కేసీఆర్ను కలిసిన చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావును కలిశారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా చంద్రబాబు స్వయంగా కేసీఆర్ కు ఆహ్వానపత్రిక అందజేశారు. ఆహ్వానపత్రికతోపాటు తిరుపతి లడ్డును ప్రసాదంగా ఇచ్చారు. తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన చంద్రబాబును కేసీఆర్ సాదరంగా నివాసంలోకి ఆహ్వానించారు. చంద్రబాబు వెంట టీ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ ఉన్నారు. దాదాపు 45 నిమిషాలపాటు కొనసాగిన చంద్రబాబు, కేసీఆర్ భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహబూబ్ అలీ, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి పాల్గొన్నారు.
దాదాపు ఎనిమిది నెలల తర్వాత చంద్రబాబు.. కేసీఆర్ను కలిశారు. ఓటుకు నోటు కేసు వెలుగుచూడటంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ ఇద్దరి మధ్య దూరం పెరిగినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్, చంద్రబాబు కలుసుకోవడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ నెల 22న గుంటూరులో ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువరు ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురు ప్రముఖులకు చంద్రబాబు స్వయంగా ఆహ్వానపత్రికలు అందజేస్తున్నారు.