ఇది గో ‘సహజ’ నగరం
- జరీబు భూముల్ని సాగుకు వినియోగిస్తూనే సహజసిద్ధ రాజధాని నిర్మాణం
- మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేసిన నేచురల్ సిటీ విధానకర్తలు
- సింగపూర్ మాస్టర్‌ప్లాన్ ప్రకారమైతే పెను నష్టం
- భావి తరాల పొట్టగొట్టినవాళ్లమవుతాం..
- సింగపూర్ మాస్టర్ ప్లాన్‌ను తాము స్విస్ చాలెంజ్ చేస్తున్నామని ప్రకటన
సాక్షి, అమరావతి : రాష్ట్ర రాజధాని అమరావతిని సింగపూర్ కంపెనీలు రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మిస్తే ప్రకృతి సహజసిద్ధమైన వనరులు కనుమరుగై భావితరాల పొట్టగొట్టినవాళ్లమవుతామని ప్రొఫెసర్ విక్రం సోనీ హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన కృష్ణానది పరీవాహక జరీబు భూములను వ్యవసాయానికి వినియోగిస్తూనే ప్రభుత్వం సేకరించిన భూమిలో సహజసిద్ధ నగరాన్ని ఎలా నిర్మించుకోవచ్చో వివరిస్తూ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్లు, నేచురల్ సిటీ విధానకర్తలు విక్రం సోనీ, రోమి ఖోస్లాలు అమరావతి మాస్టర్‌ప్లాన్ తయారుచేశారు. ప్రకృతి సహజవనరులను కాపాడుకుంటూ ఆహార భద్రత, పర్యావరణ హితంతో కూడిన రాజధాని మాస్టర్ ప్లాన్‌ను వారు రూపొందించారు. దీన్ని మంగళవారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు చేతులమీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా విక్రం సోనీ మాట్లాడుతూ... కృష్ణానది వరదల సమయంలో కొట్టుకువచ్చే ఒండ్రుమట్టి, ఇసుక వల్ల ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరగడమే కాకుండా ఏడాది పొడవునా 300 రకాల పంటలు పండుతున్నాయన్నారు. ఇలాంటి సారవంతమైన జరీబు భూముల్లో కోర్ కేపిటల్ నిర్మించతలపెట్టడాన్ని సమాజహితం కోరే ఏ ఒక్కరూ సమ్మతించరని చెప్పారు. నది ఒడ్డు నుంచి మూడు కిలోమీటర్లు వదిలి రాజధాని నిర్మించుకుంటే నగరానికి కావాల్సిన నీరు, వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఎవరిపైనా ఆధారపడనక్కర్లేదన్నారు. దీనివల్ల కేవలం భూగర్భజలాల రూపంలో ఏటా రూ. 900 కోట్ల విలువైన నీటిని ఆదా చేసుకోవచ్చని తెలిపారు. ఇలా మూడు కిలోమీటర్లు వదిలి నగరాన్ని కట్టడం వల్ల అంతర్గత ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు, బహిరంగంగా నాలుగు డిగ్రీలు తగ్గుతాయని ఆయన వెల్లడించారు.
హరప్పా నగరాన్నే కట్టిన ఘనత మనది
ఇప్పుడు కృత్రిమంగా నిర్మించే ఆకాశహర్మ్యాల నగరాలకు కాలం చెల్లిందని, ఉపాధి, వ్యవసాయంతో కూడిన నగరాల నిర్మాణాలవైపు ప్రపంచం నడుస్తోందని ఈ మాస్టర్ ప్లాన్ ఆర్కిటెక్‌లో పాలుపంచుకున్న సచిన్ జైన్ చెప్పారు. యూరప్‌లో ఇప్పుడు సహజ నగరాల నిర్మాణానికి డిమాండ్ పెరిగిందన్నారు. భారతీయులకు నగరాలు నిర్మించిన అనుభవం లేదని, మురికికూపాలు మాత్రమే కడతారంటూ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన అవివేకాన్ని తెలియచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఏళ్ల క్రితమే హరప్పా నగరాన్ని సృష్టించిన చరిత్ర భారతీయులకు ఉందన్నారు. ఈ మధ్యనే ప్రకృతిని కాపాడుకుంటూ ఎకరం వ్యవసాయ భూమి తీసుకోకుండా చండీగఢ్ నగరాన్ని అద్భుతంగా నిర్మించుకున్నామని గుర్తుచేశారు.
వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా వ్యవసాయ రంగాన్ని ప్రతిబిం బించే విధంగా ఉండాలని చండీగఢ్ నగర నిర్మాణంలో పాలుపంచుకున్న విశ్రాంత ఐఏఎస్ ఎం.జి.దేవసహాయం చెప్పారు. భవనాలను ఇక్కడ కాకపోతే మరోచోటైనా కట్టుకోగలమని, కానీ ఇంతటి సారవంతమైన భూములను మరోచోట సృష్టించగలమా అన్న విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని సూచించా రు. ప్రతి నాలుగు చదరపు కిలోమీటర్లను ఒక సెక్టర్‌గా విడదీస్తూ ఒక సెక్టర్‌లో వ్యవసాయం, మరో సెక్టర్‌లో నగరాన్ని నిర్మించే విధంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించామన్నారు. సింగపూర్ ఇచ్చిన ప్లాన్‌కంటే ఇది అద్భుతంగా ఉందని, ప్రభుత్వం నిజంగా స్విస్ చాలెంజ్ విధానం అమలుచేస్తే తమ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని చర్చకు రావాలని దేవసహాయం ప్రభుత్వానికి సవాల్
విసిరారు.
పప్పుబెల్లాల్లా కట్టబెడుతున్నారు
ఢిల్లీ ప్రొఫెసర్లు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేసిన అనంతరం వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ... రైతుల త్యాగాన్ని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి క్విడ్‌ప్రోకో కింద సింగపూర్ కంపెనీలకు పప్పుబెల్లాల్లా కట్టబెడుతోందని దుయ్యబట్టారు. మొన్న ఉత్తరాఖండ్‌లో రెండు గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షం కురిస్తేనే ఆ రాష్ట్రం అతలాకుతలమైందని, మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వరదముంపు ప్రాంతంలో కోర్ కేపిటల్ ఏవిధం గా నిర్మిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి రెండు నెలల సమయం ఇస్తున్నామని, అప్పటికీ దారిలోకి రాకపోతే రైతులతో కలిసి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నట్లు రైతు అనుమోలు గాంధీ తెలిపారు. కార్యక్రమంలో రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.