పెత్తందారీ పొలికేక | Vardhelli Murali Article On Chandrababu Naidu Drama On Ap Capital | Sakshi
Sakshi News home page

పెత్తందారీ పొలికేక

Published Sun, Dec 19 2021 1:24 AM | Last Updated on Sun, Dec 19 2021 5:49 AM

Vardhelli Murali Article On Chandrababu Naidu Drama On Ap Capital - Sakshi

అన్నిభాషల్లో కూడా కొన్ని పదాలకు ఒక క్యారెక్టర్‌ స్థిర పడిపోయి ఉంటుంది. కొన్ని పదాల్లో హీరోయిజం కన బడుతుంది. కొన్ని పదాలు విలనిజాన్ని ప్రదర్శిస్తాయి. మరికొన్ని మాటల్లో శక్తిమంతుడైన ఒక సాఫ్ట్‌ విలన్‌ కనిపిస్తాడు. ఇంగ్లీష్‌ మాట ‘హెజెమొనీ’  (Hegemony) దీనికి మంచి ఉదాహరణ. తెలుగులో దీనికి సమానార్థకంగా ‘ఆధిపత్యం’ అనే మాటను ఉపయోగిస్తున్నాం. ఆధిపత్యం శ్రుతిమించినపుడు కొండొకచో... పెత్తందారీతనం అనే మాటను కూడా ఆశ్రయిస్తున్నాం.

అనేక దేశాలున్న ప్రపంచంలో కొన్ని దేశాల ఆధిపత్యం, భిన్న వర్గాలతో కూడిన సమాజంలో ఒకటి, రెండు వర్గాల ఆధిపత్యం సమ్మతమేనా? అటువంటి సమ్మతి స్వచ్ఛందంగా వస్తుందా? లేక కండబలంతో, కత్తులు కటార్లతో, తుపాకీ తూటాలతో సాధిస్తారా? ఆదియందు కండబలంతోనే ఆధిపత్యాన్ని ప్రోది చేసుకున్నప్పటికీ కాలక్రమంలో బుద్ధిబలం ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని తొలుత గుర్తించి సిద్ధాంతీకరించిన వ్యక్తి ఇటాలియన్‌ తత్త్వవేత్త ఆంటోనియో గ్రామ్‌సీ. యథేచ్ఛగా కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నప్పటికీ పశ్చిమ యూరప్‌ దేశాల్లో పెట్టుబడిదారీ విధానం స్థిరపడి పోవడానికి కారణాలను ఆయన అన్వేషించారు. 

ఆధిపత్య వర్గాలు ప్రవేశపెట్టిన నీతినియమాలు, సాంఘిక కట్టుబాట్లు, కథలూ, సామెతలు, సంప్రదాయాలన్నీ కలిసి ఒక ఆధిపత్య భావజాలం ఏర్పడుతుందని ఆయన గుర్తించారు. మనదేశంలో కర్మ సిద్ధాంతం ఈ భావజాలాన్ని బలంగా నిలబెట్టింది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ (కాపీరైట్‌: చంద్రబాబు) అనే వాక్యంలో ఎంత మహిళా విద్వేషం దాగి ఉన్నప్పటికీ చలామణి కావడానికి కారణం ఆధిపత్య భావజాల ప్రభావమే! ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ (కాపీరైట్‌: చంద్రబాబు) అనే వాక్యం సామాజిక ఉన్మాదంలోంచి దూసుకొచ్చింది. సమాజంలో ఉన్న ఆధిపత్య భావజాలం కారణంగా ఇటువంటి అమానుష వ్యాఖ్యానాలన్నీ నిర్లజ్జగా ప్రవహిస్తూనే ఉన్నాయి.

