
రాజధాని భూమి పూజకు బ్రేక్?
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరానికి ఈనెల 6వ తేదీన నిర్వహించ తలపెట్టిన భూమిపూజకు బ్రేక్ పడేలా ఉంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు ఇప్పటికే విడుదలైనందున కోడ్ అమలులోకి వచ్చింది. దాంతో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు అక్కడ నిర్వహించకూడదు. ఆ రోజు ఉదయం 8.49కి రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేయాలని తలపెట్టారు. కోడ్ అమలులోకి వచ్చింది కాబట్టి ఈ కార్యక్రమం దాదాపుగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి వీల్లేదని అధికారులు సమాచారం అందించారు.
దీంతో తలపట్టుకున్న ఏపీ ప్రభుత్వం.. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. తాము ఈ ముహూర్తం ముందే పెట్టుకున్నామని, అలాగే జూన్ 8వ తేదీకి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది అవుతుంది కాబట్టి పునరంకిత సభ పెట్టుకున్నామని, ఈ రెండింటికీ అనుమతి ఇవ్వాలని ఏపీ సర్కారు కోరింది. కానీ దానికి ఇంతవరకు ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అనుమతి రాకపోతే పరిస్థితి ఏంటని అధికారులు, నాయకులు తల పట్టుకుంటున్నారు. ఇప్పటికే ముహూర్తం గురించి అభ్యంతరాలున్నాయి. జ్యేష్ఠమాసంలో శంకుస్థాపనలు చేయరని పలువురు పండితులు అన్నారు. అయినా సర్కారు మాత్రం మొండిగా ముందుకే వెళ్తోంది. ఇప్పుడు కోడ్ ఫలితంగా బ్రేక్ పడేలా ఉంది.