
గత 35 ఏళ్ల ప్రభుత్వ పాలనతో పోలిస్తే నాలుగేళ్ల చంద్రబాబు పాలన అతి చెత్త పాలనగా మిగిలిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం స్పష్టం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజల ప్రయోజనాలకు సంరక్షణ కర్తలుగా ఉండాలి అనే భావననే క్షీణింపజేస్తూ, వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ వచ్చారని ఆరోపించారు. పాలకులు చెడుమార్గం పట్టినప్పుడు పౌర సమాజమే తగు నిర్ణయం తీసుకోవాలంటున్న అజయ్ కల్లం అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
మీరు రాసిన ‘మేలుకొలుపు’ లక్ష్యం ఏమిటి?
వేకప్ కాల్ అనే ఇంగ్లిష్ పదానికి తెలుగు అర్థం మేలుకొలుపు. 1980లనాటి రాజకీయ నేతల్లో కాస్త నిజాయితీ ఉండేది. ఆ తరం నేతలు నిజాయితీపరులైన అధికారులను ఇబ్బంది పెట్టేవారు కాదు. సమాజం కోసం, రాష్ట్రం కోసం ఎవరైనా మంచి సలహా ఇస్తే ‘అవును.. మనం అలా చేద్దాం’ అంటూ ప్రోత్సహిం చేవారు. ఆ విధంగానే మనకు ఐటీడీఎ వంటి గొప్ప సంస్థలు ఏర్పడ్డాయి. కానీ 1980ల చివరికి వచ్చేసరికి మా కళ్లముందే వ్యవస్థలన్ని ధ్వంసం అయిపోవడం, క్షీణించిపోవడం చూశాం.
వ్యవస్థలు విఫలమవటం, ఆనాటివరకు కొద్ది స్థాయిలో ఉండే అవినీతి తర్వాత భరించలేని స్థాయికి చేరడం, విలువలు పూర్తిగా పక్కకుపోవడం, సమర్థత ప్రాతిపదికన కాకుండా మనకు పనికొచ్చేవాడు ఎవరు అంటూ ఉన్న ఆఫీసర్లలో వెతుక్కోవడం మొదలైంది. మనప్రాంతం వాడా, మన కులంవాడా, మనం అడిగిన పని చేసిపెడతాడా లేదా అనేవి పదవులకు కొలమానాలుగా మారాయి. బ్యూరోక్రాట్లకు ప్రజా ప్రయోజనాలతో ఏమాత్రం పనిలేదనే వాతావరణాన్ని తీసుకొచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే ప్రజల ప్రయోజనాలకు సంరక్షణ కర్తలుగా ఉండాలి తప్ప రాజకీయ ప్రయోజనాలకోసం కాదు. ఆ భావననే క్షీణింపజేస్తూ, వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ వచ్చారు. ఇదే నా ‘మేలుకొలుపు’ లక్ష్యం.
ప్రభువులు మీపట్ల చాలా ఆగ్రహంతో ఉన్నట్లున్నారే?
ప్రశ్నించే అలవాటు సమాజంనుంచి పోవడం వల్లే వాళ్లాస్థాయికి వచ్చారు. ప్రశ్నిస్తే ఆగ్రహించడమా?
నాయీ బ్రాహ్మణులను సచివాలయంలోకి ఎందుకు రానిచ్చారు అని సీఎం అరిస్తే ఎలా?
నాయకులు బ్యాలెన్స్ తప్పినప్పడే ఇలాంటివి జరుగుతుంటాయి. ఎవరూ మమ్మల్ని ప్రశ్నించకూడదు, మేం మాత్రం అందరిమీదా పెత్తనం చెలాయిస్తాం అంటే మీరు అక్కడ ఉండే పరిస్థితే ఉండదు.
ఇద్దరు సీనియర్ అధికారులు ప్రభుత్వ విధానాలను వరుసగా తూర్పారబట్టడం ఇదే ప్రథమం కదా?
గతంలో మన వ్యవస్థలో ఎప్పటికప్పుడు కొద్దో గొప్పో సానుకూలంగా ఆలోచించేవాళ్లం. విచిత్రం ఏమిటంటే, పోయినవాళ్లే మంచివాళ్లు అని పెద్దలు చెబుతుంటారు కదా. గత 35 ఏళ్లుగా కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా పరిస్థితులు మెరుగవుతాయనే ఆశ ఎక్కువగా ఉండేది. కానీ దానికి పూర్తి భిన్నంగా జరుగుతూ వస్తోంది. పాలనకు సంబంధించి ఏ అయిదేళ్ల కాలాన్ని తీసుకున్నా, అంతకుముందు అయిదేళ్ల పాలనే ఉత్తమంగా ఉండేదన్న ప్రతిస్పందన ఆటోమేటిక్‌గా వస్తోంది. పరిస్థితి మెరుగుపడటానికి బదులు మరింతగా దిగజారుతూండటాన్నే చూస్తున్నాం.
