గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో ప్రత్యేక హోదా గురించి పల్లెత్తు మాట మాట్లాడలేదు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని, ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరముందని ప్రజలు భావించినా... సీఎం చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.
చంద్రబాబు మాట్లాడుతూ గడిచిన 16 నెలల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి కొన్ని ప్రయోజనాలు చేకూరాయని, కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని చెప్పుకొచ్చారు. అయితే, రాజధాని శంకుస్థాపన సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించకపోవడం గమనార్హం
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నిరవధిక నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడులు పెద్దమొత్తంలో వస్తాయని, కాబట్టి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టి దీక్ష చేశారు. ఈ దీక్షను అప్రజాస్వామికంగా భగ్నం చేసిన ఏపీ ప్రభుత్వం...అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా విస్మరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.