
శంకుస్థాపన ముగిసింది... ఇక భూ సంతర్పణే
⇒ కావాల్సిన సింగపూర్ సంస్థకు అమరావతిని అప్పగించేందుకు రంగం సిద్ధం
⇒ గ్లోబల్ టెండర్లను పిలవకుండానే విదేశీ సంస్థకు రాజధాని అప్పగింత
⇒ ముందు అనుకున్న ప్రకారమే ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేసిన అసెండాస్-సెమ్బ్‌కార్ప్ కన్సార్టియం
⇒ త్వరలోనే బిడ్ దాఖలు చేయనున్న కన్సార్టియం
⇒ తొలిదశలో మూడు వేల ఎకరాల సీడ్ కేపిటల్ అప్పగింత
⇒ అందులో 250 ఎకరాలు ఉచితంగా సింగపూర్ కంపెనీలకు..
⇒ ఇందులో ఐకానిక్ కాంప్లెక్స్‌లు నిర్మించి అమ్ముకునేలా వీలు..
⇒ మిగిలిన 2,750 ఎకరాల అభివృద్ధికి అయిన వ్యయం చార్జీల రూపంలో వసూలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరానికి శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో ఇక సింగపూర్ సంస్థలకు భూములను కట్టబెట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తొలి విడతగా రాజధాని సీడ్ ఏరియా (రాజధాని ప్రధాన ప్రాంతం)లోని భూములను సింగపూర్‌కు చెందిన ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించబోతోంది. రాజధాని నిర్మాణం వంటి అతిపెద్ద ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఈ ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి దాన్ని స్విస్ చాలెంజ్ పద్ధతిలో అయిన వారికి కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది.
దానికి అనుగుణంగానే సింగపూర్‌కు చెందిన అసెండాస్ గ్రూప్, సెమ్బ్‌కార్ప్ కంపెనీలు ప్రణాళికాబద్ధంగా తెరమీదకొస్తున్నాయి. అనుకున్న ప్రకారమే సీడ్ ఏరియా (రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం భవనాలు నిర్మించే ప్రధాన ప్రాంతం) నిర్మాణానికి సింగపూర్ దేశానికి చెందిన ప్రైవేటు సంస్థలు అసెండాస్-సిన్‌బ్రిడ్జ్ గ్రూపు, సెమ్బ్‌కార్ప్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ ఒక కన్సార్టియంగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణను దాఖలు చేశాయి.
ఈ విషయాన్ని సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. సింగపూర్‌కు చెందిన ప్రైవేటు సంస్థలు సుర్బానా, జురాంగ్‌లు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఆర్‌డీఏ పరిధిలో ఇదివరకే, మూడు విడతల్లో మాస్టర్ ప్రణాళికలు అందజేసిన విషయం తెలిసిందే. ఆ ప్రణాళికల ఆధారంగా మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్-సిన్‌బ్రిడ్జ్ గ్రూపు, సెమ్బ్‌కార్ప్‌లు ఒక కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ఆ మాస్టర్ ప్రణాళికల ఆధారంగా తొలివిడతగా సీడ్ ఏరియాను అభివృద్ధి పరిచే పేరుతో ఈ కన్సార్టియానికి ప్రభుత్వం త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వబోతోంది. అమరావతి శంకుస్థాపనకు వచ్చే రోజున సింగపూర్ మంత్రి ఈశ్వరన్ దీన్ని ఒక ప్రకటన ద్వారా బహిర్గతం చేశారు.
అంతా గోప్యంగానే..: సీడ్ ఏరియా అభివృద్ధి పేరుతో అసెండాస్ గ్రూపు, సెమ్బ్‌కార్ప్ కన్సార్టియంకు తొలి దశలో 3 వేల ఎకరాలను అప్పగిస్తారు. దాన్ని సీఆర్‌డీఏ-సింగపూర్ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్‌లో అభివృద్ధి చేయాలి. ప్రతిఫలంగా అమరావతిలోని కీలకమైన రాజధాని ప్రాంతంలో సింగపూర్ (కన్సార్టియంకు) కంపెనీలకు 250 ఎకరాలను ఉచితంగా కేటాయిస్తారు. అలా ఇచ్చిన 250 ఎకరాల్లో సింగపూర్ కంపెనీలు ఐకానిక్ కాంప్లెక్స్‌లను (భారీ భవనాలను) నిర్మించి అందులో చదరపు అడుగుల చొప్పున అమ్ముకునేలా, అవి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వీలు కల్పిస్తారు. 250 ఎకరాలను ఉచితంగా ఇవ్వడమే కాకుండా తొలి దశలో మిగిలిన 2,750 ఎకరాల అభివృద్ధికి అయిన వ్యయాన్ని అభివృద్ధి చార్జీల రూపంలో సింగపూర్ కంపెనీలు వసూలు చేస్తాయి.
ఈ ఖర్చును ఏ రూపంలో వసూలు చేయాలన్న అంశాన్ని ఆ కంపెనీలు దాఖలు చేసే బిడ్‌లో పేర్కొంటాయని చెబుతున్నారు. మరోవైపు కొత్త రాజధానిలో భూముల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో సింగపూర్ కంపెనీలకు వాటా కూడా ఇవ్వనున్నారు. తొలి దశ రాజధాని అభివృద్ధి 2018 అక్టోబర్ నాటికి పూర్తి చేయడానికి ఈ కన్సార్షియం ఆమోదించినట్టు సమాచారం.జాయింట్ వెంచర్‌లో సభ్యులుగా ప్రభుత్వానికి చెందిన వారితో సమానంగా కంపెనీకి చెందిన వారుండాలని అసెండాస్-సెమ్బ్‌కార్ప్ కన్సార్టియం ప్రభుత్వానికిచ్చిన ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (ఆసక్తి వ్యక్తీకరణ) లో పేర్కొన్నట్టు అధికారవర్గాలు చెప్పాయి. రాజధాని ప్రాంత అభివృద్ధి సమయంలో మధ్యమధ్యలో ఎదురయ్యే సమస్యలు, అదనపు భారాలకు బాధ్యత వహించడానికి అంగీకరించేది లేదని కన్సార్టియం స్పష్టం చేసింది.
రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ కన్సార్టియం ప్రభుత్వం ముందు పలు షరతులను పెట్టగా, ప్రభుత్వం అంగీకరించినట్టు అధికారవర్గాలు చెప్పాయి. కొన్నింటికి అంగీకరించేది లేదని చెప్పినప్పటికీ, ఇటీవల సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సింగపూర్‌లో పర్యటించిన సందర్భంగా వాటిలో అనేక సడలింపులిచ్చి, సింగపూర్ కంపెనీలు పేర్కొన్న షరతులకు అంగీకరించినట్టు విశ్వసనీయ సమాచారం. సింగపూర్ పర్యటనలో జరిపిన సంప్రదింపుల సమయంలోనే అసెండాస్ గ్రూపు-సెమ్బ్‌కార్ప్ కన్సార్టియంను మాస్టర్ డెవలపర్‌గా బిడ్ దాఖలు చేస్తాయని సింగపూర్ ప్రతినిధులు సీఎంకు తెలియజేశారు. దాని సమగ్ర ప్రణాళికను కూడా ఆయనకు వివరించారు. ఈ అంశాలనే ఇటీవల విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో సీఎం తెలియజేశారు. ఆ కన్సార్టియం ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేసిన నేపథ్యంలో మాస్టర్ డెవలపర్‌గా బిడ్‌ను దాఖలు చేస్తుంది. స్విస్ చాలెంజ్‌లో కొన్ని ప్రక్రియల అనంతరం సర్కార్ ఓకే చేస్తుంది.
ముందు నుంచీ చెబుతున్న ‘సాక్షి’
సింగపూర్‌కు చెందిన ప్రైవేటు కంపెనీలు అసెండాస్-సిన్‌బ్రిడ్జ్ గ్రూపు, సెమ్బ్‌కార్ప్‌లు కలసి ఒక కన్సార్షియంగా రాజధానిలో మాస్టర్ డెవలపర్‌గా అడుగుపెట్టబోతున్నాయని ‘సాక్షి’ మొదటి నుంచీ చెబుతోంది. ఆ కన్సార్టియమే ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేసినట్టు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ నెల 22న విడుదల చేసిన ఒక ప్రకటనలో స్వయంగా అంగీకరించారు.
సింగపూర్ కంపెనీల మాయాజాలం
సింగపూర్ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ (ఐఈ) సంస్థ ప్రపంచవ్యాప్తంగా (ప్రధానంగా ఆసియా దేశాల్లో) ప్రాజెక్టులను తీసుకుని ఆ దేశంలోని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించడంలో మధ్యవర్తిగా పనిచేస్తోంది. వివిధ దేశాల్లో ప్రాజెక్టులకు అనుగుణంగా సింగపూర్‌లోని ఆయా ప్రైవేటు కంపెనీలకు బిజినెస్ సమకూర్చుతోంది. ఆ క్రమంలోనే రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రణాళికను రూపొందించే పేరుతో అది ఆంధ్రప్రదేశ్‌లోనూ అడుగుపెట్టింది. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి గత ఏడాది డిసెంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. అప్పట్లో సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని, ఉచితంగా మాస్టర్ ప్లాన్ సమర్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్ మాత్రం మాస్టర్ ప్లాన్‌ల తయారీ బాధ్యతను సింగపూర్‌లోని ప్రైవేటు కంపెనీలు సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ, జురాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌లకు అప్పగించింది.
ఆ కంపెనీలు మూడు విడతల్లో మాస్టర్ ప్లాన్‌లను అందజేశాయి. ఆ ప్లాన్‌ల మేరకు రాజధానిని అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ అసెండాస్, సిన్‌బ్రిడ్జ్ గ్రూపు, సెమ్బ్‌కార్ప్‌లు ఒక కన్సార్టియంగా ఏర్పడి ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ సమర్పించాయి. సింగపూర్ కంపెనీలు ఇప్పటివరకు చిన్నచిన్న ఎస్‌ఈజెడ్‌లు అభివృద్ధి చేయడం మినహా ఆంధ్రప్రదేశ్ రాజధాని వంటి పెద్ద ప్రాజెక్టులు చేసిన అనుభవం వాటికి లేదు.
వేలాది ఎకరాల భూముల్లో రాష్ట్ర రాజధాని అభివృద్ధి ప్రాజెక్టును అప్పగించడానికి ప్రభుత్వ పెద్దలు ముందుగానే అంతర్గత చర్చలు జరిపి, అవగాహన కుదుర్చుకున్న నేపథ్యంలో సింగపూర్‌లోని ప్రైవేటు కంపెనీలన్నీ తమ బిజినెస్ కోసం ఒక్కొక్కటిగా విలీనమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాజెక్టు లభిస్తుందన్న ముందస్తు గ్యారంటీతో సింగపూర్‌లోని అసెం డాస్ ప్రైవేట్ లిమిటెడ్, సిన్‌బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు రెండూ ఈ ఏడాది జూన్ 10న విలీనమయ్యాయి.
అసెండాస్-సిన్‌బ్రిడ్జ్ గ్రూపు పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ విలీనానికి ముందు సింగపూర్‌కు చెందిన టెమాసెక్, జేటీసీ కార్పొరేషన్ సంస్థలు విలీనమయ్యాయి. ఈ గ్రూపు తరఫున అసెండాస్-సిన్‌బ్రిడ్జ్ గ్రూపులో 49 శాతం వాటా కలిగివుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు మూ డు విడతల్లో మాస్టర్ ప్లాన్లు రూపొందించిన సుర్బానా, జురాంగ్ కంపెనీలు కూడా విలీన మై సుర్బానా-జేఏహెచ్ పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కంపెనీలన్నీ ప్రధానంగా పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ, బిజినెస్, సైన్స్ పార్కుల నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పనిచేస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో ఈ కం పెనీలు పరస్పరం సహకరించుకుంటాయి. కొసమెరుపేంటంటే... మాస్టర్ ప్లాన్లు తయా రు చేయడానికి సుర్బానా, జురాంగ్‌ల చార్జీలు మాస్టర్ డెవలపర్‌గా ఎంపికైన కంపెనీ బిడ్‌లో అంతర్లీనంగా దాగి ఉంటుంది. తదనంతరం చార్జీల రూపంలో వసూలు చేసి ఆయా కంపెనీలకు చెల్లిస్తుంది.