అయితే పార్టీలే తమ ఎజెండాను తీసుకెళ్లి ప్రజ లకు ఇవి చేస్తాం, అవి ఇస్తాం అంటూ చెబుతూ వస్తున్నాయి కానీ ప్రజలు మాకు ఇది కావాలి. ఇది వద్దు అని తమ సొంత ఎజెండాను రూపొందించుకుని డిమాండ్‌చేసే పరి స్థితి ఏర్పడాలన్న ఆలోచన మాత్రం మా ఇద్దరికీ వచ్చింది. ఒక్కటి మాత్రం నిజం. ఏపీలో ఇప్పుడున్న ప్రభుత్వ పాలన గత 35 ఏళ్లుగా పాలించిన ప్రభుత్వాలన్నింటి కంటే చెత్త పాలన అని మాత్రం చెప్పాలి. కారణం ఏమంటే ప్రభుత్వ పాలనా సంస్థలు పూర్తిగా బలహీనమైపోయాయి.
కానీ మండల వ్యవస్థ ద్వారా పాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లారని ప్రశంస కూడా వచ్చింది కదా?
ఉన్న వ్యవస్థలను పనికిమాలినవిగా తయారు చేసి, ప్రజల వద్దకు పాలన అంటే ఉపయోగం ఏమిటి? పైగా మండల వ్యవస్థ నాటి నుంచి నేటి వరకుకూడా ఒక వ్యవస్థగా బలోపేతం కాలేదు. గతంలోని గ్రామీణ సమితులకు అది ప్రత్యామ్నాయం కాలేదు. మెంటే పద్మనాభంగారితో నాకున్న చనువుతో నేను ఆయన్ని ప్రశ్నించాను. ఇదేంటండీ తగిన ప్రత్యామ్నాయం ఏదీ తీసుకురాకుండానే మీరు ఉన్న వ్యవస్థలన్నింటినీ దునుమాడుతున్నారు. (ఆరోజునుంచి ఈరోజు వరకు గ్రామీణ రికార్డులు బాగుపడలేదు.) వ్యవస్థలను నాశనం చేస్తే మీకేంటండీ లాభం? ప్రజ లకు సరఫరా దెబ్బతింటుంది.
దాంతో మీకు చెడ్డపేరు వస్తుంది కదా అని ఆయన్ని అడిగాను. దానికాయన అభిమానంతోటే ఒక విషయం చెప్పారు. అజయ్ మీరంతా యువకులు. మీరు ఆదర్శవాదంతోనే ఆలోచిస్తుంటారు. వ్యవస్థలన్నీ చక్కగా పనిచేసిపెడితే ఇక మాదగ్గరకు ఎవడొస్తాడయ్యా.. వ్యవస్థలు పాడైపోతేనే మా పాత్ర, మా ప్రాధాన్యం ప్రజల్లో పెరుగుతుంది అని చెప్పారాయన. ఆ విధంగా అప్పటినుంచి క్రమక్రమంగా ఒక్కో వ్యవస్థనూ నాశనం చేసుకుంటూ పోయారు. పైగా ఈరోజు ప్రభుత్వంలో ఏ కలెక్టర్‌కి, ఏ విభాగాధిపతికి స్వేచ్ఛ ఉంది? నాయకులు మొత్తం అధికారాలను తమ సొంతం చేసుకుం టున్నారు. కేంద్రీకరించుకుంటున్నారు.
సింగపూర్ కంపెనీకి భూములు కట్టబెట్టడంపై మీరు అభ్యంతరం వ్యక్తం చేయలేదా?
ఎందుకు లేదు? సింగపూర్ కంపెనీకి 1600 ఎకరాలు కట్టబెట్టడం అనేది ఏకపక్ష ఒప్పందం. దీంట్లో ప్రజా ప్రయోజ నాన్ని బలి తీసుకుంటున్నారు. ప్రభుత్వం అవతలివాళ్లకు లాభం కలిగేలా చేస్తోంది అని చాలా క్లియర్‌గా మా వాదనపై ఆరు పాయింట్లు నిర్దిష్టంగా రాసి అందించాం. దాన్ని కేబి నెట్ భేటీలో స్వయంగా నేను లేవనెత్తినా ఒక్క మంత్రి కూడా మాట్లాడలేదు. మహారాష్ట్రలో దబోల్ విద్యుత్ ప్రాజెక్టు కేసు మీకు గుర్తుందా? దానికీ దీనికీ పెద్దగా తేడా లేదండీ అని చెప్పాను. అవునవును. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. కానీ మా నిర్ణయం మేము తీసుకుంటాము అని స్పష్టం చేశారు. ఈ అంశంపై నా విధి నేను చేశాను. కాబట్టి పశ్చాత్తాపపడాల్సిన పనిలేదు.
