ఒక్క ఎకరం కూడా అటవీ, ప్రభుత్వ భూమి లేనేలేదు
రైతులకు మూడింతల అధిక ధర చెల్లించి వైఎస్ జగన్ భూములు కొనుగోలు చేశారు
పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే సరస్వతి భూముల్లో పవన్ పర్యటన
వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేశ్‌రెడ్డి
సాక్షి, అమరావతి: ‘సరస్వతి పవర్’ భూముల్లో ప్రతి సెంటూ కొనుగోలు చేసిందేనని, ఒక్క ఎకరం కూడా ప్రభుత్వ భూమి లేదని గురజాల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారన్నారు.
తిరుమల లడ్డూ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను రంగంలోకి దించిన విధంగానే.. ఇప్పుడు సరస్వతి భూముల వ్యవహారంలోనూ అదే పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై పెచ్చుమీరుతున్న లైంగిక దాడులు, పేట్రేగుతున్న టీడీపీ మూకల అరాచకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సరస్వతి భూములపై రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
రైతులు అడిగిన దానికంటే ఎక్కువ చెల్లించి కొన్నారు
సరస్వతి కంపెనీ భూసేకరణ ఇప్పుడు జరిగింది కాదని.. పదిహేనేళ్ల క్రితం భూముల సమీకరణ జరిగిందని కాసు మహేశ్‌రెడ్డి చెప్పారు. 2009లో సరస్వతి కంపెనీ భూములు కొనుగోలు చేసేందుకు సిద్ధపడగా.. అప్పట్లో రైతులంతా సమావేశమై ఎకరం మెట్ట భూమికి రూ.1.50 లక్షలు, పల్లపు భూమికి రూ.2.75 లక్షలు చెల్లించాలని కోరుతూ తీర్మానించారని గుర్తు చేశారు.
అయితే, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులంతా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో వారు కోరిన దానికంటే మిన్నగా.. అధిక ధర చెల్లించారని గుర్తు చేశారు. కొన్ని భూములకు ఆ రోజుల్లోనే ఎకరానికి రూ. 8.50 లక్షలు చెల్లించారన్నారు. ఆ సమయంలోనే ఇదే ప్రాంతంలో భవ్య సిమెంట్ కంపెనీ ఎకరం రూ.50 వేల చొప్పున కొనుగోలు చేసిందని గుర్తు చేశారు.
రైతులకు ఎక్కువ మేలు చేసింది ఎవరని, ఈ విషయాలను పవన్‌కళ్యాణ్ ఎందుకు దాచిపెడుతున్నారని, సరస్వతి భూముల విషయంలో ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఆ భూముల సంగతి పట్టదా పవన్!
గురజాల మండలంలో ప్రభుత్వం నుంచి 40 ఏళ్ల క్రితం సంఘీ సిమెంట్స్ భూములు తీసుకుని ఇప్పటికీ పరిశ్రమ ప్రారంభించలేదని మహేశ్‌రెడ్డి గుర్తు చేశారు. ఇదే ప్రాంతంలో 30 ఏళ్ల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని ఒక్క బస్తా సిమెంట్ కూడా తయారు చేయకుండానే అంబుజా సిమెంట్ ఆ భూములను అదానీకి అమ్మేసిందన్నారు. మై హోమ్, ఇమామి వంటి కంపెనీలు దశాబ్దాల క్రితం ప్రభుత్వ భూములు తీసుకుని పరిశ్రమలు ప్రారంభించకపోయినా పవన్‌కళ్యాణ్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
ఆ సంస్థలకు ఇచ్చిన భూములను రద్దు చేస్తామని పవన్ ప్రకటించగలరా అని ప్రశ్నించారు. సరస్వతి భూములపైకి వెళ్లిన పవన్‌కళ్యాణ్‌కు.. హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతంలో వేలాది ఎకరాలను అక్రమంగా పొంది రామోజీరావు నిర్మించిన ఫిల్మ్ సిటీ భూముల్లోకి వెళ్లే ధైర్యం పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ హెరిటేజ్ కంపెనీ అనేక మార్గాల్లో సేకరించిన భూముల్లో పవన్ పర్యటించగలరా అని సవాల్ చేశారు. ఇవేమీ పట్టించుకోని పవన్‌కళ్యాణ్ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనుగోలు చేసిన ప్రైవేటు భూములను రద్దు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా!
డిప్యూటీ సీఎం హోదాలో పర్యటించిన పవన్ అన్నీ పచ్చి అబద్ధాలే చెప్పారని మహేశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు మాయం అయిపోయారని గతంలో పవన్‌కళ్యాణ్ ఎలా తప్పుడు ప్రచారం చేశారో.. సరస్వతి భూముల విషయంలోనూ అలాంటి తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారన్నారు. అటవీ భూములను కన్వర్షన్ చేశారన్నది పూర్తి అబద్ధమని స్పష్టం చేశారు. అటవీ శాఖకు పవన్‌కళ్యాణ్ మంత్రిగా ఉన్నారని, సరస్వతి భూముల విషయంలో కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
రైతులకు మేలు కోసం దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధరతో జగన్ భూములు కొనుగోలు చేసి, సరస్వతి సిమెంట్ కంపెనీ నెలకొల్పితే.. చంద్రబాబు అధికారంలోకి రాగానే 2014లో ఆ కంపెనీ మైనింగ్ లీజును రద్దు చేశారన్నారు. నిర్దేశించుకున్న సమయానికి ఆ పరిశ్రమ ప్రారంభమై ఉంటే స్థానికంగా వేలాది మందికి ఉపాధి లభించేదన్నారు.
కడప జిల్లాలో మొదలైన భారతి సిమెంట్స్ ద్వారా వేలాది మందికి ఉద్యోగావకాశాలు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒకవైపు రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలంటూ.. దేశాలు తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం మరోవైపు ఇలా ఫ్యాక్టరీలు పెట్టాల నుకున్న కంపెనీలపై కక్ష సాధిస్తుండటం దుర్మార్గమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment