లిందని, ఉపాధి, వ్యవసాయంతో కూడిన నగరాల నిర్మాణాలవైపు ప్రపంచం నడుస్తోందని ఈ మాస్టర్ ప్లాన్ ఆర్కిటెక్‌లో పాలుపంచుకున్న సచిన్ జైన్ చెప్పారు. యూరప్‌లో ఇప్పుడు సహజ నగరాల నిర్మాణానికి డిమాండ్ పెరిగిందన్నారు. భారతీయులకు నగరాలు నిర్మించిన అనుభవం లేదని, మురికికూపాలు మాత్రమే కడతారంటూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకాన్ని తెలియచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఏళ్ల క్రితమే హరప్పా నగరాన్ని సృష్టించిన చరిత్ర భారతీయులకు ఉందన్నారు. ఈ మధ్యనే ప్రకృతిని కాపాడుకుంటూ ఎకరం వ్యవసాయ భూమి తీసుకోకుండా చండీగఢ్ నగరాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామని గుర్తుచేశారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా వ్యవసాయ రంగాన్ని ప్రతిబిం బించే విధంగా ఉండాలని చండీగఢ్ నగర నిర్మాణంలో పాలుపంచుకున్న విశ్రాంత ఐఏఎస్ ఎం.జి.దేవసహాయం చెప్పారు. భవనాలను ఇక్కడ కాకపోతే మరోచోటైనా కట్టుకోగలమని, కానీ ఇంతటి సారవంతమైన భూములను మరోచోట సృష్టించగలమా అన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని సూచించా రు. ప్రతి నాలుగు చదరపు కిలోమీటర్లను ఒక సెక్టర్‌గా విడదీస్తూ ఒక సెక్టర్లో వ్యవసాయం, మరో సెక్టర్లో నగరాన్ని నిర్మించే విధంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించామన్నారు. సింగపూర్ ఇచ్చిన ప్లాన్‌కంటే ఇది అద్భుతంగా ఉందని, ప్రభుత్వం నిజంగా స్విస్ చాలెంజ్ విధానం అమలుచేస్తే తమ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని చర్చకు రావాలని దేవసహాయం ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పప్పుబెల్లాల్లా కట్టబెడుతున్నారు ఢిల్లీ ప్రొఫెసర్లు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేసిన అనంతరం వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ... రైతుల త్యాగాన్ని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి క్విడ్‌ప్రోకో కింద సింగపూర్ కంపెనీలకు పప్పుబెల్లాల్లా కట్టబెడుతోందని దుయ్యబట్టారు. మొన్న ఉత్తరాఖండ్‌లో రెండు గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షం కురిస్తేనే ఆ రాష్ట్రం అతలాకుతలమైందని, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వరదముంపు ప్రాంతంలో కోర్ కేపిటల్ ఏవిధం గా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి రెండు నెలల సమయం ఇస్తున్నామని, అప్పటికీ దారిలోకి రాకపోతే రైతులతో కలిసి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నట్లు రైతు అనుమోలు గాంధీ తెలిపారు. కార్యక్రమంలో రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
సింగపూర్ సంస్థలు కోరినట్టే..!
-
సింగపూర్ సంస్థలు కోరినట్టే..!
♦ ఏపీ రాజధాని భూములపై పూర్తి హక్కులు వాటికే! ♦ లీజు హక్కులు 99 ఏళ్లకు పెంపు ♦ నేడు చట్ట సవరణ బిల్లుకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్‌లో సేకరించిన కోట్ల రూపాయల విలువైన భూములను సింగపూర్ ప్రైవేట్ సంస్థలు కోరినట్లుగా అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్ కన్సార్టియంను ఎంపిక చేయాలని ప్రభుత్వ పెద్దలు ముందుగానే నిర్ణయించుకున్నారు. తొలిదశలో మూడు వేల ఎకరాలను ఇస్తే అభివృద్ధి చేస్తామని, ఆ భూమిపై పూర్తి హక్కులు కల్పించాలని అసెండాస్ సంస్థ ప్రభుత్వ పెద్దలను కోరింది. దీనిపై వారు అసెండాస్ ప్రతినిధులతో బేరసారాలు జరిపారు. సింగపూర్ సంస్థ కోరినట్లు భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు వీలుగా ఏపీ మౌలిక సదుపాయాల అభివృద్ధి చట్టంలో సవరణలు తేవాలని నిర్ణయించారు. వీటిని ఇప్పటికే ఆర్డినెన్స్ ద్వారా తె చ్చారు. ఇప్పుడు ఆర్డినెన్స్ స్థానే చట్ట సవరణకు అసెంబ్లీలో బిల్లును శనివారం ప్రవేశపెట్టారు. ఆ బిల్లును సోమవారం ఆమోదించనున్నారు. 2001లో చేసిన చట్టంలో పరిశ్రమలకు, ఇతర ప్రాజెక్టులకు కేటాయించే భూములను 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలనే నిబంధన మాత్రమే ఉంది. ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు వీల్లేదు. అయితే ఇప్పుడు పూర్తి హక్కులు సింగపూర్ ప్రైవేట్ సంస్థలకు కల్పించడంతో పాటు లీజు కాలాన్ని 99 ఏళ్లకు పొడిగిస్తూ సవరణలు చేస్తున్నారు. అలాగే లీజుకాకుండా మొత్తానికి విక్రయించేందుకు వీలుగా చట్టంలో నిబంధనలను కల్పించారు. మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక కానున్న అసెండాస్ సంస్థ ఐదు దశల్లో రాజధాని అభివృద్ధిని 25 -30 ఏళ్లలో పూర్తి చేస్తామని, ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించాలని, మధ్యలో మరో సంస్థలు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టరాదని ప్రభుత్వ పెద్దలకు స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు చట్టంలో సవరణలు తెస్తున్నారు. -
సింగపూర్‌కు రాజదాని భూములు కట్టబెట్టదు
-
అసలేం జరుగుతుంది....?
-
ప్రజా రాజధాని ముసుగులో పెద్ద కుంభకోణం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రాజధాని ముసుగులో పెద్ద కుంభకోణం జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. సీమాంధ్ర...స్కాముల రాష్ట్రంలా మారుతోందని ఆయన వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ శుక్రవారం పార్టీ కేంద్ర కారాల్యయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో పంచభూతాలను కూడా కబ్జా చేస్తున్నారని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందంటూ ప్రశ్నించారు. సింగపూర్ కంపెనీ ప్రతిపాదనలు నష్టదాయకమని, ఆ కంపెనీకి ఏ ప్రాతిపదికన భూములు ఇస్తారని ఆయన అన్నారు. తాము గతంలోనే సింగపూర్ సంస్థలకు భూముల ప్రతిపాదనను వ్యతిరేకించామని బొత్స ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇసుక నుంచి ప్రతిదీ కుంభకోణాలమయంగా మారిందని ఆయన విమర్శించారు. -
సింగపూర్ కంపెనీలకు ఏపీ సర్కార్ భూసంతర్పణ
-
శంకుస్థాపన ముగిసింది... ఇక భూ సంతర్పణే
⇒ కావాల్సిన సింగపూర్ సంస్థకు అమరావతిని అప్పగించేందుకు రంగం సిద్ధం ⇒ గ్లోబల్ టెండర్లను పిలవకుండానే విదేశీ సంస్థకు రాజధాని అప్పగింత ⇒ ముందు అనుకున్న ప్రకారమే ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేసిన అసెండాస్-సెమ్బ్‌కార్ప్ కన్సార్టియం ⇒ త్వరలోనే బిడ్ దాఖలు చేయనున్న కన్సార్టియం ⇒ తొలిదశలో మూడు వేల ఎకరాల సీడ్ కేపిటల్ అప్పగింత ⇒ అందులో 250 ఎకరాలు ఉచితంగా సింగపూర్ కంపెనీలకు.. ⇒ ఇందులో ఐకానిక్ కాంప్లెక్స్‌లు నిర్మించి అమ్ముకునేలా వీలు.. ⇒ మిగిలిన 2,750 ఎకరాల అభివృద్ధికి అయిన వ్యయం చార్జీల రూపంలో వసూలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరానికి శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో ఇక సింగపూర్ సంస్థలకు భూములను కట్టబెట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తొలి విడతగా రాజధాని సీడ్ ఏరియా (రాజధాని ప్రధాన ప్రాంతం)లోని భూములను సింగపూర్‌కు చెందిన ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించబోతోంది. రాజధాని నిర్మాణం వంటి అతిపెద్ద ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఈ ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి దాన్ని స్విస్ చాలెంజ్ పద్ధతిలో అయిన వారికి కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దానికి అనుగుణంగానే సింగపూర్‌కు చెందిన అసెండాస్ గ్రూప్, సెమ్బ్‌కార్ప్ కంపెనీలు ప్రణాళికాబద్ధంగా తెరమీదకొస్తున్నాయి. అనుకున్న ప్రకారమే సీడ్ ఏరియా (రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం భవనాలు నిర్మించే ప్రధాన ప్రాంతం) నిర్మాణానికి సింగపూర్ దేశానికి చెందిన ప్రైవేటు సంస్థలు అసెండాస్-సిన్బ్రిడ్జ్ గ్రూపు, సెమ్బ్‌కార్ప్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఒక కన్సార్టియంగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణను దాఖలు చేశాయి. ఈ విషయాన్ని సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. సింగపూర్‌కు చెందిన ప్రైవేటు సంస్థలు సుర్బానా, జురాంగ్‌లు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ పరిధిలో ఇదివరకే, మూడు విడతల్లో మాస్టర్ ప్రణాళికలు అందజేసిన విషయం తెలిసిందే. ఆ ప్రణాళికల ఆధారంగా మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్-సిన్బ్రిడ్జ్ గ్రూపు, సెమ్బ్కార్ప్లు ఒక కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ఆ మాస్టర్ ప్రణాళికల ఆధారంగా తొలివిడతగా సీడ్ ఏరియాను అభివృద్ధి పరిచే పేరుతో ఈ కన్సార్టియానికి ప్రభుత్వం త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వబోతోంది. అమరావతి శంకుస్థాపనకు వచ్చే రోజున సింగపూర్ మంత్రి ఈశ్వరన్ దీన్ని ఒక ప్రకటన ద్వారా బహిర్గతం చేశారు. అంతా గోప్యంగానే..: సీడ్ ఏరియా అభివృద్ధి పేరుతో అసెండాస్ గ్రూపు, సెమ్బ్‌కార్ప్ కన్సార్టియంకు తొలి దశలో 3 వేల ఎకరాలను అప్పగిస్తారు. దాన్ని సీఆర్డీఏ-సింగపూర్ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్లో అభివృద్ధి చేయాలి. ప్రతిఫలంగా అమరావతిలోని కీలకమైన రాజధాని ప్రాంతంలో సింగపూర్ (కన్సార్టియంకు) కంపెనీలకు 250 ఎకరాలను ఉచితంగా కేటాయిస్తారు. అలా ఇచ్చిన 250 ఎకరాల్లో సింగపూర్ కంపెనీలు ఐకానిక్ కాంప్లెక్స్‌లను (భారీ భవనాలను) నిర్మించి అందులో చదరపు అడుగుల చొప్పున అమ్ముకునేలా, అవి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వీలు కల్పిస్తారు. 250 ఎకరాలను ఉచితంగా ఇవ్వడమే కాకుండా తొలి దశలో మిగిలిన 2,750 ఎకరాల అభివృద్ధికి అయిన వ్యయాన్ని అభివృద్ధి చార్జీల రూపంలో సింగపూర్ కంపెనీలు వసూలు చేస్తాయి. ఈ ఖర్చును ఏ రూపంలో వసూలు చేయాలన్న అంశాన్ని ఆ కంపెనీలు దాఖలు చేసే బిడ్‌లో పేర్కొంటాయని చెబుతున్నారు. మరోవైపు కొత్త రాజధానిలో భూముల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో సింగపూర్ కంపెనీలకు వాటా కూడా ఇవ్వనున్నారు. తొలి దశ రాజధాని అభివృద్ధి 2018 అక్టోబర్ నాటికి పూర్తి చేయడానికి ఈ కన్సార్షియం ఆమోదించినట్టు సమాచారం.జాయింట్ వెంచర్లో సభ్యులుగా ప్రభుత్వానికి చెందిన వారితో సమానంగా కంపెనీకి చెందిన వారుండాలని అసెండాస్-సెమ్బ్‌కార్ప్ కన్సార్టియం ప్రభుత్వానికిచ్చిన ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (ఆసక్తి వ్యక్తీకరణ) లో పేర్కొన్నట్టు అధికారవర్గాలు చెప్పాయి. రాజధాని ప్రాంత అభివృద్ధి సమయంలో మధ్యమధ్యలో ఎదురయ్యే సమస్యలు, అదనపు భారాలకు బాధ్యత వహించడానికి అంగీకరించేది లేదని కన్సార్టియం స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ కన్సార్టియం ప్రభుత్వం ముందు పలు షరతులను పెట్టగా, ప్రభుత్వం అంగీకరించినట్టు అధికారవర్గాలు చెప్పాయి. కొన్నింటికి అంగీకరించేది లేదని చెప్పినప్పటికీ, ఇటీవల సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సింగపూర్‌లో పర్యటించిన సందర్భంగా వాటిలో అనేక సడలింపులిచ్చి, సింగపూర్ కంపెనీలు పేర్కొన్న షరతులకు అంగీకరించినట్టు విశ్వసనీయ సమాచారం. సింగపూర్ పర్యటనలో జరిపిన సంప్రదింపుల సమయంలోనే అసెండాస్ గ్రూపు-సెమ్బ్‌కార్ప్ కన్సార్టియంను మాస్టర్ డెవలపర్‌గా బిడ్ దాఖలు చేస్తాయని సింగపూర్ ప్రతినిధులు సీఎంకు తెలియజేశారు. దాని సమగ్ర ప్రణాళికను కూడా ఆయనకు వివరించారు. ఈ అంశాలనే ఇటీవల విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో సీఎం తెలియజేశారు. ఆ కన్సార్టియం ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేసిన నేపథ్యంలో మాస్టర్ డెవలపర్‌గా బిడ్‌ను దాఖలు చేస్తుంది. స్విస్ చాలెంజ్‌లో కొన్ని ప్రక్రియల అనంతరం సర్కార్ ఓకే చేస్తుంది. ముందు నుంచీ చెబుతున్న ‘సాక్షి’ సింగపూర్‌కు చెందిన ప్రైవేటు కంపెనీలు అసెండాస్-సిన్బ్రిడ్జ్ గ్రూపు, సెమ్బ్కార్ప్లు కలసి ఒక కన్సార్షియంగా రాజధానిలో మాస్టర్ డెవలపర్‌గా అడుగుపెట్టబోతున్నాయని ‘సాక్షి’ మొదటి నుంచీ చెబుతోంది. ఆ కన్సార్టియమే ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేసినట్టు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ నెల 22న విడుదల చేసిన ఒక ప్రకటనలో స్వయంగా అంగీకరించారు. సింగపూర్ కంపెనీల మాయాజాలం సింగపూర్ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ (ఐఈ) సంస్థ ప్రపంచవ్యాప్తంగా (ప్రధానంగా ఆసియా దేశాల్లో) ప్రాజెక్టులను తీసుకుని ఆ దేశంలోని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించడంలో మధ్యవర్తిగా పనిచేస్తోంది. వివిధ దేశాల్లో ప్రాజెక్టులకు అనుగుణంగా సింగపూర్‌లోని ఆయా ప్రైవేటు కంపెనీలకు బిజినెస్ సమకూర్చుతోంది. ఆ క్రమంలోనే రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రణాళికను రూపొందించే పేరుతో అది ఆంధ్రప్రదేశ్‌లోనూ అడుగుపెట్టింది. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి గత ఏడాది డిసెంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. అప్పట్లో సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని, ఉచితంగా మాస్టర్ ప్లాన్ సమర్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ మాత్రం మాస్టర్ ప్లాన్ల తయారీ బాధ్యతను సింగపూర్‌లోని ప్రైవేటు కంపెనీలు సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ, జురాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌లకు అప్పగించింది. ఆ కంపెనీలు మూడు విడతల్లో మాస్టర్ ప్లాన్లను అందజేశాయి. ఆ ప్లాన్ల మేరకు రాజధానిని అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ అసెండాస్, సిన్బ్రిడ్జ్ గ్రూపు, సెమ్బ్కార్ప్లు ఒక కన్సార్టియంగా ఏర్పడి ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ సమర్పించాయి. సింగపూర్ కంపెనీలు ఇప్పటివరకు చిన్నచిన్న ఎస్ఈజెడ్లు అభివృద్ధి చేయడం మినహా ఆంధ్రప్రదేశ్ రాజధాని వంటి పెద్ద ప్రాజెక్టులు చేసిన అనుభవం వాటికి లేదు. వేలాది ఎకరాల భూముల్లో రాష్ట్ర రాజధాని అభివృద్ధి ప్రాజెక్టును అప్పగించడానికి ప్రభుత్వ పెద్దలు ముందుగానే అంతర్గత చర్చలు జరిపి, అవగాహన కుదుర్చుకున్న నేపథ్యంలో సింగపూర్‌లోని ప్రైవేటు కంపెనీలన్నీ తమ బిజినెస్ కోసం ఒక్కొక్కటిగా విలీనమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాజెక్టు లభిస్తుందన్న ముందస్తు గ్యారంటీతో సింగపూర్‌లోని అసెం డాస్ ప్రైవేట్ లిమిటెడ్, సిన్బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు రెండూ ఈ ఏడాది జూన్ 10న విలీనమయ్యాయి. అసెండాస్-సిన్బ్రిడ్జ్ గ్రూపు పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ విలీనానికి ముందు సింగపూర్‌కు చెందిన టెమాసెక్, జేటీసీ కార్పొరేషన్ సంస్థలు విలీనమయ్యాయి. ఈ గ్రూపు తరఫున అసెండాస్-సిన్బ్రిడ్జ్ గ్రూపులో 49 శాతం వాటా కలిగివుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు మూ డు విడతల్లో మాస్టర్ ప్లాన్లు రూపొందించిన సుర్బానా, జురాంగ్ కంపెనీలు కూడా విలీన మై సుర్బానా-జేఏహెచ్ పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కంపెనీలన్నీ ప్రధానంగా పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ, బిజినెస్, సైన్స్ పార్కుల నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పనిచేస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో ఈ కం పెనీలు పరస్పరం సహకరించుకుంటాయి. కొసమెరుపేంటంటే... మాస్టర్ ప్లాన్లు తయా రు చేయడానికి సుర్బానా, జురాంగ్ల చార్జీలు మాస్టర్ డెవలపర్‌గా ఎంపికైన కంపెనీ బిడ్‌లో అంతర్లీనంగా దాగి ఉంటుంది. తదనంతరం చార్జీల రూపంలో వసూలు చేసి ఆయా కంపెనీలకు చెల్లిస్తుంది. -
పాలనలోనూ సింగపూర్ జోక్యం
‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టులో సింగపూర్ సంస్థలకు భాగస్వామ్యం! సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణంలో అంతా తామై వ్యవహరిస్తున్న సింగపూర్ సంస్థలు ఇకపై పాలనా వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోనున్నాయి. ‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టులో సింగపూర్ సంస్థల సాంకేతిక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల ద్వారా సిటిజన్ చార్టర్‌తో పాటు సమాచార వ్యవస్థ మొత్తం సింగపూర్ ప్రభుత్వం తెలుసుకోనుంది. అలాగే రాష్ట్రంలో అమలు చేసే ఈ-గవర్నెన్స్‌లోనూ సింగపూర్ భాగస్వామ్యం వహించబోతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయని ‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకుగానూ రూ.2,358 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు బాధ్యతల్ని సింగపూర్ సంస్థలతో పాటు విప్రో పర్యవేక్షించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గాను ఈ-ప్రగతి ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. సింగపూర్ సంస్థల సహకారంతో దీనిని అమలు చేయనుంది. అంటే మన రాష్ట్రంలో ప్రజల వివరాలతో కూడిన డేటా బేస్, వారి సామాజిక-ఆర్థిక స్థితిగతులు సింగపూర్ ప్రభుత్వానికి తెలిసిపోతాయి. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన 150 ఏళ్ల డేటాను ఇప్పటికే ఏపీ సర్కారు సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించింది. ఇన్నేళ్ల రాష్ట్ర డేటా కోరుతుండటంపై అప్పట్లోనే అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ఈ విషయాన్ని సమర్థించుకున్నారు. కేవలం సింగపూర్ ప్రభుత్వ పరిశీలన కోసమే ఈ డేటా అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాగా, రూ.2,358 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో రూ.1,528 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుండగా, మిగిలిన సుమారు రూ.వెయ్యి కోట్లను పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్) విధానంలో సమీకరించేందుకు యోచిస్తున్నారు. -
చంద్రబాబు చేతికి 'రాజధాని మాస్టర్ ప్లాన్'
-
చంద్రబాబు చేతికి 'రాజధాని మాస్టర్ ప్లాన్'
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర(కేపిటల్ సిటీ) మాస్టర్‌ప్లాన్‌ను ఈశ్వరన్ సమర్పించారు. ఇప్పటికే సింగపూర్ కంపెనీలు రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్‌ప్లాన్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. రాజధాని మాస్టర్ ప్లాన్‌పై కాసేపట్లో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. చంద్రబాబుతో పాటు సింగపూర్ ప్రతినిధులు పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటల వరకూ ఈ రాజధాని హైలెవల్ కమిటీ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశంలో మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అంశాలపై చర్చిస్తారు. అలాగే భూములు ఇచ్చిన రైతులకు సమీప గ్రామాల్లో భూములను ఏపీ సర్కార్ కేటాయించనుంది. అలాగే మాస్టర్ ప్లాన్‌పై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించనుంది. -
నేడు సర్కారుకు రాజధాని మాస్టర్‌ప్లాన్
* హైదరాబాద్ చేరిన సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ * నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఉన్నతస్థాయి భేటీ * అభ్యంతరాలు వెలిబుచ్చేందుకు నెలరోజుల గడువిచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర(కేపిటల్ సిటీ) మాస్టర్‌ప్లాన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందనుంది. ఈ మాస్టర్‌ప్లాన్‌ను తీసుకుని సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈశ్వరన్, ఆయనతోపాటు వచ్చిన సింగపూర్ కంపెనీల ప్రతినిధులు రాత్రికి ప్రైవేట్ హోటల్లో బస చేశారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సచివాలయంలో ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలసి ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈశ్వరన్ కేపిటిల్ సిటీ మాస్టర్‌ప్లాన్‌ను ఏపీ సీఎంకు సమర్పిస్తారు. ఆ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అంశాలపై చర్చిస్తారు. ఇప్పటికే సింగపూర్ కంపెనీలు రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్‌ప్లాన్‌ను రాష్ట్రప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. సోమవారం కేపిటల్ సిటీ మాస్టర్‌ప్లాన్‌ను సమర్పించనుందని ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సింగపూర్ సమర్పించిన సిటీ కేపిటల్ మాస్టర్ ప్రణాళికపై రాష్ట్రప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుందని, అందులో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సివస్తే సూచిస్తుందని, అందుకు అనుగుణంగా మార్పులు చేశాకనే సిటీ కేపిటల్ మాస్టర్ ప్రణాళికను ప్రజల ముందుంచుతామని పరకాల తెలిపారు. కేపిటల్ సిటీ మాస్టర్ ప్రణాళికను సమర్పించడంతో ఇక స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపికపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేశాక ఆ మాస్టర్ డెవలపర్ వివిధ కంపెనీల నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా పెట్టుబడులను తీసుకువస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో కంపెనీలు పనిచేస్తాయని పరకాల చెప్పారు. ఇక సింగపూర్ సీడ్ కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌ను మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఈశ్వరన్‌లు ఉన్నతస్థాయి సమావేశానంతరం విలేకరులతో మాట్లాడతారన్నారు. కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌కు తుది రూపమిచ్చాక దానిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల కోసం ప్రభుత్వం నోటిఫై చేయనుంది. నోటిఫై చేసిన తేదీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి నెల రోజులపాటు సమయమివ్వనున్నారు. ఇరువురు నేతల మధ్య ప్రైవేట్ భేటీ ఇదిలా ఉండగా సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య సోమవారం ప్రైవేట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో వారిద్దరే ఉంటారు. స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ బాధ్యతలను కూడా సింగపూర్ సంస్థలకే అప్పగించాలని నిర్ణయించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ఈశ్వరన్ ప్రైవేట్ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. ఈ భేటీలో ఎటువంటి రహస్య అవగాహనలు చేసుకుంటారో ఎవరికీ తెలియదు. వారిద్దరి మధ్య మాత్రమే ఆ రహస్య భేటీ వ్యవహారాలు ఉంటాయి.