'స్విస్ చాలెంజ్ కాదు చంద్రన్న చాలెంజ్'
హైదరాబాద్: స్విస్ చాలెంజ్ పేరుతో సింగపూర్ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ధారాదత్తం చేస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. విదేశీ కంపెనీలకు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. తనవాళ్లకు మేలు చేసేందుకు సీఎం చంద్రబాబు ఇదంతా చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.
అమరావతి నిర్మాణంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని తెలిపారు. సింగపూర్ కంపెనీలతో కలిసి ఏర్పాటు అమరావతి డెవలప్ మెంట్ ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీవ్రనష్టం జరుగుతోందని బుగ్గన గణాంకసహింతగా వివరించారు. సింగపూర్ కంపెనీలు చేసేవి కేవలం భూముల వ్యాపారం మాత్రమేనని తెలిపారు. సింగపూర్ కంపెనీలకు అన్నివిధాలా మేలు చేసే సౌకర్యాలు కల్పించినా వారు పెట్టే పెట్టుబడులు మాత్రం నామమాత్రమని చెప్పారు. భారతదేశ చట్టాల్లో లేనివిధంగా సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు సర్కారు ఒప్పందాలు చేసుకుందన్నారు. ఈ ఒప్పందాలేవీ భారతదేశ నిబంధనలకు అనుకూలంగా లేవన్నారు. అప్పులు ఆంధ్రప్రదేశ్ కు.. లాభాలకు సింగపూర్ కు తరహాలో ఒప్పందాలున్నాయన్నారు.
మన ఒప్పందాలు చూసి మిగతా రాష్ట్రాలు నవ్వుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. ఎన్నో సంస్థలు పెట్టి ప్రజలను గందరగోళారికి గురి చేస్తున్నారని వాపోయారు. అయినవారికి మేలు చేసేందుకు ఏ నుంచి జడ్ వరకు అన్ని అక్షరాలు వాడుకుని ఇష్టమొచ్చినట్టుగా సంస్థలు స్థాపిస్తున్నారని ఎద్దేవా చేశారు. సింగపూర్ కంపెనీలు అల్లుళ్ల కంటే ఎక్కువై కూర్చుకున్నాయని వ్యాఖ్యానించారు. గతంలో తరిమెల నాగిరెడ్డి 'తాకట్టులో భారతదేశం' అనే పుస్తకం రాశారని ఇప్పుడు ఎవరైనా పుస్తకం రాస్తే 'అమ్మకానికి ఆంధ్రప్రదేశ్' అని పేరు పెడతారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.