capital foundation
-
శంకుస్థాపన ముగిసింది... ఇక భూ సంతర్పణే
⇒ కావాల్సిన సింగపూర్ సంస్థకు అమరావతిని అప్పగించేందుకు రంగం సిద్ధం ⇒ గ్లోబల్ టెండర్లను పిలవకుండానే విదేశీ సంస్థకు రాజధాని అప్పగింత ⇒ ముందు అనుకున్న ప్రకారమే ఆసక్తి వ్యక్తీకరణ దాఖలు చేసిన అసెండాస్-సెమ్బ్‌కార్ప్ కన్సార్టియం ⇒ త్వరలోనే బిడ్ దాఖలు చేయనున్న కన్సార్టియం ⇒ తొలిదశలో మూడు వేల ఎకరాల సీడ్ కేపిటల్ అప్పగింత ⇒ అందులో 250 ఎకరాలు ఉచితంగా సింగపూర్ కంపెనీలకు.. ⇒ ఇందులో ఐకానిక్ కాంప్లెక్స్‌లు నిర్మించి అమ్ముకునేలా వీలు.. ⇒ మిగిలిన 2,750 ఎకరాల అభివృద్ధికి అయిన వ్యయం చార్జీల రూపంలో వసూలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరానికి శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో ఇక సింగపూర్ సంస్థలకు భూములను కట్టబెట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తొలి విడతగా రాజధాని సీడ్ ఏరియా (రాజధాని ప్రధాన ప్రాంతం)లోని భూములను సింగపూర్‌కు చెందిన ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించబోతోంది. రాజధాని నిర్మాణం వంటి అతిపెద్ద ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఈ ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి దాన్ని స్విస్ చాలెంజ్ పద్ధతిలో అయిన వారికి కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దానికి అనుగుణంగానే సింగపూర్‌కు చెందిన అసెండాస్ గ్రూప్, సెమ్బ్‌కార్ప్ కంపెనీలు ప్రణాళికాబద్ధంగా తెరమీదకొస్తున్నాయి. అనుకున్న ప్రకారమే సీడ్ ఏరియా (రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం భవనాలు నిర్మించే ప్రధాన ప్రాంతం) నిర్మాణానికి సింగపూర్ దేశానికి చెందిన ప్రైవేటు సంస్థలు అసెండాస్-సిన్బ్రిడ్జ్ గ్రూపు, సెమ్బ్‌కార్ప్ డెవలప్మెంట్ లిమిటెడ్ ఒక కన్సార్టియంగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణను దాఖలు చేశాయి. ఈ విషయాన్ని సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. సింగపూర్‌కు చెందిన ప్రైవేటు సంస్థలు సుర్బానా, జురాంగ్‌లు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ పరిధిలో ఇదివరకే, మూడు విడతల్లో మాస్టర్ ప్రణాళికలు అందజేసిన విషయం తెలిసిందే. ఆ ప్రణాళికల ఆధారంగా మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగా మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్‌కు చెందిన అసెండాస్-సిన్బ్రిడ్జ్ గ్రూపు, సెమ్బ్కార్ప్లు ఒక కన్సార్టియంగా ఏర్పడ్డాయి. ఆ మాస్టర్ ప్రణాళికల ఆధారంగా తొలివిడతగా సీడ్ ఏరియాను అభివృద్ధి పరిచే పేరుతో ఈ కన్సార్టియానికి ప్రభుత్వం త్వరలోనే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వబోతోంది. అమరావతి శంకుస్థాపనకు వచ్చే రోజున సింగపూర్ మంత్రి ఈశ్వరన్ దీన్ని ఒక ప్రకటన ద్వారా బహిర్గతం చేశారు. అంతా గోప్యంగానే..: సీడ్ ఏరియా అభివృద్ధి పేరుతో అసెండాస్ గ్రూపు, సెమ్బ్‌కార్ప్ కన్సార్టియంకు తొలి దశలో 3 వేల ఎకరాలను అప్పగిస్తారు. దాన్ని సీఆర్డీఏ-సింగపూర్ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసే జాయింట్ వెంచర్లో అభివృద్ధి చేయాలి. ప్రతిఫలంగా అమరావతిలోని కీలకమైన రాజధాని ప్రాంతంలో సింగపూర్ (కన్సార్టియంకు) కంపెనీలకు 250 ఎకరాలను ఉచితంగా కేటాయిస్తారు. అలా ఇచ్చిన 250 ఎకరాల్లో సింగపూర్ కంపెనీలు ఐకానిక్ కాంప్లెక్స్‌లను (భారీ భవనాలను) నిర్మించి అందులో చదరపు అడుగుల చొప్పున అమ్ముకునేలా, అవి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వీలు కల్పిస్తారు. 250 ఎకరాలను ఉచితంగా ఇవ్వడమే కాకుండా తొలి దశలో మిగిలిన 2,750 ఎకరాల అభివృద్ధికి అయిన వ్యయాన్ని అభివృద్ధి చార్జీల రూపంలో సింగపూర్ కంపెనీలు వసూలు చేస్తాయి. ఈ ఖర్చును ఏ రూపంలో వసూలు చేయాలన్న అంశాన్ని ఆ కంపెనీలు దాఖలు చేసే బిడ్‌లో పేర్కొంటాయని చెబుతున్నారు. మరోవైపు కొత్త రాజధానిలో భూముల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో సింగపూర్ కంపెనీలకు వాటా కూడా ఇవ్వనున్నారు. తొలి దశ రాజధాని అభివృద్ధి 2018 అక్టోబర్ నాటికి పూర్తి చేయడానికి ఈ కన్సార్షియం ఆమోదించినట్టు సమాచారం.జాయింట్ వెంచర్లో సభ్యులుగా ప్రభుత్వానికి చెందిన వారితో సమానంగా కంపెనీకి చెందిన వారుండాలని అసెండాస్-సెమ్బ్‌కార్ప్ కన్సార్టియం ప్రభుత్వానికిచ్చిన ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ (ఆసక్తి వ్యక్తీకరణ) లో పేర్కొన్నట్టు అధికారవర్గాలు చెప్పాయి. రాజధాని ప్రాంత అభివృద్ధి సమయంలో మధ్యమధ్యలో ఎదురయ్యే సమస్యలు, అదనపు భారాలకు బాధ్యత వహించడానికి అంగీకరించేది లేదని కన్సార్టియం స్పష్టం చేసింది. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ కన్సార్టియం ప్రభుత్వం ముందు పలు షరతులను పెట్టగా, ప్రభుత్వం అంగీకరించినట్టు అధికారవర్గాలు చెప్పాయి. కొన్నింటికి అంగీకరించేది లేదని చెప్పినప్పటికీ, ఇటీవల సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సింగపూర్‌లో పర్యటించిన సందర్భంగా వాటిలో అనేక సడలింపులిచ్చి, సింగపూర్ కంపెనీలు పేర్కొన్న షరతులకు అంగీకరించినట్టు విశ్వసనీయ సమాచారం. సింగపూర్ పర్యటనలో జరిపిన సంప్రదింపుల సమయంలోనే అసెండాస్ గ్రూపు-సెమ్బ్‌కార్ప్ కన్సార్టియంను మాస్టర్ డెవలపర్‌గా బిడ్ దాఖలు చేస్తాయని సింగపూర్ ప్రతినిధులు సీఎంకు తెలియజేశారు. దాని సమగ్ర ప్రణాళికను కూడా ఆయనకు వివరించారు. ఈ అంశాలనే ఇటీవల విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో సీఎం తెలియజేశారు. ఆ కన్సార్టియం ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేసిన నేపథ్యంలో మాస్టర్ డెవలపర్‌గా బిడ్‌ను దాఖలు చేస్తుంది. స్విస్ చాలెంజ్‌లో కొన్ని ప్రక్రియల అనంతరం సర్కార్ ఓకే చేస్తుంది. ముందు నుంచీ చెబుతున్న ‘సాక్షి’ సింగపూర్‌కు చెందిన ప్రైవేటు కంపెనీలు అసెండాస్-సిన్బ్రిడ్జ్ గ్రూపు, సెమ్బ్కార్ప్లు కలసి ఒక కన్సార్షియంగా రాజధానిలో మాస్టర్ డెవలపర్‌గా అడుగుపెట్టబోతున్నాయని ‘సాక్షి’ మొదటి నుంచీ చెబుతోంది. ఆ కన్సార్టియమే ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేసినట్టు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఈ నెల 22న విడుదల చేసిన ఒక ప్రకటనలో స్వయంగా అంగీకరించారు. సింగపూర్ కంపెనీల మాయాజాలం సింగపూర్ ప్రభుత్వానికి చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ (ఐఈ) సంస్థ ప్రపంచవ్యాప్తంగా (ప్రధానంగా ఆసియా దేశాల్లో) ప్రాజెక్టులను తీసుకుని ఆ దేశంలోని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించడంలో మధ్యవర్తిగా పనిచేస్తోంది. వివిధ దేశాల్లో ప్రాజెక్టులకు అనుగుణంగా సింగపూర్‌లోని ఆయా ప్రైవేటు కంపెనీలకు బిజినెస్ సమకూర్చుతోంది. ఆ క్రమంలోనే రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రణాళికను రూపొందించే పేరుతో అది ఆంధ్రప్రదేశ్‌లోనూ అడుగుపెట్టింది. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి గత ఏడాది డిసెంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వానికి, ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజెస్‌కు మధ్య ఒప్పందం కుదిరింది. అప్పట్లో సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని, ఉచితంగా మాస్టర్ ప్లాన్ సమర్పిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ మాత్రం మాస్టర్ ప్లాన్ల తయారీ బాధ్యతను సింగపూర్‌లోని ప్రైవేటు కంపెనీలు సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ, జురాంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌లకు అప్పగించింది. ఆ కంపెనీలు మూడు విడతల్లో మాస్టర్ ప్లాన్లను అందజేశాయి. ఆ ప్లాన్ల మేరకు రాజధానిని అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ అసెండాస్, సిన్బ్రిడ్జ్ గ్రూపు, సెమ్బ్కార్ప్లు ఒక కన్సార్టియంగా ఏర్పడి ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ సమర్పించాయి. సింగపూర్ కంపెనీలు ఇప్పటివరకు