ప్రపంచంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులుగా ముందు కొచ్చిన కమ్యూనిస్టు, సోషలిస్టులు కూడా ఈ ఆధిపత్య భావజాలాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఆధిపత్య భావజాలం వల్ల అణచివేతకు గురవుతున్న వర్గాలు, ప్రాంతాల్లో ఒక చైతన్యం ప్రారంభమైంది. ఈ చైతన్యం అస్తిత్వ పోరాటాల రూపాన్ని, సాధికారత సాధన ఉద్యమాల రూపాన్ని తీసుకుంటున్నది. ఈ పరిణామాన్ని మనం ప్రపంచమంతటా చూడగలుగుతున్నాం. ఒకప్పటి మన ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత  తెలుగు రాష్ట్రాలు కూడా ఈ పరిణామానికి అతీతం కాదు.

తెలుగువారి ఆధునిక చరిత్రను రెండున్నర కోస్తా జిల్లాల ఆధిపత్య వర్గ ప్రయోజనం, దాని భావజాలం చాలాకాలంగా ప్రభావితం చేస్తున్నది. పత్రికలు, పుస్తకాల ప్రచురణ, సినిమాలతో మొదలైన సాంస్కృతిక ఆధిపత్యం మొత్తం మీడియాను గుప్పెట్లోకి తీసుకునే దాకా నిరాటంకంగా సాగిపోయింది, సాగుతూనే ఉన్నది. ఆ రెండున్నర జిల్లాల తెలుగు యాసనే వారు ప్రామాణిక భాషగా స్థిరపరిచారు. మిగిలిన ఇరవై జిల్లాల వారు అంగీకరించక తప్పలేదు. ఎందుకంటే పాఠ్యపుస్తకాల దగ్గర నుంచి సమస్త గ్రంథాలు, పత్రికల ప్రచురణ మొత్తం వారి చేతుల్లోనే ఉన్నది. సినిమాల్లో, నవలల్లో... పనివాళ్లకూ, కమెడియన్లకూ మాత్రమే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర యాస ఉండేది. వారితో మాట్లాడించి రెండున్నర జిల్లాల నాయికానాయకులు పడిపడి నవ్వేవారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర, హైదరాబాద్‌ పాతబస్తీలో, విశాఖ షిప్‌యార్డ్‌ సమీపంలో ఉండే దుర్మార్గులు, దుష్టులైన విలన్‌లకు రెండున్నర జిల్లాల కథానాయకులు తాట తీసే సన్నివేశాలను ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఒక వర్గపు ఆధిపత్య భావజాలం తెలుగునాట గజ్జెకట్టి నర్తించిన వైనాన్ని మొత్తంగా రాస్తే రామాయణ మంత! చెబితే భారతమంత!!

అస్తిత్వ పోరాటాల యుగం ఇది. అణచివేతకు గురైనవారు సాధికారత శంఖం పూరిస్తున్న కాలం ఇది. ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా మొదలైన అస్తిత్వ పోరాటానికి రాజకీయ వేదిక తోడవటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక స్వరూపం 1953–56 మధ్యకాలం నాటిది. ఈ సమయంలో రాష్ట్రానికి కర్నూలు రాజధాని. హైకోర్టు గుంటూరులో ఉండేది. మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు అన్ని ప్రాంతాల నేతల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటైంది. ‘విశాలాంధ్ర’ అనే ఉమ్మడి ప్రయోజనం కోసం 1956లో రాజధాని హోదాను కర్నూలు త్యాగం చేసింది. ఇప్పుడు విశాలాంధ్ర  రద్దయిన నేపథ్యంలో పూర్వపు ఆంధ్రరాష్ట్రం పునరుత్థానమైంది. తాను గతంలో త్యాగం చేసిన హోదాను ఇప్పుడు కర్నూలు డిమాండ్‌ చేస్తే తప్పెట్లా అవుతుంది?

ఆధిపత్య భావజాలం ఇప్పుడు అమరావతి రూపంతో అస్తిత్వ పోరాటాలకు, సాధికారత ఉద్యమాలకు ఒక సవాల్‌ను విసురుతున్నది. న్యాయబద్ధంగా పూర్వపు రాజధాని హోదా దక్కవలసిన కర్నూలుకు న్యాయరాజధాని హోదాను కూడా ఇవ్వడానికి వీలులేదని వాదిస్తున్నది. ఎందుకు వీల్లేదో హేతుబద్ధంగా వివరించడానికి అది నిరాకరిస్తున్నది. రాయలసీమ ప్రాంత అస్తిత్వ గౌరవాన్నీ, ఆత్మగౌరవ ఆకాంక్షనూ అది తృణీకరిస్తున్నది. రాజధాని మొత్తం ఒకేచోట... అదీ అమరావతిలోనే ఉండాలనే వితండవాదాన్ని ముందుకు తెచ్చింది. ఈ ఆధిపత్య భావజాలం రాష్ట్రంలోని అన్ని జెండాలనూ ఏకం చేసింది. ఆధిపత్య వర్గాలకు జెండాలు ఎన్ని ఉన్నా ఎజెండా ఒక్కటేనని నిన్నటి తిరుపతి సభ నిర్ద్వంద్వంగా నిరూపించింది. కమ్యూనిస్టు నారాయణుడు, కాషాయ లక్ష్మీనారాయణుడూ చేతులు కలిపి భుజం, భుజం కలిపి నిలబడిన దృశ్యం భేష్‌. ఈ రాష్ట్రంలో అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, సాధికారత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది కష్టజీవుల కళ్లలో ఈ దృశ్యం ముద్రితమైంది. వారిక తుది నిర్ణయం తీసుకుంటారు.

చిరకాలంగా మన మెదళ్లను ఆధిపత్య భావజాలం నియంత్రిస్తున్న కారణంగా, తన ప్రచార–ప్రసార సాధనాల ద్వారా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్న కారణంగా రాజధాని విషయంలో తటస్థ మేధావుల ‘సమ్మతి’ని తనకు అనుకూలంగా ‘ఉత్పత్తి’ చేసే కార్యక్రమాన్ని ఆధిపత్య వర్గాలు చేపట్టాయి. ‘మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ కన్సెంట్‌– ది పొలిటికల్‌ ఎకానమీ ఆఫ్‌ ది మాస్‌ మీడియా’ పేరుతో  సుప్రసిద్ధ అమెరికన్‌ మేధావి నోమ్‌ చోమ్‌స్కీ ఒక పుస్తకాన్నే రాశారు. ఇక్కడ మాస్‌ మీడియా ఉండేది... ఆధిపత్య వర్గం చేతుల్లోనే. తమకు అనుకూలమైన విధంగా ప్రజాభిప్రాయాన్ని మాస్‌ మీడియా ద్వారా ఎలా ఉత్పత్తి చేస్తారో చోమ్‌స్కీ ఈ పుస్తకంలో వివరించారు. ఆధిపత్య భావజాలాన్ని ప్రచారం చేసే మన మీడియా చోమ్‌స్కీ చెప్పిన పద్ధతులకు మరిన్ని ‘మెరుగులు’ దిద్ది, అధిక ‘ఉత్పత్తి’ని ఇప్పటికే సాధించింది.

రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి కదా! మూడు చోట్ల ఎందుకు? ఒక్కచోటనే ఉంచి ఒక మహానగరాన్ని నిర్మించి నట్లయితే రాష్ట్రానికి ప్రయోజనం కదా? చంద్రబాబుకు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం ఉన్నది కదా? ఆ అనుభవంతో ఇక్కడా అటువంటి నగరాన్ని నిర్మించలేరా? ఇటువంటి అభిప్రాయాలను ఉత్పత్తి చేసి ప్రజల మెదళ్ళలో జొప్పించడానికి ఆధిపత్య వర్గాలు శాయశక్తులా ప్రయ త్నిస్తున్నాయి. తటస్థులూ, బుద్ధిజీవులు, ఉద్యోగ–వ్యాపార, మధ్యతరగతి ప్రజలందరూ ఇక్కడొక రెండు విషయాలను గమనంలోకి తీసుకోవాలి. మొదటిది కర్నూలులో న్యాయరాజధాని సంగతి. ఇది అస్తిత్వ పోరాటాల యుగమని ముందుగానే చెప్పుకున్నాం. 