మీరు కాదన్నా కేబినెట్ ఓకే చేసింది కదా?
పౌరసమాజమే దీనికి సమాధానమివ్వాలి. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం పౌర సమాజానిదే కదా.
రాజధాని చుట్టూ పరిణామాలపై మీకేమనిపిస్తోంది?
నిజం చెప్పాలంటే రాజధాని వ్యవహారాల్లో మేమెన్నడూ జోక్యం చేసుకోలేదు. దాంట్లో మా పాత్ర ఏమీ లేదు. కానీ ప్రపంచంలో ఏ అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశంలో కూడా రాజధానికి ఇంత ప్రాధాన్యమిచ్చిన చరిత్ర ఎక్కడా లేదు. ఇంత హైప్ చేసింది లేదు కూడా. మన దేశ ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దదైన కాలిఫోర్నియా నగరంలో ప్రభుత్వ శాఖలు ఎక్కడో ఒక మూలన పడేసినట్లుంటాయి. నెదర్లాండ్స్‌లో ప్రభుత్వ శాఖలన్నీ హేగ్ వంటి చిన్న నగరంలో ఉంటున్నాయి తప్ప రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌లో లేవు. ఆస్ట్రేలియాలో కీలక శాఖలన్నీ కాన్ బెర్రా అనే 3 లక్షల జనాభా ఉన్న అటవీ ప్రాంత పట్టణంలో ఉంటున్నాయి. రాజధాని అంటే పరిపాలనా శాఖ లతో కూడిన నిర్మాణం. దాన్ని ఒక పెద్ద మెగాసిటీగా, గ్రేటర్ సిటీగా పెంచాల్సిన అవసరం లేదు.
అందులోనూ చేతిలో డబ్బులు లేని దాసరికి అవసరమే లేదు. రెండుమూడు ప్రభుత్వ భవనాలు, రెండువేల కోట్ల ఖర్చు, కావలసిన డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్లు, మౌలిక వసతులు తప్పితే అంతకు మించిన పెట్టుబడి అవసరమే లేదు. అక్కడున్న అవకాశాలను బట్టే రాజధాని చుట్టూ సహజ సిద్ధంగా అభివృద్ధి చేసుకుంటూ ఉంటుంది. ఈమాత్రం దానికి రాజధానిని పూర్తిగా కేంద్రీకృతం చేయాల్సిన అవసరం లేదు. పాలన ఎంత వికేంద్రీకరణకు గురైతే అంత సమర్థంగా ఉంటుంది. నిజంగా సచివాలయం అనేది గ్రామంలో ఉండాలి. గ్రామ వ్యవహారాలను నిత్యం చూసే సెక్రటేరియట్ అది. నేటికీ చాలా దేశాల్లో సెక్రటేరియట్ అనే భావనే లేదు. దేశరాజధాని ఢిల్లీలో సెక్రటేరియట్ ఉందా? వివిధ శాఖలు మాత్రం ఉన్నాయి. వాటì æపని అవి చేసుకుంటున్నాయి.
ఆన్‌లైన్ వ్యవస్థ వచ్చింతర్వాత అన్నీ ఒకేచోట కేంద్రీకరించడం ఎందుకు?
అవును. ఆన్‌లైన్ వ్యవస్థతో పనులు సమర్థంగా జరుగుతాయి. అవినీతిని పూర్తిగా అరికట్టేందుకు వీలిచ్చే ఈ వైఖరిని మొత్తం ప్రపంచమంతా ప్రస్తుతం పాటిస్తోంది. ప్రభుత్వాఫీసులన్నీ ఒకే చోట ఎందుకు పెట్టాలి? నాలుగు డిపార్ట్‌మెంట్లు తిరుపతిలో, మరో నాలుగు విశాఖలో పెట్టండి. కొన్ని విభాగాలను కర్నూలులో పెట్టండి. దానివల్ల నష్టం ఏమిటి? ఏ డిపార్ట్‌మెంట్‌తో ఎవరికి పనిబడితే వారు మాత్రమే అక్కడికి వెళతారు. అంతేగానీ అన్ని పనులకూ రాజ ధానికే ఎందుకు రావాలి? రాజధానిలో ఉండటం వల్ల ఎవరికీ లాభం లేదు. కేవలం ప్రభుత్వోద్యోగులకు అక్కడికక్కడే ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి తప్ప ఇతరులకు లాభం ఏమిటి? రెండోది ఎమ్మెల్యేలు పైరవీలు చేసుకోవడానికి కూడా రాజధాని ఉపయోగపడుతుంది. అంతే తప్ప సాధారణ ప్రజలకు అన్నీ ఒకేచోట ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదు.
Comments
Please login to add a commentAdd a comment