చిన్నచిన్న ఎస్ఈజెడ్లు అభివృద్ధి చేయడం మినహా ఆంధ్రప్రదేశ్ రాజధాని వంటి పెద్ద ప్రాజెక్టులు చేసిన అనుభవం వాటికి లేదు. వేలాది ఎకరాల భూముల్లో రాష్ట్ర రాజధాని అభివృద్ధి ప్రాజెక్టును అప్పగించడానికి ప్రభుత్వ పెద్దలు ముందుగానే అంతర్గత చర్చలు జరిపి, అవగాహన కుదుర్చుకున్న నేపథ్యంలో సింగపూర్‌లోని ప్రైవేటు కంపెనీలన్నీ తమ బిజినెస్ కోసం ఒక్కొక్కటిగా విలీనమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాజెక్టు లభిస్తుందన్న ముందస్తు గ్యారంటీతో సింగపూర్‌లోని అసెం డాస్ ప్రైవేట్ లిమిటెడ్, సిన్బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు రెండూ ఈ ఏడాది జూన్ 10న విలీనమయ్యాయి. అసెండాస్-సిన్బ్రిడ్జ్ గ్రూపు పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేశాయి. ఈ విలీనానికి ముందు సింగపూర్‌కు చెందిన టెమాసెక్, జేటీసీ కార్పొరేషన్ సంస్థలు విలీనమయ్యాయి. ఈ గ్రూపు తరఫున అసెండాస్-సిన్బ్రిడ్జ్ గ్రూపులో 49 శాతం వాటా కలిగివుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు మూ డు విడతల్లో మాస్టర్ ప్లాన్లు రూపొందించిన సుర్బానా, జురాంగ్ కంపెనీలు కూడా విలీన మై సుర్బానా-జేఏహెచ్ పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ కంపెనీలన్నీ ప్రధానంగా పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, ఐటీ, బిజినెస్, సైన్స్ పార్కుల నిర్మాణం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పనిచేస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో ఈ కం పెనీలు పరస్పరం సహకరించుకుంటాయి. కొసమెరుపేంటంటే... మాస్టర్ ప్లాన్లు తయా రు చేయడానికి సుర్బానా, జురాంగ్ల చార్జీలు మాస్టర్ డెవలపర్‌గా ఎంపికైన కంపెనీ బిడ్‌లో అంతర్లీనంగా దాగి ఉంటుంది. తదనంతరం చార్జీల రూపంలో వసూలు చేసి ఆయా కంపెనీలకు చెల్లిస్తుంది. -
ఆ ముగ్గురు ముంచారు
-
ఆ ముగ్గురు ముంచారు
ప్రధాని నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను నిలువునా దగా చేశారని.. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి విమర్శించారు. ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రత్యేక హోదా ప్రస్తావన రాకపోవడం దారుణమని అన్నారు. రూ400 కోట్లు ఖర్చు చేసిన ఆర్భాటాలు రాష్ట్రానికి ఏవిధంగానూ ఉపయోగ పడలేదని అన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి అసెంబ్లీ, పార్లమెంట్ లను అగౌరవ పరిచారని చెప్పారు. -
బాబు నోట 'ఆ మాట' రాలేదు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ప్రత్యేక హోదా గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని, ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరముందని ప్రజలు భావించినా... సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. చంద్రబాబు మాట్లాడుతూ గడిచిన 16 నెలల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి కొన్ని ప్రయోజనాలు చేకూరాయని, కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని చెప్పుకొచ్చారు. అయితే, రాజధాని శంకుస్థాపన సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించకపోవడం గమనార్హం ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నిరవధిక నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడులు పెద్దమొత్తంలో వస్తాయని, కాబట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేశారు. ఈ దీక్షను అప్రజాస్వామికంగా భగ్నం చేసిన ఏపీ ప్రభుత్వం...అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా విస్మరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
శంకుస్థాపన ప్రాంగణానికి ఏడు మార్గాలు
- వీఐపీలకు రెండు మార్గాలు కేటాయింపు - ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు బంద్ సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకునేందుకు పోలీసు యంత్రాం గం ఏడు మార్గాలను ప్రకటించింది. ఇందులో రెండు పూర్తిగా వీఐపీల కోసం కేటాయించగా ఐదింటిని సాధారణ ప్రజలు వచ్చే వాహనాలకు కేటాయించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏఏఏ పాస్‌లున్న వాహనాలు వెళ్లాల్సిన మార్గం - గన్నవరం విమానాశ్రయం వైపు నుంచి వచ్చే వాహనాలు బెంజిసర్కిల్-కనకదుర్గ వారధి, తాడేపల్లి అండర్‌పాస్ రోడ్డు, ఎన్టీఆర్ కరకట్ట, న్యూ లాక్ జంక్షన్, మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం మీదుగా భీష్మాచార్య రోడ్డు నుంచి శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి. - హైదరాబాద్ నుంచి వైపు వచ్చే వాహనాలు నందిగామ, ఇబ్రహీంపట్నం, బెంజి సర్కిల్, కనకదుర్గ వారధి, ఇస్కాన్ దేవాలయం, మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం మీదుగా భీష్మాచార్య రోడ్డు నుంచి ప్రాంగణానికి చేరుకోవాలి. - గుంటూరు వైపు నుంచి వాహనాలు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మీదుగా ఖాజా టోల్ ప్లాజా, కేఎల్ యూనివర్సిటీ, భీష్మాచార్య రోడ్డు ద్వారా శంకుస్థాపన ప్రాంతానికి చేరుకోవాలి. ఏఏ, ఏ పాసులు ఉన్న వాహనాలు - గన్నవరం విమానాశ్రయం వైపు నుంచి వచ్చే వాహనాలు బెంజిసర్కిల్, కనకదుర్గ వారధి, ఉండవల్లి గుహల మీదుగా కరకట్ట రోడ్డుకు సమాంతరంగా కొత్తగా వేసిన భీష్మాచార్య రోడ్డు ద్వారా ప్రాంగణానికి చేరుకోవాలి. - హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు నంది గామ, ఇబ్రహీంపట్నం, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహల వద్ద బ్రిడ్జి మీదుగా కరకట్టకు సమాం తరంగా కొత్తగా వేసిన రోడ్డు ద్వారా చేరుకోవాలి. - గుంటూరు వైపు నుంచే వచ్చే వాహనాలు నాగార్జున యూనివర్సిటీ, కాజా టోల్ ప్లాజా, కేఎల్ యూనివర్సిటీ, ఉండవల్లి సెంటర్, ఉండవల్లి గుహల వద్ద బ్రిడ్జి మీదుగా కరకట్టకు సమాంతరంగా వేసిన కొత్త రోడ్డు మీదుగా ప్రాంగణానికి చేరుకోవాలి. - విజయవాడ వైపు నుంచి సాధారణ సందర్శకులను తీసుకువచ్చే బస్సులు, లారీలు కనకదుర్గ వారధి, ఎన్ఆర్ఐ ఆస్పత్రి, డాన్‌బాస్కో స్కూల్, యర్రబాలెం, కృష్ణాయపాలెం, మందడం గ్రామానికి ఎదురుగా కొత్తగా వేసిన బైపాస్ రోడ్డు మీదుగా సభా ప్రాంగణానికి చేరుకోవాలి. - విజయవాడ వైపు నుంచి వచ్చే చిన్న వాహనాలు కనకదుర్గ వారధి, ఎన్ఆర్ఐ ఆస్పత్రి, మంగళగిరి పాతబస్టాండ్, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, మల్కాపురం, మందడం, తాళ్లాయపాలెం రోడ్డు మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి. - తమిళనాడు, నెల్లూరు, ఒంగోలు వైపు నుంచి వచ్చే అన్ని రకాల వాహనదారులు చిలకలూరిపే ట, గుంటూరు బైపాస్ రోడ్డు, పెదకాకాని, కంతే రు, తాడికొండ, పెదపరిమి, తుళ్లూరు, రా యపూడి, మోదుగలంకపాలెం, వెలగపూడి బై పాస్ మీదుగా శంకుస్థాపన ప్రాంతానికి చేరుకోవాలి. - కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు, హైదరాబాద్ నుంచి వచ్చే లారీలు, బస్సులు వినుకొండ, నర్సరావుపేట బైపాస్, ముప్పాళ్ల, సత్తెనపల్లి-నందిగామ అడ్డరోడ్డు, పెదకూరపాడు, అమరావతి, బోరుపాలెం, తుళ్లూరు బైపాస్, రాయపూడి, మోదుగలంకపాలెం, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి. - హైదరాబాద్, దాచేపల్లి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, నందిగామ అడ్డరోడ్డు, పెదకూరపాడు, అమరావతి, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, బోరుపాలెం, తుళ్లూరు బైపాస్‌రోడ్డు, రాయపూడి, మోదుగులలంక, వెలగపూడి బైపాస్ మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి. - కర్నూలు, కడప, అనంతపురం, హైదరాబాద్ నుంచి వచ్చే చిన్న వాహనాలు నర్సరావుపేట బైపాస్, ఫిరంగిపురం, పేరేచర్ల, గుంటూరు ఔటర్‌రింగ్ రోడ్డు, తాడికొండ రోడ్డు, పెదపరిమి, తుళ్లూరు, రాయపూడి, మోదుగలంకపాలెం మీదుగా శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకోవాలి. - శంకుస్థాపన రోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ ప్రకాశం బ్యారేజీపై వాహనాల రాకపోకలను అనుమతించరు. -
వంచనకు దూరంగా..
- రాజధాని శంకుస్థాపనకు గైర్హాజరు సరైందే..మాది సూత్రబద్ధమైన వైఖరి - నాడు తప్పులు వేలెత్తి చూపి నేడు చప్పట్లు కొట్టాలా..? - రాజధానికి కాదు.. రియల్ కుంభకోణాలనే వ్యతిరేకిస్తున్నాం - జగన్ గైర్హాజరీపై వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: వంచనకు దూరంగా... విలువలకు దగ్గరగా ఉండడమే తమ పార్టీ విధానమని, తమ నాయకుడు మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం అదేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంటున్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరు కాకపోవడంపై జరుగుతున్న చర్చకు స్పందిస్తూ వారు ఈ వ్యాఖ్య చేశారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని, ఆ పేరిట సాగుతున్న రియల్ఎస్టేట్ వ్యాపారాన్నే వ్యతిరేకిస్తున్నామని వివరించారు.సాంప్రదాయమనో, మర్యాద అనో, శంకుస్థాపనకు హాజరు కావడమంటే రాజధాని పేరుతో రాష్ర్ట ప్రభుత్వం సాగిస్తున్న కుంభకోణాలన్నిటికీ తాము ఆమోదముద్ర వేసినట్లవుతుందని, పేద రైతుల పొట్టకొట్టి సింగపూర్ బినామీ కంపెనీలకు దోచిపెట్టడాన్ని సమర్థించినట్లవుతుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇపుడు తాము ఈ కార్యక్రమానికి హాజరుకావడమంటే.. రాజధానికి సంబంధించి ఏ దశలోనూ అఖిలపక్షాన్ని భాగస్వామిని చేయకుండా రాష్ర్టప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలన్నిటికీ పచ్చజెండా ఊపినట్టవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వామపక్షాలు కూడా తమ వైఖరితోనే ఉన్నాయని మరో నేత పేర్కొంటూ సీపీఎం నిర్ణయించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ‘గుంటూరు పరిసరాలలో రాజధాని నిర్మాణం చేపడతామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిన రోజునే దానిని జగన్ స్వాగతించారు. ఆ తర్వాత జరుగుతున్న వ్యవహారాలనే ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. రాజధానికి సంబంధించి తాము ముందు నుంచీ చేస్తున్న విమర్శలకు సమాధానం లేనందున శంకుస్థాపనకు తనను ఆహ్వానించవద్దని తమ అధినేత జగన్ ముందుగానే సీఎం చంద్రబాబుకు సవివరమైన లేఖరాశారు.’ అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ‘రైతుల నుంచి బలవంతంగా భూములను సమీకరించడం, బహుళ పంటలు పండే పంట భూములను లాక్కోవడం, భూసేకరణ చట్టం ప్రయోగిస్తానని బెదిరించడం, రైతులపై కేసులు పెట్టడం, రాజధాని ప్రాంతంలో సెక్షన్ 144, సెక్షన్ 30 ప్రయోగించి రైతులను భయభ్రాంతులకు గురిచేయడం, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిపించకపోవడం, మొత్తంగా పారదర్శకత లేకపోవడం వంటి వాటిపై జగన్ అసెంబ్లీలోనూ, వెలుపలా నిలదీశారు. రాజధాని రైతుల కోసం ఆ ప్రాంతంలో పర్యటించి వారికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. అవన్నీ మరచిపోయి ఇపుడు ప్రభుత్వం దాదాపు రూ.400 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేస్తూ జరుపుతున్న శంకుస్థాపనకు జగన్ హాజరు కావాలా.. అలా చేస్తే ఈ తప్పులన్నిటికీ మేము ఆమోదముద్ర వేసినట్లు కాదా’ అని మరో సీనియర్ నేత ప్రశ్నించారు. ‘రాజధాని నిర్మాణం వ్యవహారం లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వెంచర్ మాత్రమేనని, అది పేదలకు పనికి వచ్చే రాజధాని కాదని జగన్ అనేకమార్లు విమర్శించారు.రైతుల నుంచి బలవంతంగా వేలాది ఎకరాల పంటపొలాలను లాక్కుని లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సాగిస్తుండడాన్ని మొదటి నుంచి నిలదీస్తున్న నేత జగన్. ఇవాళ శంకుస్థాపనకు హాజరైతే తనను తాను వంచించుకున్నట్లు కాదా? తప్పులన్నిటికీ ఆమోదముద్ర వేస్తున్నట్లు కాదా? అందుకే ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.’ అని మరో ముఖ్యనేత వివరించారు. ‘ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యత గలిగిన విపక్ష నేతకు ఏరోజూ ప్రాధాన్యం ఇవ్వలేదు. భూమి పూజప్పుడు ప్యూనుతో కబురంపారు. రాజధానిపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. పైగా వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడి చేశారు. ఇపుడు శంకుస్థాపనకు పిలవడంలో రాజకీయకోణం దాగి ఉందే తప్ప మరొకటి కాదు.’ అని ఇంకో సీనియర్ నేత వ్యాఖ్యానించారు. విలువలే ఊపిరిగా.. ‘జగన్ నేటి తరం నాయకుడు. హిప్పోక్రసీ తెలియని ముక్కుసూటి నేత. ఆత్మవంచనకు ఆయన ఆమడదూరం. సంప్రదాయ రాజకీయనాయకుల మాదిరిగా పైన ఒకరకం, లోన మరో రకంగా వ్యవహరించే నేత కాదు. మాటలకు చేతలకు పొంతన లేకుండా వ్యవహరించడం ఆయనకు సరిపడదు. రాజకీయాలలోనూ విలువలుండాలని కాంక్షించే వ్యక్తి. తాను నమ్మినదానిపై గట్టిగా నిలబడే రకం. ఈ విషయం ఇప్పటికే అనేకమార్లు రుజువయ్యింది. ఈ విషయాన్ని నేటి తరం అర్ధం చేసుకుంటోంది’’ అని వైఎస్ఆర్సీపీకి చెందిన ఓ యువనాయకుడు అభిప్రాయపడ్డారు. ‘ఓదార్పు యాత్ర విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని ఇబ్బందులెదురైనా ముందుకే సాగడం, కాంగ్రెస్ పార్టీలోనేకొనసాగితే కేంద్ర మంత్రిపదవి దక్కే అవకాశమున్నా, కేసులతో వేధించినా వెనక్కి తగ్గకపోవడం, సంతకాలు పెట్టిన 150 మంది ఎమ్మెల్యేలు వెంట నడిచే అవకాశమున్నా సీఎం పదవి చేపట్టకుండా రోశయ్యపేరును ప్రతిపాదించడం, ఒక ప్రాంతంలో పార్టీకి ఇబ్బంది తలెత్తుతుందని తెలిసినా సమైక్య ఉద్యమం సాగించడం ’ వంటివి జగన్ ముక్కుసూటితనానికి నిదర్శనాలని వారు వివరిస్తున్నారు. -
'గవర్నర్ గారు శంకుస్థాపనకు రండి'
హైదరాబాద్: ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరుతూ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు సీఎం చంద్రబాబునాయుడు ఆహ్వానపత్రిక అందజేశారు. ఆదివారం రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు.. గవర్నర్‌ను ఆహ్వానించారు. అంతకుముందు చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిశారు. ఈ నెల 22న గుంటూరులో రాజధాని శంకుస్థాపన జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. -
కేసీఆర్‌ను కలిసిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావును కలిశారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా చంద్రబాబు స్వయంగా కేసీఆర్ కు ఆహ్వానపత్రిక అందజేశారు. ఆహ్వానపత్రికతోపాటు తిరుపతి లడ్డును ప్రసాదంగా ఇచ్చారు. తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన చంద్రబాబును కేసీఆర్ సాదరంగా నివాసంలోకి ఆహ్వానించారు. చంద్రబాబు వెంట టీ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ ఉన్నారు. దాదాపు 45 నిమిషాలపాటు కొనసాగిన చంద్రబాబు, కేసీఆర్ భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహబూబ్ అలీ, మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత చంద్రబాబు.. కేసీఆర్‌ను కలిశారు. ఓటుకు నోటు కేసు వెలుగుచూడటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్, చంద్రబాబు కలుసుకోవడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 22న గుంటూరులో ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువరు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురు ప్రముఖులకు చంద్రబాబు స్వయంగా ఆహ్వానపత్రికలు అందజేస్తున్నారు. -
రాజధాని శంకుస్థాపనకు రూ. 400 కోట్లు!
-
మోదీ పర్యటన ఏడున్నర గంటలు
రాజధాని శంకుస్థాపనలో 1.15 గంటలు సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దసరా పండుగ రోజు ఏడున్నర గంటలపాటు రాష్ట్రంలో గడపనున్నారు. ఆయన ఈ నెల 22వ తేదీన రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో 1.15 గంటలపాటు పాల్గొంటారు. అనంతరం తిరుపతి విమానాశ్రయంలో గరుడ టెర్మినల్ ప్రారంభోత్సవం చేస్తారు. తరువాత తిరుపతిలోని శ్రీసిటీలో నెలకొల్పనున్న మొబైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ తొలిసారిగా స్వామి వారిని దర్శించుకోనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రధానమంత్రి కార్యాలయం శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. మోదీ పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి... * ఉదయం 9.25 గంటలకు: ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయల్దేరుతారు * 11.50: గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు * 11.55: గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అమరావతికి పయనం * మధ్యాహ్నం 12.20గంటలకు: అమరావతి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు * 12.25: అమరావతి హెలిప్యాడ్ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరుతారు * 12.30: రాజధాని శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకుంటారు * 12-30 నుంచి 1.45 వరకు: శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు * 1.50: శంకుస్థాపన ప్రాంగణం నుంచి రోడ్డుమార్గంలో అమరావతి హెలిప్యాడ్‌కు వెళ్తారు * 2: అమరావతి హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయల్దేరుతారు * 2.25: గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు * 2.30: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతికి బయల్దేరుతారు (విమానంలోనే భోజనం) * 3.25: తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు * 3.30 నుంచి 3.45 వరకు: తిరుపతి విమానాశ్రయంలో గరుడ టెర్మినల్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు * 3.50: తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గంలో శ్రీసిటీకి బయల్దేరుతారు * 3.55 నుంచి 4.15 వరకు: మొబైల్ మ్యానుఫాక్చరింగ్ హబ్ శంకుస్థాపనలో పాల్గొంటారు * సాయంత్రం 4.20గంటలకు: శ్రీసిటీ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి 5 గంటలకు తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. * 5 నుంచి 5.10 వరకు: పద్మావతి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు * 5.15: పద్మావతి అతిథి గృహం నుంచి బయల్దేరి శ్రీవారి దర్శనానికి వెళ్తారు. * 6.15: శ్రీవారి దర్శనంలో పాల్గొంటారు. అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. * 6.55: తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. * రాత్రి 7గంటలకు: తిరుపతి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు(రాత్రి భోజనం విమానంలోనే ఏర్పాటు చేశారు) -
గల్లీ, ఢిల్లీనే కాదు..అంతర్జాతీయ నేతలు కూడా..
- రాజధాని శంకుస్థాపనకు అన్ని స్థాయిల నేతలను ఆహ్వానిస్తామన్న సీఎం చంద్రబాబు విజయవాడ: ప్రజల కోరిక మేరకు రాజమండ్రిని, రాజమహేంద్రవరంగా మార్చామని శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పేరు మార్పుపై నోటిఫికేషన్‌ను కేంద్రానికి పంపుతామన్నారు. రాజధాని శంకు స్థాపన కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ నాయకులను ఆహ్వానిస్తామని చెప్పారు. గ్రామస్థాయి నేత నుంచి ప్రతిపక్షనేత వరకూ అందరిని ఆహ్వానిస్తామన్నారు. పోలవరం అంశాన్ని కేబినేట్ లో సుధీర్ఘంగా చర్చించామని తెలిపారు. పోలవరం పూర్తయితే ఏడు లక్షల ఎకరాలకు నీరందించే అవకాశం ఉందిని చెప్పారు. ముంపుమండలాలను ఆంధ్రపదేశ్ లో కలపడంతో అతిపెద్ద అడ్డంకి తొలగిపోయిందన్నారు. కృష్ణపట్నం పోర్టు రైల్వే లైన్ కోసం తొమ్మిది ఎకరాలు కేటాయించామన్నారు. -
‘సీమ’ ప్రాజెక్టుల తర్వాతే రాజధాని శంకుస్థాపన
ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాయలసీమ - నీటి సదస్సు ప్రజా ఉద్యమానికీ నడుంకట్టాలని ప్రజలకు పిలుపు సాక్షి, హైదరాబాద్: రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలుత పూర్తిచేశాకే రాజధాని శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆ ప్రాంతానికి చెందిన వివిధ రంగాల ప్రముఖులు డిమాండ్ చేశారు. నాలుగేళ్ల వరుస కరువుతో అల్లాడుతున్న సీమ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను విస్మరించి పాలకులు రాజధాని శంకుస్థాపనల పేరిట హడావుడి చేయడం తగదన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశాకనే ఇతర అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలన్నారు. రాయసీమ అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో నగరంలోని ప్రకాష్ నగర్లో ‘గ్రాట్’ వ్యవస్థాపకుడు విశ్రాంత ఐజీ ఎ.హనుమంతరెడ్డి అధ్యక్షతన ఆదివారం ‘రాయలసీమ - నీటి సదస్సు’ జరిగింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ విశ్రాంత చీఫ్ ఇంజనీర్, సెంటర్ వాటర్ కమిషన్ మాజీ డెరైక్టర్ శ్రీరాం రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై అక్కడి ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల నుంచి స్ఫూర్తిగా తీసుకొని అంతా కలిపి ప్రజా ఉద్యమం రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల వారూ ప్రత్యేక జేఏసీలు ఏర్పాటు చేసుకొని పోరాటం చేయాలన్నారు. సీమలో ఇంకా 60 లక్షల ఎకరాలకు నీరు అందాల్సి ఉందని తెలిపారు. రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తక్షణమే రాజధాని శంకుస్థాపన ఆపాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని కలిసి రాయలసీమ దుర్భిక్ష పరిస్థితులపైన, నీటి పంపకాల్లో జరుగుతున్న అన్యాయంపైనా అంతా తెలియజేయాలన్నారు. గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా వల్ల సీమకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. గుంటూరు నుంచి ఆపై జిల్లాలకే లాభం చేకూరుతుందని తెలిపారు. అఖిల భారత రైతు సమాఖ్య సలహాదారు చెంగల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమం రావాలన్నారు. ప్రాజెక్టుల సమగ్ర సమాచారాన్ని కరపత్రాలు, తదితర రూపాల్లో ప్రజలకు తెలియజేయాల్సి ఉందని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన ఎ.హనుమంత రెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంతం నుంచి రాజధాని, హైకోర్టును అప్పట్లో తరలించి అన్యాయం చేశారని తెలిపారు. తాగు నీటికి ప్రాధాన్యం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, 70 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని సదస్సు తీర్మానించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రైతు నేతలు దశరధరామిరెడ్డి, రత్నాకర్, జల సంఘం అధ్యక్షుడు ఇస్మాయిల్, ‘గ్రాట్’ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లే ఓబుల్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శ్యామల తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని భూమి పూజకు బ్రేక్?
-
రాజధాని భూమి పూజకు బ్రేక్?
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరానికి ఈనెల 6వ తేదీన నిర్వహించ తలపెట్టిన భూమిపూజకు బ్రేక్ పడేలా ఉంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు ఇప్పటికే విడుదలైనందున కోడ్ అమలులోకి వచ్చింది. దాంతో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు అక్కడ నిర్వహించకూడదు. ఆ రోజు ఉదయం 8.49కి రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేయాలని తలపెట్టారు. కోడ్ అమలులోకి వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం దాదాపుగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి వీల్లేదని అధికారులు సమాచారం అందించారు. దీంతో తలపట్టుకున్న ఏపీ ప్రభుత్వం.. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. తాము ఈ ముహూర్తం ముందే పెట్టుకున్నామని, అలాగే జూన్ 8వ తేదీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది అవుతుంది కాబట్టి పునరంకిత సభ పెట్టుకున్నామని, ఈ రెండింటికీ అనుమతి ఇవ్వాలని ఏపీ సర్కారు కోరింది. కానీ దానికి ఇంతవరకు ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అనుమతి రాకపోతే పరిస్థితి ఏంటని అధికారులు, నాయకులు తల పట్టుకుంటున్నారు. ఇప్పటికే ముహూర్తం గురించి అభ్యంతరాలున్నాయి. జ్యేష్ఠమాసంలో శంకుస్థాపనలు చేయరని పలువురు పండితులు అన్నారు. అయినా సర్కారు మాత్రం మొండిగా ముందుకే వెళ్తోంది. ఇప్పుడు కోడ్ ఫలితంగా బ్రేక్ పడేలా ఉంది.