వెనకబాటుతనానికి గురైన రాయలసీమ ప్రాంతం తరఫున కర్నూలు పోటీలో నిలబడింది.  గతంలో రాజధానిని త్యాగం చేసిన అనుభవంతో అర్హతల రీత్యా మొదటిస్థానంలో నిలబడి ఉన్నది. అటువంటి నగరానికి న్యాయ రాజధానినైనా కేటాయించకపోతే ఆ ప్రాంతంలో అసంతృప్తి రేకెత్తకుండా ఉంటుందా? ప్రాంతీయ ఆకాంక్షలను గుర్తించకుండా ఇప్పటికే భారీ మూల్యం చెల్లించిన సంగతిని విస్మరించడం సరైనదేనా? కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేసినట్లయితే ఈ రాష్ట్రానికి వచ్చే నష్టమేమిటో సహేతుకంగా ఎవరైనా చెప్పగలరా? హైకోర్టును ఏర్పాటు చేయవచ్చును గానీ, న్యాయ రాజధానిగా చెప్పడానికి వీల్లేదని బీజేపీ మరొక వింత వాదన లేవదీసింది. అలా అనడం ఆ ప్రాంత ఆత్మగౌరవాన్ని కించపరచడం కాదా?

ఇక రెండో విషయం విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు గురించి! ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా అస్తిత్వ సమస్య వెన్నాడుతున్నది. తరతరాలుగా వివక్షకు గురవుతన్నామన్న ఆవేదన ఈ ప్రాంతానికి ఉన్నది. పైగా ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖ. వివిధ భాషలు, సంస్కృతులు, మతాల ప్రజలు కలిసి జీవించే కాస్మోపాలిటన్‌ నగరం. అమరావతి ప్రాంతంలో ఉన్నట్టుగా ఇల్లు అద్దెకు కావాలని వచ్చేవారిని కులం అడిగే సంప్రదాయం ఇక్కడ లేదు. అన్ని వర్గాల ప్రజలనూ అక్కున చేర్చుకునే స్వభావం.  కొంత రాజకీయ సంకల్పం తోడైతే చాలు, తూర్పుతీరంలో ఒక మహానగరంగా అవతరించడానికి అనేక భౌగోళిక అనుకూలతలు ఉన్న నగరం. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి కొంత ఫోకస్‌ పెడితే రెండు మూడేళ్ళలోనే రాష్ట్ర ఆర్థిక రంగానికి ఆలంబనగా నిలబడగల అభివృద్ధి ఇంజన్‌గా విశాఖ అవతరించగలదు.
విశాఖతో పోలిస్తే ఆర్థికంగా అందుబాటులోకి రాగల అవకాశాలు అమరావతిలో మృగ్యం. రోమ్‌ నగరం ఒక్క రోజులో నిర్మాణం కాలేదన్న నానుడిని గమనంలో ఉంచుకోవాలి.

హైదరాబాద్‌ నగరానికి పునాది వేసినప్పుడు ఖులీ ఖుతుబ్‌షా, అల్లాను వేడుకున్నాడు. నీళ్లలో చేపల్ని కలిపినట్టు నగరం జన సమ్మర్దంతో నిండేలా చూసే భారాన్ని ఆయన అల్లా దయకే వదిలేశారు. భవనాలు నిర్మించినంత మాత్రాన జరిగేది ఏముండదనీ, జనం నివసించాలంటే అక్కడ ఉపాధి అవకాశాలు లభించే, ఆర్థిక కార్యక్రమాలు పెరగాలనే విచక్షణ గలవాడు కనుకనే ఖులీ... అల్లాను ప్రార్థించాడు. మలేషియాలో కొత్త రాజధానిగా పుత్రజయను నిర్మించినప్పటికీ ఆర్థిక భారాన్ని మోస్తున్నది ఇప్పటికీ కౌలాలంపూరే! హైకోర్టు ఒక చోట, అసెంబ్లీ మరోచోట ఉన్న రాష్ట్రాలు మనదేశంలోనే అరడజన్‌ దాకా ఉన్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు. అస్తిత్వ సమస్యను పరిష్కరించడానికీ, ఆర్థిక చోదకశక్తిని తయారుచేసుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదిత మూడు రాజధానులు అత్యావశ్యకం.

హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టుగా చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తారనేది కూడా ఒక బోగస్‌ ప్రచారం. హైదరాబాద్‌ అభివృద్ధిని చంద్రబాబు ఖాతాలో వేయడం కూడా ఆధిపత్య వర్గాలు ‘ఉత్పత్తి’ చేసిన అభిప్రాయమే. హైదరాబాద్‌ వయసు 430 సంవత్సరాలు. పుట్టినప్పటి నుంచీ ఇది రాజధాని నగరమే. ప్రపంచంలోనే విలువైన వజ్రాలకూ, మేలి ముత్యాలకూ కేరాఫ్‌ అడ్రస్‌. కోహినూర్, జాకబ్‌ వజ్రాలను సానబట్టిన నగరం. దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచినవాడు – హైదరాబాద్‌ నవాబ్‌ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌.

చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందే డజన్‌కు పైగా భారీ ప్రభుత్వరంగ పరిశ్రమలు వెలసిన నగరం. మరో డజన్‌ రక్షణ, పరిశోధనా సంస్థలకు ఆవాసం. ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల కూడలి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసింది కూడా వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో! ఔటర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారు, భూసేకరణ, నిర్మాణం వైఎస్సార్‌ హయంలోనే జరిగాయి. అలైన్‌మెంట్‌ ఖరారు సమయంలోనే కదా ఎల్లోమీడియా మొఘల్‌ రాజశేఖర్‌ రెడ్డిపై కత్తి కట్టింది?. కానీ ఇప్పుడు ఔటర్‌ రింగ్‌రోడ్డునూ, ఎయిర్‌పోర్టునూ చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. జనాన్ని పిచ్చివాళ్ళను చేయగల సామర్థ్యం ఆధిపత్య భావజాలానికి ఉన్నదని వారి గట్టి నమ్మకం.

ఆ నమ్మకంతోనే వారు అమరావతి రూపంలో ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఇతర ప్రాంతాల అస్తిత్వ ఆకాంక్షలను అవహేళన చేస్తున్నారు. ఆ నమ్మకంతోనే నిరుపేదలకు, సామాన్యులకు, అమరావతిలో నివాసయోగ్యత లేదని న్యాయస్థానం దాకా వెళ్ళి అడ్డు కున్నారు. ఇప్పుడు ఆధిపత్య వర్గాల జెండాలన్నింటినీ ఏకం చేసి సామాన్య ప్రజల మీద వారి ఆకాంక్షల మీద యుద్ధాన్ని ప్రకటించారు. పెత్తందార్లంతా ఒక్కటై తిరుపతిలో పొలికేక పెట్టారు. సామాన్య ప్రజల సాధికార పోరాటశక్తిని వారు తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒక సామాన్య మహిళ కణ్ణగి శపిస్తేనే మదురై నగరం దగ్ధమైందని ప్రాచీన తమిళ కావ్యం ‘శిలప్పదికారం’ మనకు బోధిస్తున్నది. అరడజన్‌ జెండాలు చూసి మురిసిపోతే భంగపాటు తప్పదు. అటువైపు ఐదుకోట్ల జనం.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement