అరచేతిలో వైకుంఠం! | There is no development At AP Capital Amaravati in Chandrababu Govt | Sakshi
Sakshi News home page

అరచేతిలో వైకుంఠం!

Published Sun, Jun 17 2018 4:36 AM | Last Updated on Sat, Jul 28 2018 3:41 PM

There is no development At AP Capital Amaravati in Chandrababu Govt - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతిలో నవ నగరాలు, ఐకానిక్‌ టవర్లు, ఐకా నిక్‌ బ్రిడ్జీలు.. వాటర్‌ ఛానళ్లు.. గోల్ఫ్‌ కోర్సులతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు కోటలు దాటినా అడుగులు మాత్రం అస్తవ్యస్థంగా ఉంటున్నాయి. రాజధాని ఎక్కడుందో కనపడ్డంలేదు కానీ అంతర్జాతీయ స్థాయి కుంభకోణాలు మాత్రం కలవరపెడుతున్నాయి. కొత్త రాజధానిలో నిర్మాణాలు ఒకటి రెండే ఉండగా వివాదాలు, అడ్డగోలు వ్యవహారాలు మాత్రం అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. సింగపూర్‌ కంపెనీలతో లాలూచీపడి వేల కోట్ల విలువైన భూములను వారికి అప్పనంగా అప్పగించడం.. భూసమీకరణ పేరుతో నాలుగు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడం.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా వాటిని సొంతం చేసుకోవడం వంటి అనేక దారుణాలు నాలుగేళ్లుగా అమరావతికి అడ్డుగా మారాయి. రాజధాని పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కనీవినీ ఎరుగని అవినీతికి పాల్పడిందనడానికి ఇవే నిదర్శనాలు.

గద్దెనెక్కకాగానే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌
2014 ఎన్నికల అనంతరం రాజధాని ఎక్కడనే విషయంపై వ్యూహాత్మకంగా లీకులిచ్చిన ప్రభుత్వ పెద్దలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా చేజిక్కించుకున్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి తమకు అనుకూలమైన ప్రాంతంలో రాజధాని ఏర్పాటుచేయాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని తమకు కావల్సిన వారికి మాత్రమే చెప్పారు. దీంతో సీఎం, ఆయన కుమారుడు, వారి కోటరీ వ్యక్తులంతా ఆ ప్రాంతంలో తక్కువ ధరకు భారీగా భూములు కొనుగోలు చేశారు. ఇలా తాము ముందే అనుకున్న ప్రాంతంలో సుమారు 25వేల ఎకరాలను టీడీపీ నాయకులు తక్కువ రేటుకు చేజిక్కించుకున్నారు.

అదే సమయంలో బయట ప్రపంచానికి మాత్రం రాజధాని నూజివీడులో అని, గన్నవరంలో అని గుంటూరు జిల్లాలోని నాగార్జున వర్సిటీ ప్రాంతంలో అని అనుకూల మీడియా ద్వారా లీకులిచ్చారు. తద్వారా రాజధాని పేరుతో ఆయా ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ సృష్టించి సాధారణ, మధ్యతరగతి ప్రజలను తప్పుదారి పట్టించారు. అనుకున్న చోట భూములన్నీ తమ చేతుల్లోకి వచ్చాక గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని ఏర్పాటుచేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో అప్పటివరకూ భూములమ్ముకున్న వారు గొల్లుమనగా, ప్రభుత్వ లీకులతో వేరే ప్రాంతాల్లో కొన్నవారు నిండామునిగిపోయారు. దీంతో తాము అనుకున్న ప్రాంతంలో కొన్న భూముల విలువ అమాంతం పెరిగిపోవడంతో టీడీపీ బడా బాబులంతా వేలకోట్ల లబ్ధి పొందారు. ఈ ఆట తెలియని సామాన్యులు సర్వం పోగొట్టుకున్నారు. దళిత రైతుల అసైన్డ్, లంక భూములను సైతం అధికార పార్టీ నేతలు భయపెట్టి కారుచౌకగా తీసుకున్నారు. ఇలా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావుతోపాటు అనేకమంది టీడీపీ ఎమ్మెల్యేల బాగోతాలను ‘సాక్షి’ రెండేళ్ల క్రితమే బయటపెట్టింది. 

బలవంతపు భూసమీకరణ.. అడుగడునా దౌర్జన్యాలు 
ఇలా భూముల కొనుగోళ్లు పూర్తయ్యాక తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల రైతుల నుంచి ప్రభుత్వం భూసమీకరణ ద్వారా 34వేల ఎకరాలను లాక్కుంది. కృష్ణా నది తీరంలో నాలుగు పంటలు పండే అత్యంత విలువైన భూములను ఇవ్వలేమని రైతులు గగ్గోలు పెట్టినా.. పర్యావరణవేత్తలు మొత్తుకున్నా, ప్రతిపక్షాలు, స్థానికులు పెద్దఎత్తున ఆందోళనలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం బెదిరింపులు, దౌర్జన్యాలతో భూములు లాక్కుంది. పలుచోట్ల తోటలను దగ్ధం చేయడం, ఇవ్వని రైతులపై కేసులు పెట్టి వేధించడం, టీడీపీ నేతలు వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరించడం, పొలాలకు నీరు, విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం, వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవడం, రైతులకు తెలియకుండానే వారి భూములను దున్నేయడం వంటి అనేక అరాచకాలకు పాల్పడింది.

ఈ ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు తమకు అనుకూలమైన కొందరు రైతులను చూపించి స్వచ్ఛందంగా రైతులు భూములిచ్చినట్లు ప్రచారం చేసింది. మరోవైపు.. నాలుగు పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మాణం వద్దంటూ పర్యావరణవేత్తలు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా నిబంధనల మేరకు రాజధాని నిర్మాణం చేపట్టాలని ట్రిబ్యునల్‌ సూచనలు చేసింది. వాటి ప్రకారమే నడుచుకుంటామని ట్రిబ్యునల్‌కు చెప్పిన సర్కార్‌.. క్షేత్రస్థాయిలో మాత్రం తన ‘ప్లాన్‌’ ప్రకారమే వెళ్తోంది. అలాగే.. మేధాపాట్కర్, రాజేంద్రసింగ్‌ వంటి పర్యావరణవేత్తలు సైతం రాజధాని ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్న నష్టంపై తమ వాణి వినిపించారు. పర్యావరణ విషయం ఇలా ఉంటే.. భూసమీకరణ సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, బెదిరింపులపై ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో బ్యాంకు ప్రతినిధులు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని పరిశీలించారు. దీంతో రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక సాయం పై ఆ బ్యాంకు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 

ప్లాట్ల కేటాయింపుల్లో వివక్ష
ఇదిలా ఉంటే.. భూసమీకరణ ప్యాకేజీని టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి లబ్ధిచేకూర్చేలా తయారుచేసిన ప్రభుత్వం రైతులకిచ్చే ప్లాట్ల విషయంలో వివక్ష చూపించింది. ఎక్కడి భూములకు అక్కడే ప్లాట్లు ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇష్టానుసారం వాటిని మార్చేసి అనుకూలురకు కావల్సిన చోట కేటాయించింది. కాగా, ప్లాట్ల పంపిణీ కేవలం కాగితాల్లోనే జరిగింది తప్ప ఎవరికీ ప్లాట్లు భౌతికంగా ఇవ్వలేదు. ప్లాట్ల కేటాయింపునకు నిర్వహించిన లాటరీ విధానంపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి.   

‘తాత్కాలికం’లో డొల్లతనం 
ఇంత హడావుడి చేసినా రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ తప్ప మరో నిర్మాణం రాజధానిలో కట్టలేకపోయారు. వీటికి వెయ్యి కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఆరు బ్లాకులను మొదట రూ.180 కోట్లతో మొదలు పెట్టి అంచెలంచెలుగా దాని ఖర్చు పెంచుకుంటూ వెళ్లారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనాలు పైన పటారం లోన లొటారం మాదిరిగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికే భవనాల లోపల వర్షపు ధార కారిపోతుండడం వాటి డొల్లతనాన్ని బయటపెట్టింది.

ఒక్క శాశ్వత భవనమూ లేదు 
రాజధానిలో ఇప్పటివరకూ ఒక్క శాశ్వత భవన నిర్మాణానికీ పునాది పడలేదు. డిజైన్ల కోసం చంద్రబాబు చేస్తున్న విన్యాసాలతో నవ్వులపాలవడం తప్ప ఫలితం లేకుండాపోయింది. 900 ఎకరాల్లో హైకోర్టు, అసెంబ్లీ భవనం, సచివాలయం, శాఖాధిపతులు, విభాగాధిపతులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయ భవనాల డిజైన్ల మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా మొదట జపాన్‌కు చెందిన ‘మకి’ అసోసియేట్స్‌ను అంతర్జాతీయ పోటీలో ఎంపిక చేసిన ప్రభుత్వం అనూహ్యంగా దాన్ని పక్కకు తప్పించి లండన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌ను ఎంపిక చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని ఢిల్లీలోని కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌కు ‘మకి’ ఫిర్యాదు చేయడంతోపాటు అంతర్జాతీయ జర్నళ్లలో ఎండగట్టింది. దీంతో అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు బజారునపడింది. మరోవైపు.. బాహుబలి, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల్లోని అమరావతి సెట్టింగ్‌లపై మనసుపడి వాటి దర్శకులతో చర్చలు జరిపారు.

రెండున్నరేళ్లపాటు ఇలా డిజైన్లు మార్చిమార్చి ఇటీవలే ఆమోదం తెలిపినా ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. ఇదిలా ఉంటే.. రాజధాని రోడ్లు, భవనాల నిర్మాణ అంచనాలను కళ్లుచెదిరేలా తయారు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చదరపు అడుగుకు రూ.నాలుగైదు వేలతో నిర్మించే అవకాశం ఉన్న భవనాలకు రూ.7వేల నుంచి 10 వేల వరకూ అంచనాలు వేసి టెండర్లు పిలవడంతో నిర్మాణ నిపుణులే విస్తుపోతున్నారు. తాజాగా రూ.1,387 కోట్ల అంచనాతో కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జి పనుల్ని ఖరారు చేయడం ఈ కోవలోనిదే.  మరోవైపు.. టెండర్లు, డిజైన్లతో సంబంధం లేకుండా రూ.250 కోట్లు ఖర్చుపెట్టి ఏడాదిన్నర క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో ఉద్ధండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేయించినా అక్కడ ఏం కట్టాలనే దానిపై ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. పరిపాలనా నగరానికి కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీతో శంకుస్థాపన చేయించినా దానికి సంబంధించిన డిజైన్లూ ఇంకా ఖరారు కాలేదు. ఇలా రాజధానికి సంబంధించిన ప్రతీ పని ఒక ఆర్భాటపు ప్రహసనమే తప్ప ఆచరణలోకి రాలేదు.

స్టార్టప్‌ ఏరియాలో సింగపూర్‌ కంపెనీలతో లాలూచీ 
స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు పేరుతో రాజధాని భూములను కారుచౌకగా సింగపూర్‌ కంపెనీలకు కట్టబెట్టడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి కుంభకోణానికి తెరతీసింది. రైతుల నుంచి సేకరించిన భూముల్లోని 1691 ఎకరాలను ఎకరం రూ.12 లక్షల చొప్పున స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి సింగపూర్‌ కన్సార్టియంకు అప్పగించింది. విడతల వారీగా అప్పగించే ఈ భూముల విలువలో కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. అవే భూములను ఇతర కంపెనీలకు ఎకరం రూ.4 కోట్లకు ప్రభుత్వం కేటాయించింది. దీన్నిబట్టి రూ.6,764 కోట్ల విలువైన భూములను కేవలం రూ.250 కోట్లకు అప్పగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ప్రాజెక్టు కోసం రాజధాని ప్రకటనకు ముందే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సింగపూర్‌ కంపెనీలతో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారు.

రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను వారితో తయారు చేయించి ఆ తర్వాత ఈ ప్రాజెక్టును స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో వారికే అప్పగించారు. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలో తమకూ అవకాశం ఇవ్వాలని పలు సంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపింది. దీంతో ప్రభుత్వం ఏపీఐడీసీ చట్టాన్నే మార్చేసి సింగపూర్‌ కన్సార్టియంకు ప్రాజెక్టును అప్పగించింది. ప్రభుత్వం అభివృద్ధి చేసి ఇచ్చిన ఈ భూముల్లో ప్లాట్లు వేసి సింగపూర్‌ కన్సార్టియం, ఏడీసీ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) కలిసి విక్రయిస్తుంది. కారుచౌకగా భూములివ్వడంతోపాటు రూ.5,500 కోట్లతో అందులో మౌలిక వసతులు అభివృద్ధి చేసే పని కూడా ప్రభుత్వానిదే. ఈ భూములపై సింగపూర్‌ కన్సార్టియంకు సీఆర్‌డీఏ పవర్‌ ఆఫ్‌ అటార్నీ కూడా ఇచ్చేసింది. ఇంతచేసి సింగపూర్‌ కంపెనీలు ఇందులో పెట్టే పెట్టుబడి రూ.330 కోట్లు మాత్రమే. కానీ, ప్రాజెక్టులో మాత్రం 58 శాతం వాటా వారికి ఇచ్చారు. భూములు, వసతులు కల్పన అన్నీ చేసిన ఏడీసీ వాటా మాత్రం 42 శాతమే. ఇంత దారుణంగా ప్రభుత్వం నష్టపోతూ కూడా సింగపూర్‌ సంస్థలకు ప్రభుత్వం మోకరిల్లడం వెనుక ప్రభుత్వ ముఖ్యుల స్వప్రయోజనాలున్నాయని, వేల కోట్ల లబ్ధి ఉందని స్పష్టమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement